ఈ అమెరికా అమ్మాయి కేరళ కుట్టి!

ABN , First Publish Date - 2020-12-28T05:52:14+05:30 IST

అపర్ణా మల్బరీ... అమెరికా అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మలయాళం పాఠాలు నేర్పుతోంది. కేరళ వాళ్లకి ఏమాత్రం తీసిపోకుండా స్పష్టమైన ఉచ్ఛారణతో పాఠాలు నేర్పుతూ ఆశ్చర్యపరుస్తోంది...

ఈ అమెరికా అమ్మాయి కేరళ కుట్టి!

అపర్ణా మల్బరీ... అమెరికా అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మలయాళం పాఠాలు నేర్పుతోంది.  కేరళ వాళ్లకి ఏమాత్రం తీసిపోకుండా స్పష్టమైన ఉచ్ఛారణతో  పాఠాలు  నేర్పుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఆ పాఠాలు సామాజిక వేదికల్లో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.


అపర్ణ తల్లిదండ్రులు జీవిత అర్థం, పరమార్థాలను శోధిస్తూ ఆధ్యాత్మిక గురువు కోసం ఇండియా వచ్చారు. ఇక్కడే ఇద్దరూ తొలిసారి కలిశారు. ఆ పరిచయం  కాస్తా  ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లిచేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ జంట అమెరికాకు తిరిగి వెళ్లిపోయింది. అక్కడే అపర్ణ పుట్టింది. అయితే వీళ్లు అమెరికాకు వెళ్లినా అక్కడ ఉండలేకపోయారు. దాంతో అపర్ణకు మూడేళ్ల వయసులో  తిరిగి భారత్‌కు వచ్చారు. వీరి ఆధ్యాత్మికగురువు మాతా అమృతానందమయి. అందుకే అపర్ణ తల్లిదండ్రులు 1992లో  కేరళలోని కొల్లాంకు చేరుకున్నారు. అపర్ణకు పదిహేనేళ్లు వచ్చేవరకూ కొల్లాంలోనే ఉన్నారు. తర్వాత తిరిగి  అమెరికా వెళ్లారు. పదిహేనేళ్ల వయసు దాకా అమృత ఇక్కడి సంస్కృతీ పద్థతుల మధ్య పెరగడ ంతో అమెరికా సంస్కృతి అపర్ణకు పెద్ద షాక్‌ ఇచ్చింది. అక్కడి జీవనశైలిని తట్టుకోలేక పోయింది. ఒక దశలో డిప్రషన్‌లోకి సైతం వెళ్లింది. చివరకు మెల్లగా  అమెరికాలో జీవించడం అలవాటు చేసుకుంది. అయితే  కేరళకు, మలయాళం భాషకు దూరం కాకూడదని నిశ్చయించుకుంది.


‘నా భారతీయ సంస్కృతీ మూలాలను వదులుకోవద్దన్నారు మా నాన్న.  అంతేకాదు నా అసలైన ‘ఉనికి’ని పోగొట్టు కోవద్దన్నారు. అలా నాకు ఆయన మార్గనిర్దేశం చేశారు’ అని అపర్ణ గుర్తుచేసుకుంది. కేరళలోని తన పాత స్నేహితులతో  పరిచయాలను తిరిగి  ప్రారంభించింది. ఆరు నెలల క్రితమే ‘ఇన్‌వర్టెడ్‌ కోకోనట్‌’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని ప్రారంభించింది. కేవలం ఆరు నెలల కాలంలో మలయాళ భాషపై తనకున్న పట్టుతో మలయాళీలతో పాటు అందరి హృదయాలను సైతం కొల్లగొట్టింది. అపర్ణ కేరళలో పెరిగినా పాఠశాలలో సంస్కృత భాషను తన లాంగ్వేజ్‌గా ఎంచుకుంది. అయినా ఆమె మలయాళాన్ని ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేకాదు అపర్ణ మాట్లాడేటప్పుడు స్థానిక మలయాళంలో కనిపించే లోకల్‌ టింజ్‌ సైతం ఉంటుంది. స్నేహితుల సహాయంతో  మలయాళం భాషను అపర్ణ నేర్చుకుంది. తాము చదివింది ఇంగ్లీష్‌ మీడియం అయినా స్నేహితులందరూ ఆమెతో మలయాళంలోనే మాట్లాడేవారు. అలా  అపర్ణకు మలయాళం బాగా వంటబట్టింది.  ఇప్పుడు ఎంతోమంది యూరోపియన్లకు అపర్ణ మలయాళం నేర్పిస్తూ వాళ్లు ఆ భాషను మాట్లాడుతుంటే, రాస్తుంటే ఆనందించిపోతోంది. వాట్స్‌పల ద్వారా వారితో నిత్యం చాటింగ్‌ చేస్తూ వారి భాషను మరింత మెరుగుపరుస్తోంది.  


నిజానికి తల్లిదండ్రులు అపర్ణకు  తొలుత   శైషా అని  పేరు పెట్టారు.  కానీ అది అపర్ణకు నచ్చలేదు. ఆరేడేళ్ల వయసులో మాతా అమృతానందమయిని కలిసినప్పుడు శైషా  తన  పేరును మార్చాలని ‘అమ్మ’ను  కోరిందట. ఇప్పుడు కాదన్నా తను వినకపోవడంతో  అమృతానందమయి  అపర్ణ అని పేరుపెట్టిందట. అన్నింటికీ  మాతా ఆనందమయే తనకు స్ఫూర్తి అంటుంది. ఆమే తన ‘గురువు’ అంటుంది. ‘నా  అంతరంగాన్ని  దైవత్వంతో అనుసంధానం చేసుకోవడానికి ‘అమ్మ’ నాకెంతో స్ఫూర్తినిచ్చిందని అపర్ణ ఆనందంగా చెప్తుంది.




విభిన్న భాషలు నేర్చుకోవడం వల్ల  ప్రజల మధ్య ఉండే సంస్కృతీ, జీవనశైలి  అంతరాలు చెరిగిపోతాయని  అపర్ణ చెప్తుంటుంది.  తాను స్వానుభవంతో చెపుతున్న మాటలు ఇంటుంది. కేరళ అన్నా, అక్కడి ప్రజల ప్రేమాప్యాయతలన్నా, కొత్తవారిని సైతం సాదరంగా ఆహ్వానించే వాళ్ల ఆత్మీయత అన్నా  తనకు  ప్రాణమంటుంది. కేరళ తన సొంత ఇల్లు అంటుంది. ‘భారత భూమిలో మంత్రముగ్ధులను చేసే  అద్భుతశక్తి, ఏదో తెలియని దివ్యత్వ మంత్రజాలం దాగుంద’ంటుంది ఎప్పుడూ. అపర్ణ ఎల్‌జిబిటిక్యూఇ కమ్యూనిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం తన ‘భార్య’ అమృతశ్రీతో కలిసి ఫ్రాన్సులో ఉంటోంది. అమృతశ్రీ కార్డియాలజిస్ట్‌. ఆమె కూడా అమృతానందమయి భక్తురాలు. అమృతామయి ఆశ్రమంలోనే అమృతాశ్రీని అపర్ణ కలిసింది. ఆమెది కూడా తన కథలాగే ఉండడంతో సహజీవనం చేస్తున్నానంటోంది.

Updated Date - 2020-12-28T05:52:14+05:30 IST