Abn logo
Oct 23 2021 @ 14:29PM

ఎస్ఐ కుటుంబాన్ని పరామర్శించిన అమిత్‌షా

శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో గత నెలలో అమరుడైన ఇన్‌స్పెక్టర్ పర్వెజ్ అహ్మద్ కుటుంబాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారంనాడు పరామర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం ఉదయం జమ్మూకశ్మీర్ వచ్చిన అమిత్‌షా నేరుగా పర్వెజ్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో తన పర్యటన ప్రారంభించారు. పర్వెజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పేపర్లను స్వయంగా ఆయన అందజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డీజీపీ దిల్‌బాగ్ సింగ్ కేంద్ర హోం మంత్రి వెంట ఉన్నారు.

అంతకుముందు, శ్రీనగర్ విమానాశ్రయం వద్ద అమిత్‌షాకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస కాల్పుల్లో సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 370వ అధికరణ తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఆయన పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా భద్రతాంశలపై రాజ్‌భవన్‌లో జరిపే సమావేశానికి అమిత్‌షా అధ్యక్షత వహించనున్నారు. కార్ప్స్ కమాండర్లు, జేకే పోలీస్ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌లు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. మిలిటెంట్లు ఇటీవల కాల్చిచంపిన సిక్కు టీచర్ లాల్ బిండ్రూ, ఒక ముస్లిం పౌరుడి కుటంబాలను కూడా అమిత్‌షా పరామర్శించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారంనాడు ఐఐటీ కాన్వొకేషన్‌లోనూ, ఆ తర్వాత ఒక బహిరంగ సభలోనూ షా ప్రసంగించనున్నారు. కశ్మీరీ పండిట్ల ప్రతినిధులతోనూ ఆయన సమావేశమవుతారు.

ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...