జమ్మూ కశ్మీర్‌పై అమిత్‌షా మరో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-04-01T20:38:41+05:30 IST

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌లోని

జమ్మూ కశ్మీర్‌పై అమిత్‌షా మరో సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌లోని స్థానికత నిబంధనలతో  పాటు ఉద్యోగ అర్హతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సరికొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై ఈ మార్గదర్శకాల కిందికి వచ్చే వారే అక్కడి స్థానిక ఉద్యోగాలకు పూర్తి అర్హులని కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


జమ్మూకశ్మీర్‌లో నిరాటంకంగా 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని, లేదా ఏడు సంవత్సరాల పాటు జమ్మూకశ్మీర్‌లోనే విద్యనభ్యసించిన వారు, పదో తరగతి, ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్న వారిని స్థిర నివాసులుగా పరిగణించబడతారు. అయితే ఈ కొత్త మార్గదర్శకాలు 25,500 రూపాయల ప్రాథమిక వేతనం ఉన్న అన్ని పోస్టుల నియామకాలకూ ఈ నివాస నియమం వర్తిస్తుందని తెలిపారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, సెంట్రల్ యూనివర్శిటీల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పరిశోధనా సంస్థల తరపున జమ్మూ కశ్మీర్‌లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసే వారందర్నీ ఇకపై స్థానికులుగా గుర్తించనున్నారు. 


ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత ఎవరైనా జమ్మూ కశ్మీర్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకోవచ్చని, ఉద్యోగాలు పొందవచ్చన్న భయం స్థానిక నేతల్లో, ప్రజల్లో ఉండిపోయింది. వీరి భయాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ చాలా జాగ్రత్తగా మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం.


370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి, తమ అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ సమయంలోనే జమ్మూ కశ్మీర్‌లోని జనాభా మార్పుల్లో ఎలాంటి మార్పూ రాకుండానే తగిన మార్పులు చేస్తామని షా హామీ ఇచ్చినట్లు సమాచారం. తదనుగుణంగానే కశ్మీర్ స్థిర నివాసంపై కేంద్ర హోంశాఖ సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

Updated Date - 2020-04-01T20:38:41+05:30 IST