Chennai: ఆగిన అమ్మా మినరల్‌ వాటర్‌

ABN , First Publish Date - 2021-11-18T14:06:53+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అమ్మా మినలర్‌ వాటర్‌ బాటిళ్ళ అమ్మకాలు ఆకస్మికంగా ఆగిపోయాయి. బస్‌స్టేషన్లు, బస్టాపుల వద్ద ఏడేళ్లుగా విక్రయించిన ఈ మినరల్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో

Chennai: ఆగిన అమ్మా మినరల్‌ వాటర్‌

చెన్నై(Tamilnadu): రాష్ట్రవ్యాప్తంగా అమ్మా మినలర్‌ వాటర్‌ బాటిళ్ళ అమ్మకాలు ఆకస్మికంగా ఆగిపోయాయి. బస్‌స్టేషన్లు, బస్టాపుల వద్ద ఏడేళ్లుగా విక్రయించిన ఈ మినరల్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో ప్రయాణికులు, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత హాయంలో ప్రారంభించిన అమ్మా క్యాంటీన్లు, రూ.10లకే లీటర్‌ అమ్మా మినరల్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలు ప్రజాదరణ పొందాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమ్మా క్యాంటీన్లు మూతపడతాయని, అమ్మా మినరల్‌ వాటర్‌ బాటిళ్ళ అమ్మకాలకు మంగళంపాడుతారని అందరూ అనుకున్నారు. అయితే అమ్మా క్యాంటీన్లు యధావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. అదే విధంగా బస్‌స్టేషన్లు, బస్టాపుల వద్ద అమ్మా మినరల్‌ వాటర్‌ బాటిళ్ల అమ్మకాలు కూడా కొనసాగాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల కోసం జయలలిత ఈ మినరల్‌ వాటర్‌ పథకాన్ని 2013లో ప్రారంభించారు. మినరల్‌ వాటర్‌ తయారీగాను గుమ్మిడిపూండిలోని రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన 2.47 ఎకరాల విస్తీర్ణంలో రూ.10.5 కోట్ల వ్యయంతో ప్రత్యేక కర్మాగారాన్ని కూడా నెలకొల్పారు. ఆ కర్మాగారంలో రోజుకు మూడు లక్షల లీటర్ల మేరకు మినరల్‌ వాటర్‌ను తయారు చేసి ప్లాస్టిక్‌ బాటిళ్లలో నింపి అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేవారు. ఒకలీటర్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ను పది రూపాయలకు విక్రయించేవారు. ప్రైవేటు సంస్థలన్నీ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ను రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తుండటంతో ప్రయాణికులు, సామాన్య ప్రజలు సైతం అమ్మా వాటర్‌ బాటిళ్లను పోటీపడి కొనేవారు. రాష్ట్ర మంతటా 377 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ అమ్మా వాటర్‌ బాటిళ్లను సరఫరా చేసేవారు. చెన్నైలో 53 చోట్ల విక్రయించేవారు. ఈ మినరల్‌ వాటర్‌కు గిరాకీ పెరగటంతో గుమ్మిడిపూండి కర్మాగారంలో మినరల్‌ వాటర్‌ ఉత్పత్తిని రోజుకు 2.5లక్షల లీటర్లకు పెంచారు. ఇటీవల ఆ కార్మాగారం పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల నీటిమట్టం తగ్గిపోడంతో మినరల్‌ వాటర్‌ ఉత్పత్తిని రోజుకు 50 వేల లీటర్లకు తగ్గించారు. దీనితో రాష్ట్రమంతటా అమ్మా మినరల్‌ బాటిళ్లను తక్కువ సంఖ్యలో విక్రయించేవారు. ఈ నేపథ్యంలో ఆ కర్మాగారంలోని యాంత్రిక పరికరాలు దెబ్బతినటంతో మినరల్‌ వాటర్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. దీనితో అన్నిచోట్లా అమ్మా మినరల్‌ వాటర్‌బాటిళ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ విషయమైన రాష్ట్ర రవాణా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ గుమ్మిడిపూండి కర్మాగారంలో పాడైన యంత్రాలను మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ కర్మాగారాన్ని మూసివేయలేదని తెలిపారు. యంత్రాల మరమ్మతు గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళామని, త్వరలో మరమ్మతు పనులు పూర్తయ్యాక మళ్ళీ మినరల్‌ వాటర్‌ బాటిళ్ళ అమ్మకాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

Updated Date - 2021-11-18T14:06:53+05:30 IST