Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెరెనా ముందంజ

మూడో రౌండ్‌కు సిట్సిపాస్‌, జ్వెరెవ్‌, అజరెంకా 


పారిస్‌: రికార్డు టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా టెన్నిస్‌ క్వీన్‌ సెరెనా విలియమ్స్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌కు చేరడానికి చెమటోడ్చింది. 5వ సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, విక్టోరియా అజరెంకా కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 7వ సీడ్‌ సెరెనా 6-3, 5-7, 6-1తో మిహేలా బుబరెస్కూ (రొమేనియా)పై కష్టపడి నెగ్గింది.


2019 రన్నరప్‌ మార్కెటా వాండర్సోవా (చెక్‌) 6-1, 6-3తో హార్మొని టాన్‌పై, 15వ సీడ్‌ అజరెంకా 7-5, 6-4తో క్లారా టాసన్‌పై, కేటరీనా సినికొవా 7-6(7), 5-7, 7-5తో 29వ సీడ్‌ వెరోనికా కుడర్‌మెటోవాపై, అమెరికా ప్లేయర్‌ మాడిసన్‌ కీస్‌ 6-1, 7-5తో లేలా అన్నె ఫెర్నాండెజ్‌పై గెలిచారు. 10వ సీడ్‌ బెలిండా బెన్‌సిక్‌కు షాక్‌ తగిలింది. స్విస్‌ క్రీడాకారిణి బెలిండా 2-6, 2-6తో అన్‌సీడెడ్‌ డరియా కస్టాకినా (రష్యా) చేతిలో చిత్తయింది. 


సిట్సిపాస్‌ సునాయాసంగా.. : ఫైనల్‌ ఫేవరెట్లలో ఒకరైన గ్రీకువీరుడు సిట్సిపాస్‌ అలవోక విజయంతో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సిట్సిపాస్‌ 6-3, 6-4, 6-3తో పెర్డో మార్టినె్‌సను వరుస సెట్లలో ఓడించాడు. ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 7-6(4), 6-3, 7-6(1)తో రోమన్‌ సఫియుల్లీన్‌ (రష్యా)పై చెమటోడ్చి నెగ్గాడు. 15వ సీడ్‌ కాస్పర్‌ రడ్‌ (నార్వే) 6-3, 6-2, 6-4తో కమిల్‌ మజ్‌జెక్‌ (పోలెండ్‌)ను, ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 7-6(6), 6-1, 6-2తో మార్టన్‌ ఫుక్‌సోవిచ్‌ (హంగేరి)ను ఓడించారు. 11వ సీడ్‌ రాబర్టో బటిస్టుటా అగస్టా (స్పెయిన్‌) 3-6, 6-2, 3-6, 2-6తో హెన్రీ లాక్సోనెన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. కాగా, తొలి రౌండ్‌లో నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 6-2, 6-4, 6-2తో టెన్నిస్‌ శాండ్‌గ్రెన్‌ (అమెరికా)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకొన్నాడు. 


ఆకట్టుకొన్న కార్లా సువారెజ్‌.. : కేన్సర్‌ నుంచి కోలుకొని తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ బరిలోకి దిగిన స్పెయిన్‌ క్రీడాకారిణి కార్లా సువారెజ్‌ నవారో తొలి రౌండ్‌లో స్ఫూర్తిదాయ ప్రదర్శనతో ఆకట్టుకొంది. కార్లా 6-3, 6-7(4), 4-6తో మాజీ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌తో పోరాడి ఓడింది. నెల క్రితం హాడ్జ్‌కిన్స్‌ లింఫోమా కేన్సర్‌ నుంచి కోలుకున్న సువారెజ్‌.. సుమారు రెండున్నర  గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో దాదాపు గెలుపు అంచులకు చేరుకొంది. కానీ, రెండో సెట్‌ను టై బ్రేక్‌లో చేజార్చుకోవడంతో ప్రత్యర్థి స్టీఫెన్స్‌ పుంజుకొంది. 


శరణ్‌ జోడీ అవుట్‌: పురుషుల డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ జోడీ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. దివిజ్‌-ఫెడ్రికో డెల్బోనిస్‌ (అర్జెంటీనా) జంట 6-3, 6-7(13), 4-6తో  మ్యాట్‌-అలెక్స్‌ చేతిలో ఓడింది. 

Advertisement
Advertisement