జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న అమిత్‌షా

ABN , First Publish Date - 2021-10-19T19:18:38+05:30 IST

అమాయక పౌరులు, మైనారిటీలు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఇటీవల వరుస హత్యలకు పాల్పడుతున్న..

జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న అమిత్‌షా

శ్రీనగర్: అమాయక పౌరులు, మైనారిటీలు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఇటీవల వరుస హత్యలకు పాల్పడుతున్న జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటించనుండటం ఇదే మొదటిసారి. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే సైతం ఈ పర్యటనలో పాల్గోనున్నారు.


కాగా, గత కొద్దిరోజులుగా స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న ఘటనలు కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఇంతవరకూ 11 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపగా, వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద ఏరివేత చర్యలను భద్రతా దళాలు తీవ్రం చేశాయి. డజనుకు పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అమిత్‌షా సైతం కశ్మీర్‌లో ఉగ్రఘాతుకాలతో సహా వివిధ భద్రతా అంశాలపై సోమవారంనాడు రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల చీఫ్‌లతో చర్చించారు. న్యూఢిల్లీలో ని ఐబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్‌ ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని, అధికారులతో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశంలో దేశంలోని భద్రతా పరిస్థితి, శాంతి భద్రతల సమస్యలు, కశ్మీర్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరుపుతున్న ఘాతుకాలను చర్చించారు.

Updated Date - 2021-10-19T19:18:38+05:30 IST