కశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST

జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

కశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

అలాంటి వారి ప్రయత్నాలను సాగనివ్వం

ఇప్పటికే రూ.35 వేల కోట్ల పెట్టుబడులు

జమ్మూ కశ్మీర్‌ పర్యటనలో అమిత్‌ షా 

శ్రీనగర్‌/జమ్మూ, అక్టోబరు 24: జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఇకపై కశ్మీర్‌, జమ్మూ రెండూ కలిసి అభివృద్ధి చెందుతాయని, దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం రెండో రోజు జమ్మూలో రూ.210 కోట్లతో నిర్మించిన ఐఐటీ క్యాంప్‌సను ఆయన ప్రారంభించారు. అనంతరం జమ్మూలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అంతకుముందు భగవతినగర్‌లో నిర్వహించిన ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడారు. ‘‘ఇది మాతా వెష్ణోదేవి ఆలయాల భూమి. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ త్యాగాల గడ్డ. ఇక్కడ శాంతి, సామరస్యాలను దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రభుత్వ వారి ప్రయత్నాలను సాగనివ్వదు’’ అని అన్నారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 సంవత్సరాంతానికి రూ.51 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.


ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సాధ్యమయిందన్నారు. లక్షలాది మంది ప్రజలను అన్యాయానికి గురి చేసిన, వివక్షా పూరితమైన ఈ ఆర్టికల్‌ అమలును రద్దు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీంతో అన్ని వర్గాలవారు ఇక్కడ భూములు కొనుక్కునేందుకు, రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అవకాశం లభించిందన్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఇక్కడ పంచాయతీలకు, సమితులకు, జిల్లా అభివృద్ధి మండళ్లకు తొలిసారి ఎన్నికలు నిర్వహించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ఇకపై జమ్మూ కశ్మీర్‌లో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావచ్చని అన్నారు. ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ ప్రజలపై ప్రేమతో  ప్రధాని మోదీ ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకురూ.35 వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఎయిమ్స్‌ ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Updated Date - 2021-10-24T05:30:00+05:30 IST