చికిత్స కోసం దుబాయ్‌ వెళ్లి.. జైలులో పడ్డ అమెరికన్ !

ABN , First Publish Date - 2021-04-11T21:55:32+05:30 IST

అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఓ అమెరికన్‌ అనూహ్యంగా జైలులో పడ్డాడు.

చికిత్స కోసం దుబాయ్‌ వెళ్లి.. జైలులో పడ్డ అమెరికన్ !

దుబాయ్: అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఓ అమెరికన్‌ అనూహ్యంగా జైలులో పడ్డాడు. దుబాయ్ చేరుకున్న తర్వాత చికిత్సలో భాగంగా ఆ వ్యక్తికి మూత్ర పరీక్ష చేయగా.. దాంట్లో గంజాయి అవశేషాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని లాబొరేటరీ అధికారులు పోలీసులకు తెలియజేయడం, ఆ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడడం చకచక జరిగిపోయాయి. అసలేం జరిగిందంటే.. లాస్ వెగాస్‌కు చెందిన పీటర్ క్లార్క్(51) అనే వ్యక్తి గత కొంతకాలంగా ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నాడు. దాంతో చికిత్స కోసం ఫిబ్రవరి 24న లాస్ వెగాస్ నుంచి దుబాయ్ వెళ్లాడు. అక్కడికి చేరుకున్న రెండు మూడు రోజుల తర్వాత వైద్యులు పీటర్‌కు మూత్ర పరీక్ష నిర్వహించారు. ఈ టెస్టులో అతని మూత్రంలో గంజాయి అవశేషాలు బయటపడ్డాయి. 


దాంతో ల్యాబ్ సిబ్బంది, వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో మార్చి 3న పీటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తాజాగా కోర్టులో హాజరుపరచగా మూడేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, తనను జైలుకు తీసుకెళ్తున్న సమయంలో పీటర్ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను స్వదేశంలో గానీ, దుబాయ్‌లో గానీ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పీటర్ తెలిపాడు. అసలు తన మూత్రంలో గంజాయి అవశేషాలు బయటపడడం షాక్‌కు గురి చేసిందన్నాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని తెలిపాడు. కానీ, అక్కడి చట్టాల ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని పీటర్ వాపోయాడు. ఇంతకుముందు బ్రిటిష్ మాజీ ఆర్మీ అధికారి ఆండీ నీల్ కూడా ఇలాంటి కేసులోనే ఏడాది పాటు యూఏఈలో జైలు శిక్ష అనుభవించారు.         

Updated Date - 2021-04-11T21:55:32+05:30 IST