రాజస్థాన్ సంక్షోభానికి తెర..!

ABN , First Publish Date - 2020-08-10T21:41:02+05:30 IST

మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా..

రాజస్థాన్ సంక్షోభానికి తెర..!

జైపూర్: మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తాజాగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్దుబాటు చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలుసుకోనున్నారని, పైలట్ వర్గీయులు తొలుత రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను కలుసుకుని అనంతరం రాహుల్ గాంధీని కలిసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌ను పైలట్ కలుసుకోవచ్చంటూ సంకేతాలు వెలువడుతున్నాయి.


అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు స్వయంగా పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేసినట్టు చెబుతున్నారు. గెహ్లాట్‌తో విభేదాలను ఇటీవల పైలట్ బహిర్గతం చేయడం, సీఎల్‌పీ సమావేశాలకు గైర్హాజర్ కావడంతో ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ  తొలగించింది. గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలను జైసల్మేర్ హోటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో హోటల్‌లోనే సీఎల్‌పీ సమావేశాన్ని గెహ్లాట్ ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి తీసుకునే విషయపై ప్రధానంగా చర్చ జరిగింది.


అసెంబ్లీలో విపక్ష బీజేపీకి, అధికార కాంగ్రెస్‌కు మధ్య సంఖ్యాబలం పరంగా తేడా చాలా తక్కువగా ఉన్నందున అసమ్మతి ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకోవడమే మంచిదని పలువురు సీఎల్‌పీ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. మరికొందరు మాత్రం పైలట్ వర్గీయులను వెనక్కి తీసుకునే విషయంలో విముఖత చూపినట్టు తెలుస్తోంది.


వేచిచూస్తున్న గెహ్లాట్..

తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో జరగబోయే పరిణామాలను ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు, సయోధ్య కోసం పైలట్, ఆయన విధేయ ఎమ్మెల్యేలతో పార్టీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పైలట్, ఆయన వర్గీయులు బేషరతుగానే తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Updated Date - 2020-08-10T21:41:02+05:30 IST