ప్రచారంలో అ‘మెరిక’లు

ABN , First Publish Date - 2020-07-01T08:35:52+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారతీయులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాది నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ప్రవాసుడు అమర్‌ దేవ్‌ అమర్...

ప్రచారంలో అ‘మెరిక’లు

  • అగ్ర రాజ్య ఎన్నికల్లో భారతీయుల కీలక పాత్ర
  • ట్రంప్‌నకు మద్దతుగా ఏడీ అమర్‌
  • రాజకీయ కార్యాచరణ కమిటీ ఏర్పాటు
  • బైడెన్‌ డిజిటల్‌ చీఫ్‌గా మేధారాజ్‌

వాషింగ్టన్‌, జూన్‌ 30: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారతీయులు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాది నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ప్రవాసుడు అమర్‌ దేవ్‌ అమర్‌ (ఏడీ అమర్‌) మరోసారి రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. డెమోక్రాట్ల అభ్యర్థి జొ బైడెన్‌ డిజిటల్‌ ప్రచార కార్యక్రమాల చీఫ్‌గా మేధారాజ్‌ నియమితులయ్యారు. కాగా, ‘ట్రంప్‌ కోసం ఇండియన్‌-అమెరికన్లు’ అని పేరు పెట్టిన కమిటీకి అమర్‌ నేతృత్వం వహించనున్నారు. 2016 ఎన్నికల సందర్భంగానూ అమర్‌ ఇలాంటి కమిటీనే ఏర్పాటు చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ చేసిన ఆయన తర్వాత అమెరికా వెళ్లి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివారు. ‘ఉగ్రవాద నిర్మూలన, వలస విధానాల క్రమబద్ధీకరణ సహా.. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మాత్రమే సరైన వ్యక్తి. అమెరికన్లందరి.. అందులోనూ భారత ఉపఖండ ప్రజల మద్దతు కూడగట్టడం మా ఉద్దేశం’ అని అమర్‌ తెలిపారు.


నాలుగేళ్ల కాలంలో ట్రంప్‌.. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి, అమెరికాను ప్రపంచంలో బలీయ శక్తిగా నిలిపేందుకు, శాంతి సాధనకు ట్రంప్‌ విశేష కృషి చేశారని, అందుకని మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయనే సరైన వ్యక్తిగా తమ సభ్యులు భావిస్తున్నట్లు కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు కరోనా ప్రభావంతో ఎన్నికల్లో వర్చువల్‌/ఆన్‌లైన్‌ ప్రచారానికి ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్‌ తరఫున మేధా రాజ్‌ కీలక పాత్ర పోషించనున్నారు.


Updated Date - 2020-07-01T08:35:52+05:30 IST