‘అమ్మఒడి’కి అభ్యంతరం లేదు

ABN , First Publish Date - 2021-01-10T08:03:25+05:30 IST

‘అమ్మఒడి’ గతంలోనే ప్రారంభించిన పథకమైనందున యథావిధిగా అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అయితే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ

‘అమ్మఒడి’కి అభ్యంతరం లేదు

యథావిధిగా ఇళ్లపట్టాల పంపిణీ: ఎస్‌ఈసీ


అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మఒడి’ గతంలోనే ప్రారంభించిన పథకమైనందున యథావిధిగా అమలవుతుందని  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అయితే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని స్పష్టంచేసింది. నెల్లూరు నగరంలో సోమవారం సీఎం జగన్‌ రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం స్పందించారు. ‘‘అమ్మఒడి’ ఇప్పటికే ప్రారంభమైన పథకం. కాబట్టి సీఎం ఈ కార్యక్రమం చేపట్టడం కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదు. గ్రామీణ లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయరాదు.


ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఇదే వర్తిస్తుంది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గ్రామాల్లో పట్టాల  పంపిణీ చేయరాదు’’ అని వివరించారు. కోడ్‌ అమలుపై స్పష్టతనిస్తూ సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ‘‘మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం 23న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 17న నాలుగో విడత ఎన్నికలతో ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 9నుంచి ఫిబ్రవరి 17వరకు కోడ్‌ అమల్లో ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కోడ్‌ అమల్లో ఉంటుంది. పట్టణాలు, నగరాల లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలు యథావిధిగా అమలుచేసుకోవచ్చు. గ్రామాలకు చెందిన లబ్ధిదారులను పట్టణాలకు పిలిచి పంపిణీ చేసేందుకు వీల్లేదు. అలా చేస్తే కోడ్‌ను ఉల్లంఘించినట్టే. ఈ విషయం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులకు తెలియజేసి కోడ్‌ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఆ లేఖలో సూచించారు. 

Updated Date - 2021-01-10T08:03:25+05:30 IST