టీకాలపై అమెరికన్ల విముఖత

ABN , First Publish Date - 2021-06-14T13:44:59+05:30 IST

మనదేశంలో ప్రజలు టీకా వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. వేయడానికి తగినన్ని టీకాలు లేవు! కానీ.. అమెరికాలో ప్రజలకు కావాల్సినదానికన్నా ఎక్కువ టీకాలు అందుబాటులో ఉన్నా, అక్కడ చాలా మంది వ్యాక్సి

టీకాలపై అమెరికన్ల విముఖత

  • ఒక డోసు టీకా వేయించుకున్నవారు 64 శాతం: సీడీసీ వెల్లడి
  • మిగతావారిలో మెజారిటీ ససేమిరా.. టీకాలకు ఎక్స్‌పైరీ గండం

వాషింగ్టన్‌: మనదేశంలో ప్రజలు టీకా వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. వేయడానికి తగినన్ని టీకాలు లేవు! కానీ.. అమెరికాలో ప్రజలకు కావాల్సినదానికన్నా ఎక్కువ టీకాలు అందుబాటులో ఉన్నా, అక్కడ చాలా మంది వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకు రావట్లేదు! టీకా వేయించుకున్నవారికి మిలియన్‌ డాలర్‌ ప్రైజులొచ్చే లాటరీలు.. ఉచిత బీర్లు.. మారిజువానా షాట్లు.. రైఫిళ్లు.. ఇలా ఎన్ని తాయిలాలు ప్రకటించినా కొంత మంది మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాము టీకా వేయించుకునే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చుంటున్నారు. దీంతో.. టెన్నిసీ, ఉత్తర కరోలినా వంటి రాష్ట్రాలు తమ వద్ద మిగిలిపోయిన టీకాలను సమాఖ్య ప్రభుత్వానికి (కేంద్రానికి) పంపేస్తున్నాయి.


అసలే కావాల్సినదానికన్నా ఎక్కువ టీకాలుండడం... వాటి ఎక్స్‌పైరీ గడువు కూడా ముంచుకొస్తుండడంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అమెరికన్లకు కావాల్సినన్ని టీకాల కోసం గత ఏడాదే అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌ పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ కంపెనీలకు కావాల్సిన ఆర్థిక సాయం రూ.75 వేల కోట్ల మేర అందించారు. దీంతో గత ఏడాది డిసెంబరు నాటికే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ట్రంప్‌ ఉన్నప్పుడే టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేశారు. ఆ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్‌ 100 రోజుల్లో 10 కోట్ల టీకాలు లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేశారు. దాన్ని ముందే సాధించారు. జూలై 4 (అమెరికా స్వాతంత్య్రదినోత్సవం) నాటికి అమెరికా ప్రజల్లో 70ు మందికి టీకాలు వేయడాన్ని తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం జూన్‌ను ‘జాతీయ కార్యాచరణ మాసం (నేషనల్‌ మంత్‌ ఆఫ్‌ యాక్షన్‌)’గా ప్రకటించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు.



వేయించుకుందామనే ఆసక్తి ఉన్నవారిలో మెజారిటీ ఇప్పటికే టీకాలు తీసేసుకున్నారు. మిగతావారిలో కొందరు టీకా వేయించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇలాంటివారంతా కలిపి 76ు దాకా ఉంటారని అంచనా. మిగిలిన 24శాతం మంది మాత్రం టీకా వేయించుకోబోమని చెబుతున్నారు. ఆ 24ు మందిలో కూడా 78ు మంది తమ ఆలోచనను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునే ప్రసక్తి లేదని తేల్చిచెబుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇలాంటివారే ప్రస్తుతం ఎక్కువగా ఉండడంతో వ్యాక్సినేషన్‌ జోరు తగ్గింది. ఏప్రిల్‌ రెండోవారం నాటికి రోజుకు సగటున 33 లక్షల డోసుల టీకాలు వేసిన అమెరికాలో ఇప్పుడు రోజుకు సగటున 8.7 లక్షల డోసులు కూడా ఇవ్వలేకపోతున్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారిలో 64 శాతం మంది కనీసం ఒక డోసు టీకా వేయించుకున్నారు. మిగతావారిలో కొందరు మాత్రమే సుముఖంగా ఉండడం.. ఎక్కువ మంది టీకా విముఖతతో ఉండడం సమస్యగా మారింది.


Updated Date - 2021-06-14T13:44:59+05:30 IST