అమ్మీజాన్‌

ABN , First Publish Date - 2021-11-15T06:28:54+05:30 IST

ఇంటి పైకప్పు నుండి కురుస్తూ, చొక్కా చిల్లులో నుండి తొంగిచూస్తూ, వెక్కిరిస్తున్న దలిందరాగీని తరిమేందుకు....

అమ్మీజాన్‌

ఇంటి పైకప్పు నుండి కురుస్తూ,

చొక్కా చిల్లులో నుండి తొంగిచూస్తూ,

వెక్కిరిస్తున్న దలిందరాగీని

తరిమేందుకు.... 

నా ఐదేళ్ళప్పుడే అబ్బూ ‘ఎడారిపాలయ్యాడు’


అప్పటినుండి,

అమ్మీజాన్‌, అబ్బూలా మారి

బతుకు తెరపై ద్విపాత్రాభినయం,


ముక్కలుగా కత్తిరించబడ్డ స్వప్నాలను 

రెక్కలకంటించుకుని వలస పిట్టై అబ్బూ 

ఎగిరెళ్లాక...

నాకు అమ్మీ నేస్తం, 

అమ్మీకి నేనే సమస్తం...


కంటికి సుర్మానద్ది,

ఒంటికి అత్తరు రుద్ది,

‘ఈద్‌ మెహ్ఫిల్‌’కి నన్ను సాగనంపినప్పుడు,

అమ్మీ కళ్ళల్లో మెరిసిన చాంద్‌, తారాలకు 

    నకిలీ రూపమే ఆకాశానికి వేలాడుతుండేది...


నయా కుర్తాలో,

నన్ను ముస్తాబు చేసి,

నుదుటిపై పెట్టిన ముద్దు కన్నా గొప్ప 

‘ఈదీ’ లోకంలో ఏదీ లేదు,

ఆమెకు మాత్రం,

అదే రంగు వెలిసిన పాత చీర,

నల్లపూసల దండే ఏకైక నగ.


నఖాబ్‌ వెనుక  కొన్ని దుఃఖ నదులు,

పుట్టి, ప్రవహిస్తూ,

మదిలోని బాధ ఏ అర్ధరాత్రో,

బొట్లుగా రాలి దిండుకు తలబాదుకుని 

                     మరణిస్తుండేది,

ఇషా నుండి ఫజర్‌ మధ్యలో అమ్మీజాన్‌ 

ఓ రెక్కలు తెగిన దేవదూతలా 

             కనిపించేది/ విలపించేది.


నిద్ర రాని రాత్రుల్లో ఆమె దోసిట్లో దువానై,

జ్వరమో, జలుబో చేసినప్పుడు 

       ఆమె మదిలో మెదిలిన మన్నత్‌నై,

నిజంగానే ఆమె పాదాల కింద నేనో జన్నత్‌ని చూశాను.


కాలం రేసుగుర్రపు రౌతునై,

అబ్బూ విడిచిన ‘బతుకు పందెం’ 

             మళ్లీ మొదలెట్టాను,


అబ్బూ తిరిగొచ్చి ఇచ్చిన,

వారసత్వపు వలస రెక్కల్ని తొడుక్కుని

నునుపైన దూరపు కొండపై 

           కబూతర్‌నై వాలిపోయాను.


ఇప్పుడు,

నేను లేని అమ్మీజాన్‌,

నెలవంక లేని ఆకాశమై ఒక్కో తారను, 

కన్నీటి బొట్లుగా రాల్చుకుంటోంది....

జాబేర్‌ పాషా

00968 78531638 (మస్కట్‌)


Updated Date - 2021-11-15T06:28:54+05:30 IST