న్యాయ వ్యవస్థపై బురదజల్లొద్దు

ABN , First Publish Date - 2020-09-24T07:38:42+05:30 IST

న్యాయ వ్యవస్థపై బురదజల్లే పనులు ఏవీ చేయవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏపీ సీఎం జగన్‌కు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది.

న్యాయ వ్యవస్థపై బురదజల్లొద్దు

జగన్‌కు అమిత్‌షా స్పష్టీకరణ.. కేసుల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని వెల్లడి!.. సీబీఐపైనా హామీ ఇవ్వని షా

తెచ్చిన పత్రాలు ఇచ్చి వెనుదిరిగిన సీఎం 

న్యాయ నిపుణులు, జడ్జిల అభిప్రాయాలను వివరించిన తుషార్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థపై బురదజల్లే పనులు ఏవీ చేయవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏపీ సీఎం జగన్‌కు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘ఢిల్లీ పిలుపు’ మేరకు హస్తినకు వెళ్లిన జగన్‌ మంగళవారం రాత్రి  అమిత్‌షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘వ్యవస్థలతో పెట్టుకోవడం సరికాదు’ అని అప్పుడే అమిత్‌ షా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత బుధవారం మరోసారి కలుద్దామని జగన్‌ను పంపించారు. బుధవారం ఉదయం పది గంటల తర్వాత  అమిత్‌ షాను కలుసుకున్న జగన్‌ కేవలం 15 నిమిషాల్లోనే బయటికి వచ్చారు.


ఏపీలో జరుగుతున్న పరిణామాలు, న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించడంపై అంతకుముందే  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతోపాటు పలువురు న్యాయ నిపుణులను అమిత్‌షా సంప్రదించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... ఈ విషయంలో  పలువురు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అమిత్‌షాకు తుషార్‌ మెహతా వివరించారు. జగన్‌ తమ దృష్టికి తీసుకొచ్చిన కేసుల వివరాలు, వాటి విచారణ దశ గురించి కూడా అమిత్‌ షా సమాచారం సేకరించి పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత... కోర్టు తీర్పులు, వాటి పరిశీలనలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం కలుగజేసుకోలేదని, ఆయా అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించలేమని అమిత్‌ షా స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో జగన్‌ తాను తెచ్చిన పలు డాక్యుమెంట్లను అమిత్‌ షాకు సమర్పించి వెనుదిరిగారు.


వైసీపీ నేతల్లో నిరాశ

జగన్‌ ఢిల్లీ పర్యటనలో తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వైసీపీ శిబిరంలో నిరాశ కనిపించింది. న్యాయ వ్యవస్థపై జగన్‌ తీరుపట్ల అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేయడం, తాము కోరిన అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అసంతృప్తి నెలకొంది. అమిత్‌ షాను జగన్‌ కలిసిన వెంటనే వివిధ అంశాలపై కేంద్రం సీబీఐ విచారణ ప్రకటిస్తుందని వారు ఆశించారు. ‘‘జగన్‌ చెప్పాల్సింది చెప్పారు. ఇవ్వాల్సిన పత్రాలు ఇచ్చారు. కానీ, అమిత్‌ షా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అని వైసీపీ నేత ఒకరు చెప్పారు.


చికాకుగా జగన్‌...

మంగళవారం రాత్రంతా జగన్‌ చికాకుతో గడిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో రాత్రి 9 గంటలకు సీఎం బస చేసిన జన్‌పథ్‌ నివాసానికి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. అమిత్‌ షా నివాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా సరఫరా పునరుద్ధరించలేకపోయారు. దీంతో... రాత్రిబాగా పొద్దుపోయాక జగన్‌ ఏపీ భవన్‌లోని గవర్నర్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం న్యాయ నిపుణులతో చర్చిస్తూ గడిపారు. మరోసారి అమిత్‌ షాను కలిసి వచ్చిన తర్వాత... ఏపీ భవన్‌లో ఎంపీలు విజయ సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డిలతో చర్చించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రేణిగుంటకు బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2020-09-24T07:38:42+05:30 IST