Abn logo
Oct 15 2021 @ 02:05AM

తీరు మారకుంటే మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్‌

పాకిస్థాన్‌కు అమిత్‌ షా హెచ్చరిక

పనాజీ, అక్టోబరు 14: పాకిస్థాన్‌పై మన దేశం మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తుందా? అంటే.. ఆ దేశం తీరు మార్చుకోకపోతే తప్పకపోవచ్చనే సమాధానం కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మాటల్లో కనిపిస్తోంది. గోవాలోని ధర్బన్‌దోరా గ్రామంలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాక్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ‘‘కశ్మీరీలను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయడం వెంటనే ఆపాలి. అతిక్రమణలనూ మానుకోవాలి. దాడులను మన దేశం సహించేది లేదని ఇదివరకటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిరూపించాయి. సరిహద్దులను అస్థిరపరచాలని చూస్తే ఊరుకోబోమనే సందేశాన్ని పంపాయి. చర్చలకు సమయం ఉన్నా గట్టిగా జవాబు చెప్పాల్సిన సమ యం మళ్లీ వచ్చింది.


పాక్‌ పోకడ మారకపోతే మరిన్ని సర్జికల్‌ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పక తప్పదు’’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. 2016 సెప్టెంబరు 18న కశ్మీర్‌లోని ఉరి, పఠాన్‌కోట్‌, గురుదా్‌సపూర్‌లలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రదాడులకు ప్రతీకారంగా సెప్టెంబరు 29న మన దేశం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి పాకిస్థాన్‌లోని పలు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన సం గతి తెలిసిందే. కాగా, ఆరేళ్ల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో ఘటనా ప్రదేశాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అమిత్‌షా తెలిపారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగంలో శిక్షణ పొందిన వారి కొరత దర్యాప్తులో ఉన్న కేస్‌ల సంఖ్య పెరగడానికి కారణమవుతోందన్నారు.