Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమ్మాలా.. వద్దా

 డైలమాలో రైతులు

 రోజురోజుకూ పెరుగుతున్న పత్తి ధర

 ఇళ్లలోనే తెల్లబంగారాన్ని నిల్వచేస్తున్న రైతులు

 పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తుతుండ గా, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గేలా ఉందని గుబులు చెందుతున్నారు.స్థానిక మార్కెట్‌లో పత్తి ధర రూ.8,000లుదాటుతుండగా,భవిష్యత్తులో ధర మరిం త పెరిగే అవకాశం ఉండటంతో విక్రయించాలా వద్దా అనే డైలమాలో రైతులు ఊగిసలాడుతున్నారు. 

- చౌటుప్పల్‌


ఈ ఏడాది వరుస వర్షాల కారణంగా పత్తి తీత కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి విడత పత్తి ధర క్వింటాకు రూ.8,000 పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగుచేసిన రైతులు మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తూ వచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులు ఈ ఏడాది జిల్లాలో పత్తి సాగును కొంత మేర తగ్గించారు. గత ఏడాదితో పోలిస్తే లక్ష ఎకరాల్లో పత్తిసాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లా లో 1,24,172ఎకరాల్లో పత్తి సాగైంది. నల్లగొండ జిల్లాలో 6,38,443ఎకరా ల్లో, సూర్యాపేట జిల్లాల్లో 1,19,979ఎకరాల్లో పత్తి సాగైంది. మూడు జిల్లాలో కలిసి సగటున 45 నుంచి 50లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్‌, జూలై నెలల్లో కురిసిన వర్షాలు పత్తి సాగుకు అనుకూలించినా, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన వరుస భారీవర్షాల కారణంగా చేలు బాగా దెబ్బతిన్నాయి. వర్షాలకు కలుపు పెరిగి మొక్క సరిగా ఎదగలేదు. దీనికి తోడు చీడపీడలు, దోమ ఉధృతి కూడా పత్తి పంటపై ప్రభావం చూపింది. ఓ వైపు పత్తి ధర పెరుగుతుండడంతో పంటను కాపాడుకునేందుకు, దిగుబడులను పెంచుకునేందుకు రైతులు భారీగా పెట్టుబడి పెట్టారు. కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.6,000 ఉండగా, వ్యాపారు లు రూ.8,000 వరకు తెల్లబంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడి పెట్టిన రైతులకు కొంత ఉపశమనం లభించినట్టయింది.


రికార్డు స్థాయిలో ధర

పత్తి పంటకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డుస్థాయిలో ధర పలుకుతోంది. సీజన్‌ ప్రారంభంలోనే వ్యాపారులు మైలపత్తి ని రూ.5500వరకు కొనుగోలు చేశారు. వర్షాలు తగ్గాక తీసిన పత్తికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. తేమ, పింజరతో సంబంధం లేకుండా బహిరంగ మార్కెట్‌లో గ్రేడ్‌-1పత్తిని వ్యాపారులు రూ.8,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో సమయంలో వ్యాపారులు పోటీపడి వంద రెండు వందల రూపాయలు అదనంగా కూడా చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో అధిక ధర లభిస్తుండడంతో రైతులు వ్యాపారుల వైపే మొగ్గుచూపుతున్నారు. 


నిల్వలకే మొగ్గుచూపుతున్న రైతులు

పత్తి ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో విక్రయించేందుకు రైతు లు అంతగా ఆసక్తి చూపడం లేదు. భవిష్యత్‌లో పత్తి ధర మరికొంత పెరుగుతుందన్న ఆశాభావంతో దిగుబడైన తెల్లబంగారాన్ని ఇళ్ల వద్దే నిల్వ చేసేందుకు ఎక్కువ మంది రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో వచ్చిన పత్తికి మంచి రేటు వస్తుండడంతో ఆ తర్వాత తగ్గుతుందేమో అనే అనుమానంతో కొంత మంది రైతులు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొంత మంది రైతులు భవిష్యత్‌లో ధర పెరుగుతుందనే ఆశతో నిల్వచేస్తున్నారు.


సందడి లేని సీసీఐ కేంద్రాలు

పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయంటే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తెల్లబంగారం లోడు వాహనాలతో బారులు తీరేవారు. కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమైతే వందలాది వాహనాలు రోడ్లపై నిలిచేవి. అలాంటి పరిస్థితి ఈ ఏడాది కన్పించడంలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసిన అధికారులు, 35మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై కూడా నేటికీ స్పష్ట త లేదు. దీనికి తోడు పత్తి ధర ప్రారంభంలోనే రూ.7,000 నుంచి రూ.8,000 ఉండడం, భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారం కారణంగా రైతులు సీసీఐ కేంద్రాలను ఆశ్రయించకుండా బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఎర్రోళ్ల జంగయ్య

పత్తి అమ్మలా వద్దా అని ఆలోచిస్తున్నా: ఎర్రోళ్ల జంగయ్య, రైతు సంస్థాన్‌ నారాయణపురం 

నాకున్న ఏడెకరాల్లో పత్తి పంట సాగుచేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లకు పత్తి దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న పత్తి ధర రైతులకు ఆశాజనకంగా ఉంది. ఈ ధరలు పంట పూర్తయ్యే వరకు ఉంటే ఎంతో మేలవుతుంది. రానున్న రోజుల్లో పత్తిధర మరింత పెరుగుతుందంటున్నా రు. ప్రస్తుతం వస్తున్న పత్తిని విక్రయించాలా వద్దా అని ఆలోచిస్తున్నా. 


Advertisement
Advertisement