May 18 2021 @ 10:32AM

అమితాబ్ బచ్చన్ కార్యాలయాన్ని ముంచెత్తిన వరదనీరు

ముంబై: తౌక్టే తుపాన్ ఎఫెక్ట్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌పై పడింది. తౌక్టే తుపాన్ వల్ల కురిసిన భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో తన జనక్ కార్యాలయంలోకి వరదనీరు ప్రవేశించిందని అమితాబ్ తెలిపారు. తాను సిబ్బంది కోసం నిర్మించిన షెడ్లపై రేకులు ఎగిరిపోయాయని అమితాబ్ వెల్లడించారు. ‘‘తుపాను మధ్యలో నిశ్శబ్దంగా ఉంది.. రోజంతా వర్షం పడుతోంది .. చెట్లు పడిపోయాయి, వరదనీరు జనక్ కార్యాలయాన్ని ముంచెత్తింది. ప్లాస్టిక్ కవర్ షీట్లు  రుతుపవనాల గాలుల వల్ల ఎగిరిపోయాయి.. కొంతమంది సిబ్బందితడచిపోయారు’’ అని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. ‘‘నా సిబ్బంది యూనిఫాంలు తడిసినా వారు మరమ్మతు పనులు చేస్తూనే ఉన్నారని, వారికి నా వార్డ్ రోబ్ నుంచి దుస్తులు ఇచ్చాను’’అని ఆయన పేర్కొన్నారు. 78 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఇటీవల దీపికా పదుకొనే సరసన నటించారు. బ్రహ్మస్త్ర, మేడే చిత్రాల్లో అమితాబ్ నటిస్తున్నారు.