Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 25 2021 @ 21:03PM

శ్రీనగర్‌ సభలో బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని తొలగించిన అమిత్ షా

శ్రీనగర్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో తన వేదిక వద్దనున్న బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్‌ను తొలగించారు. ప్రజలతో నేరుగా మాట్లాడాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. పాకిస్థాన్‌తో భారత ప్రభుత్వం మాట్లాడాలని ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారని, తాను కశ్మీరు లోయలోని యువతతోనూ, ప్రజలతోనూ మాట్లాడతానని తెలిపారు. 


తనపై ఆగ్రహం వ్యక్తమైందని, తన చర్యలను ఖండించారని, అయితే నేడు తాను వివరంగా మాట్లాడాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకే బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ కానీ, భద్రత కానీ  వేదిక వద్ద లేవన్నారు. ‘‘నేను ఈ విధంగా మీ ముందు నిల్చున్నాను’’ అన్నారు. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారని, అయితే తాను ఓ విషయాన్ని ఆయనకు స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నానని తెలిపారు. తాను కశ్మీరు లోయలోని యువతతోనూ, ప్రజలతోనూ మాట్లాడతానని చెప్పారు. 


ఇదిలావుండగా, అమిత్ షా పుల్వామా జిల్లా, లేత్‌పొరలో ఉన్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శిబిరాన్ని సోమవారం రాత్రి సందర్శిస్తారు.  సైనికులతో కలిసి విందు ఆరగించి, అక్కడే బస చేస్తారు. 2019 ఫిబ్రవరి 14న లేత్‌పొరలో భద్రతా సిబ్బంది వాహనాలపై జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. 


అమిత్ షా మూడు రోజుల పర్యటన కోసం జమ్మూ-కశ్మీరుకు శనివారం వచ్చారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్ చేరుకోగానే ఆయన నేరుగా నౌగామ్ వెళ్ళారు. ఈ ఏడాది జూన్‌లో ఉగ్రవాదులు హత్య చేసిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో భద్రతా పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఆదివారం జమ్మూలో బహిరంగ సభలో మాట్లాడారు. భారత్-పాక్ సరిహద్దులను సందర్శించి, బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement