అమ్మ ప్రేమకు మరో రూపం

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన తొలి తల్లి అమెరికాకు చెందిన ఆల్మా

అమ్మ ప్రేమకు మరో రూపం

తల్లికీ, బిడ్డకూ మధ్య రొమ్ము పాలతోనే అనుబంధం బలపడుతుంది. అంతటి అనుబంధాన్ని జీవితకాలం పాటు కొనసాగించగలిగే వెసులుబాటు, ఇప్పుడు బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ రూపంలో అందుబాటులోకొచ్చింది. ఈ సరికొత్త ట్రెండ్‌ విశేషాలు ఇవి!


ఈ  ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన తొలి తల్లి అమెరికాకు చెందిన ఆల్మా పార్టిడా. ఈవిడ తన బిడ్డ అలెస్సాకు 18 నెలల పాటు రొమ్ము పాలు పట్టించింది. అయితే పాలిచ్చే తల్లిగా తను సాగించిన ఆ ప్రయాణాన్ని కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాకపంగా మలచాలని అనుకుందామె. అందుకోసం మార్గాలను అన్వేషించే క్రమంలో ఆమెనొక ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఆకర్షించింది. రొమ్ము పాలతో ఆభరణాలను తయారుచేసే కీప్‌సేక్స్‌ బై గ్రేస్‌ అనే సంస్థకు చెందిన పోస్ట్‌ అది. దాని అధిపతి శారా కాస్టిల్లో. ఆమె క్లయింట్లలో ఎక్కువ మంది పసికందులకు పాలివ్వలేని తల్లులు, ప్రసవం తర్వాత పాలు ఇవ్వడానికి ఇష్టపడని తల్లులే! అలా శారా శ్రీకారం చుట్టిన రొమ్ము పాల ఆభరణాల ఇనిషియేటివ్‌ ఎంతో మంది తల్లులను ఆకర్షించింది. ఈవిడ తయారుచేసే బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ 60 డాలర్ల నుంచి 150 డాలర్ల ధర పలుకుతాయి. అయితే పాశ్చాత్య దేశాలకే పరిమితమై పోయిన ఈ ట్రెండ్‌ ఇప్పుడు మన దేశంలోనూ మొదలైంది. 



చెన్నైలో కూడా...

చెన్నైకి చెందిన కళాకారిణి ప్రీతి, పిల్లల తల్లితండ్రులకు కలకాలం గుర్తుండిపోయే మొమెంటోలను రొమ్ము పాలతో తయారు చేసి అందిస్తోంది. చెవి దుద్దులు, ఉంగరాలు, పెండెంట్లు... ఇలా నచ్చిన మోడల్స్‌తో బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ తయారుచేసి అందిస్తోందీమె. ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లు రొమ్ముపాల ఆభరణాల గురించి పదే పదే వాకబు చేస్తూ ఉండడంతో, తానే అలాంటి జ్యువెలరీ ఎందుకు తయారుచేయకూడదు అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా డిజైనింగ్‌ మొదలుపెట్టిన ప్రీతి ఆభరణాల తయారీకి ఉపయోగించిన మెటీరియల్‌, డిజైన్లను బట్టి, వాటికి వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయల వరకూ ధరలను నిర్ణయించింది. తల్లిపాలే కాకుండా పిల్లల పాల దంతాలు, వెంట్రుకలు, బొడ్డుతాడు... వీటితో ఆభరణాల ఆర్డర్‌ అభ్యర్థనలు కూడా వస్తున్నట్టు ప్రీతి చెబుతోంది. 



బెంగళూరులో...

బెంగుళూరుకు చెందిన దివ్య టాటా అనే కెమిస్ట్రీ పిహెచ్‌డి గ్రాడ్యుయేట్‌, 2018లోనే బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ తయారీ మొదలుపెట్టింది. రొమ్ము పాలతో బ్రేస్‌లెట్స్‌, చార్మ్స్‌, ఉంగరాలు, గాజులను తయారు చేస్తుందీమె. ఈ తరహా కళను ‘డిఎన్‌ఎ ఆర్టిస్ట్రీ’ అనే పేరు కూడా పెట్టుకుంది. తను తన బిడ్డకు పాలిచ్చే సమయంలో, ఆ పాలతో జ్యువెలరీ తయారుచేయగలిగే ఫార్ములా కనిపెట్టడానికి ఎన్నో తిప్పలు పడింది దివ్య. నిజానికి బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ కాన్సెప్ట్‌ 2016లోనే వెలుగులోకి వచ్చింది. అయితే అమెరికా నుంచి ప్రసవానికి బెంగుళూరు వచ్చిన తన స్నేహితురాలి ద్వారా దివ్యకు ఈ సరికొత్త ట్రెండ్‌ గురించి తెలిసింది. అదే సమయంలో తాను తల్లవడంతో, బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ తయారీ ప్రయోగాలను తనతోనే మొదలుపెట్టింది.


ఎన్నో ప్రయోగాల తర్వాత, అంతిమంగా రెండేళ్లకు తన తొలి బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీని తయారు చేయగలిగింది. తన డిజైనింగ్‌ ప్రక్రియ గురించి దివ్య వివరిస్తూ... ‘తాజా రొమ్ము పాలను మొదట స్టెరిలైజ్‌ చేసి, పాడవకుండా ఉండడం కోసం రసాయనాలను జోడిస్తాను. ఆ తర్వాత వారం రోజుల పాటు పాలను సిల్వర్‌ బేస్‌లో కదలకుండా ఉంచుతాను. అప్పటికి పాలలోని కొవ్వు, నీరు విడిపోతాయి. అప్పుడు కొవ్వును జాగ్రత్తగా వేరు చేసి, మరొక ఇంగ్రీడియెంట్‌ను జోడించి, గట్టిపడేలా కొన్ని రోజుల పాటు వదిలేస్తాను. ఇలా అంతిమంగా కలకాలం చెక్కుచెదరని జ్యువెలరీని డిజైన్‌ చేస్తాను.’ అని చెప్తోంది దివ్య. ఒక బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ తయారీకి 3 వారాల సమయం తీసుకునే దివ్య, పాల దంతాలు, బొడ్డుతాడు, పిల్లల వెంట్రుకలతో కూడా ఆభరణాలను తయారు చేస్తోంది.


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST