డ్యామిట్.. ఒక్క అక్షరం దెబ్బ కొట్టింది.. Fake Vaccine సర్టిఫికేట్‌‌తో America మహిళ.. Airportలో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-03T02:22:25+05:30 IST

ఎంత పెద్ద నేరస్థులయినా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తారు. ఆ తప్పే వాళ్ల ప్లానింగ్ మొత్తాన్ని దెబ్బ తీస్తుంది. తాజాగా అమెరికాలోని ఇల్లినాయిస్ ప్రాంతానికి..

డ్యామిట్.. ఒక్క అక్షరం దెబ్బ కొట్టింది.. Fake Vaccine సర్టిఫికేట్‌‌తో America మహిళ.. Airportలో ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఎంత పెద్ద నేరస్థులయినా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తారు. ఆ తప్పే వాళ్ల ప్లానింగ్ మొత్తాన్ని దెబ్బ తీస్తుంది. తాజాగా అమెరికాలోని ఇల్లినాయిస్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కూడా ఇలానే పట్టుబడింది. ఆమె చేసిన నేరం గురించి పక్కన పెడితే.. ఆమె పట్టుబడడానికి కారణమైన తప్పే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ చిన్న తప్పు కారణంగా ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇంత ప్రమాదకర పరిస్థితిని చాలా లైట్ తీసుకుంటున్నారు. దానికి తోడు చాలా కాలంగా ఇంట్లోనే ఉండడంతో విసిగిపోయి ఎలాగైనా విహారయాత్రలకు వెళ్లాలని పనికిమాలిన ప్లానింగ్ చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన ఓ 24 ఏళ్ల యువతి కూడా ఇలాంటి ఓ చెత్త ప్లాన్ వేసి హవాయ్‌ వెకేషన్‌కు వెళ్లింది. అయితే చిన్న తప్పుతో దొరికిపోయి జైల్లో పడింది. 


వ్యాక్సిన్ వేయించుకోకుండా ఎవరైనా హవాయ్‌లో అడుగుపెడితే.. అక్కడి రూల్స్ ప్రకారం 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ అన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండడం, వెకేషన్ మిస్ కావడం ఇష్టం లేని ఆమె.. వ్యాక్సిన్ తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఓ ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి అప్‌లోడ్ చేసింది. అయితే ఇక్కడే ఆమె ఓ చిన్న తప్పు చేసింది. తాను మొడెర్నా వ్యాక్సిన్ వేయించుకున్నానని ఆ సర్టిఫికేట్‌లో పేర్కొన్న యువతి.. మొడెర్నా స్పెల్లింగ్ తప్పుగా రాసి దొరికిపోయింది. MODERNA బదులు MADERNA అని సర్టిఫికేట్‌లో ఉండడాన్ని హవాయ్‌లోని హొనొలులూ ఎయిర్‌పోర్ట్ అధికారులు స్కానర్స్ సాయంతో గుర్తించారు. 


టీకా పేరు తప్పుగా ఉండడం, అలాగే ఇల్లినాయిస్‌లో నివశిస్తున్నా ఆమె.. దాదాపు 872.4 మైళ్ల(14 కిలోమీటర్లకు పైగా) దూరంలో ఉన్న  డెలవారే ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఉండడం వంటి తప్పులను గుర్తించారు. ఈ క్రమంలోనే హవాయ్ అటార్నీ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ ఏజెంట్ విల్సన్ లావ్ డెలవారే అధికారులకు ఓ లేఖ రాశారు. ఆమె పేరు తెలిపి వ్యాక్సినేషన్ జరిగిందేమో అడిగారు. అయితే డెలవారే అధికారులు దీనిపై స్పందిస్తూ.. ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తమ రిపోర్టుల్లో లేదని వెల్లడించింది.


దీంతో ఆమెను అరెస్టు చేసిన హవాయ్ పోలీసులు.. హవాయ్ అత్యవరసర నిబంధనలను అతిక్రమించడం, అధికారులను తప్పుదోవ పట్టించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొంత కాలం జైల్లో ఉంచి ఆ తర్వాత 2వేల డాలర్లు(దాదాపు రూ.1,50వేలు) పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.


ఏదో విహారయాత్ర ఎంజాయ్ చేద్దామని వెళ్లి, 10 రోజులు క్వారంటైన్ ఉండడం ఇష్టం లేక చేసిన ఓ తప్పు ఇప్పుడు ఆమె వెకేషన్‌ను పూర్తిగా నాశనం చేసింది. కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది.

Updated Date - 2021-09-03T02:22:25+05:30 IST