అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు : అమిత్ షా

ABN , First Publish Date - 2021-10-24T21:16:47+05:30 IST

జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు : అమిత్ షా

జమ్మూ : జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో జమ్మూలో నూతన అభివృద్ధి శకం ప్రారంభమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిని దారి తప్పించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నామన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలిసారి పర్యటిస్తున్నారు.


జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి, జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అమిత్ షా తొలిసారి జమ్మూ-కశ్మీరులో పర్యటిస్తున్నారు. 


జమ్మూలో ఆదివారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో నూతన క్యాంపస్‌ను  అమిత్ షా ప్రారంభించారు. అనంతరం భగవతి నగర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో  ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిందన్నారు. వాల్మీకులు, ప్రహరీలు, గుజ్జర్లు, బేకర్‌వాల్స్, పశ్చిమ పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులు, మహిళలకు సమాన న్యాయం చేసిందన్నారు. 


ఈ ప్రాంతంలో అభివృద్ధికి విఘాతం కల్పించేందుకు కొందరు ప్రయత్నించారని, దానిని ప్రభుత్వం జరగనివ్వలేదని చెప్పారు. అందరికీ న్యాయం చేయడం కోసం అటవీ హక్కుల చట్టం వంటి అనేక చట్టాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జమ్మూ ప్రజలకు అన్యాయం జరిగే కాలం పోయిందని చెప్పడానికి తాను వచ్చినట్లు తెలిపారు. ‘‘ఇక ఎవరూ మీకు అన్యాయం చేయలేరు’’ అని చెప్పారు. 


జమ్మూ-కశ్మీరు గత పాలకుల గురించి మాట్లాడుతూ, ‘‘మీరు ఏం ఇస్తారని ఈ మూడు కుటుంబాలు నన్ను అడుగుతున్నాయి. నేను వారిని అడుగుతాను. ఏమిటంటే, మీరు అంత కాలం పరిపాలించారు. మీరు ఏం చేశారు? ఇంత కాలం మీరు ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని వారు అడుగుతున్నారు. ఇన్నేళ్ళూ మీరు జమ్మూ-కశ్మీరు ప్రజల కోసం ఏ చేశారో వివరించాలని వారు కోరుతున్నారు’’ అని చెప్పారు. 


జమ్మూ-కశ్మీరు దేవాలయాల ప్రదేశమని, త్యాగాల గడ్డ అని తెలిపారు. వైష్ణో దేవి దేవాలయం, ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీల త్యాగాల గురించి ప్రస్తావించారు. ప్రశాంతతకు భంగం కలిగించేవారిని గెలవనివ్వబోమని స్పష్టం చేశారు. ఒక దేశానికి రెండు విధాన సభలు, రెండు కార్యనిర్వాహక శాఖలు, రెండు న్యాయ వ్యవస్థలు ఆచరణ సాధ్యం కాదని వీరు నినదించారన్నారు. 


గతంలో ఐదు వైద్య కళాశాలలు ఉండేవని, ఇప్పుడు పుష్కలంగా వైద్య కళాశాలలు వస్తున్నాయని చెప్పారు. గతంలో 500 మంది డాక్టర్లు ఉండేవారని, ఇప్పుడు వీరి సంఖ్య 5,000కు పెరిగిందని తెలిపారు. నేడు జమ్మూలో అత్యాధునిక ఐఐటీని చూస్తున్నామన్నారు. ఇటీవల ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని 25 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ ఒక్క రోజే సుమారు 7,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని ఆ మూడు కుటుంబాలు ఎగతాళి చేశాయని, అయితే ఇప్పటికే రూ.12,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 2022నాటికి రూ.51 వేల కోట్ల విలువైన పెట్టుబడులు, సుమారు 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 


Updated Date - 2021-10-24T21:16:47+05:30 IST