అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గుడ్‌ బై?

ABN , First Publish Date - 2020-09-30T10:48:11+05:30 IST

ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వాల తీరును ఎండగడుతున్న అమ్నెస్టీ ...

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గుడ్‌ బై?

భారత్‌లో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన

బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం వల్లే

2016లో ఏబీవీపీ ఫిర్యాదుతో కష్టాలు!

కేసులు అమ్నెస్టీ కంపెనీలపైనే.. న్జీవోపై కాదు: కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: ప్రపంచ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వాల తీరును ఎండగడుతున్న అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ భారత్‌లో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా 80లక్షల మంది సభ్యులతో క్లిష్ట పరిస్థితుల్లోనూ మారుమూల ప్రాంతాలకు వెళ్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న హింసను వెలుగులోకి తెస్తున్న ఈ సంస్థ.. భారత్‌లో సర్కారు వేధింపుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించిం ది. భారత్‌లో తమ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం వల్ల వెనక్కి తగ్గుతున్నట్లు పేర్కొంది. నిరాధార, ఉద్దేశపూర్వక ఆరోపణలు మోపినట్లు వివరించింది. ‘‘మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఈ నెల 10న తెలిసింది. దీంతో మా కార్యకలాపాలు నిలిచిపోయాయి’’ అని తెలిపింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలను వెలుగులోకి తెచ్చినందునే ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆరోపించింది. భారత,అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే పనిచేశామని పేర్కొంది. ‘భారత్‌లో మా కార్యకలాపాలకు నిధులను దేశీయంగానే సమీకరిస్తు న్నాం. గత 8 ఏళ్లలో 40 లక్షల మంది భారతీయులు మాకు సహకరించారు. లక్ష మంది దాకా విరాళాలతో చేయూతనందించారు. ఈ విరాళాలకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టాని(ఎ్‌ఫసీఆర్‌ఏ)కి సంబంధం లేదు. ప్రభుత్వం మాత్రం విదేశీ విరాళాలుగా చిత్రీకరిస్తోంది. దర్యాప్తు సంస్థ దీన్ని మనీలాండరింగ్‌గా పేర్కొంటోంది. మానవ హక్కులపై పోరాడుతున్న మా సంస్థపై నేరపూరిత సంస్థ అనే ముద్రవేసింది’ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆమ్నెస్టీ కార్యకలాపాలు కొనసాగించవచ్చు

ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఈడీ దర్యాప్తు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)పై కాదని, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండియన్స్‌ ఫర్‌ అమ్నె స్టీ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌లపైనే అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమ్నెస్టీ కంపెనీకి రూ.51.72 కోట్ల విదేశీ నిధు లు రావడంపై ఈడీ దర్యాప్తు చేసిందని వివరించాయి. ఈ రెండు సంస్థలపైనే ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ), ఫెమా కింద కేసులు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నార ని పేర్కొన్నాయి. ‘‘గత ఏడా ది సెప్టెంబరులో అమ్నెస్టీ కంపెనీకి ఈడీ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. 2013-19 మధ్యకాలంలో బ్రిటన్‌ నుంచి వచ్చిన రూ.51.72కోట్లపై వివరణ కోరింది. సమాధానం లేకపోవడంతో అమ్నెస్టీకంపెనీ, ఇండియన్స్‌ ఫర్‌ అమ్నె స్టీ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. దీన్ని అమ్నెస్టీ సంస్థ కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది. చట్టప్రకారమే ఈడీ చర్యలు తీసుకుంది’’ అని ఆ వర్గాలు వివరించాయి. చర్యలు కంపెనీపైనేనని, ఎన్జీవోపై కాదని స్పష్టం చేసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ఎన్జీవో భారత్‌లో నిరభ్యంతరంగా తన కార్యకలాపాలను కొనసాగించవచ్చని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో ఎన్‌సీఆర్‌, ఎన్‌పీఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలోనూ, గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేశాక అమ్నెస్టీ ఇచ్చిన నివేదికలను తాము గౌరవించినట్లు గుర్తుచేసింది. బీజేపీ మాత్రం అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని ఆరోపించింది. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు లేకుండా అమ్నెస్టీకి విదేశీ విరాళాలు సేకరించే అధికారం లేదని బీజేపీ నేత రాజ్యవర్దన్‌సింగ్‌ రాథోడ్‌ అన్నారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ 1966లో భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. మానవహక్కుల ఉల్లంఘనలను ఎలుగెత్తి చాటింది. మహిళా హక్కులపైనా పనిచేసింది. అయితే.. మానవ హక్కుల పై బెంగళూరులో 2016లో నిర్వహించిన సమావేశం నుంచి ఆ సంస్థపై కేంద్రం గుర్రుగా ఉంది. ఆ సమావేశంలో జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఏబీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 నుంచి ఆ సంస్థ ఆర్థికమూలాలపై ప్రభావం పడ్డట్లు తెలుస్తోంది.


ఏమిటీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌?

పలుదేశాల్లో హక్కుల ఉల్లంఘన, మైనారిటీల అణచివేత, స్త్రీ స్వేచ్ఛ, ని యంతృత్వం, మరణ శిక్షల రద్దు, శరణార్థుల, ఖైదీల హక్కులు వంటి అంశాల పై అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పోరాడుతోంది. ఈ అంశాలపై ఆయా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్ర భుత్వాల తప్పిదాలను ఎలుగెత్తి చాటుతోంది. 1961లో లండన్‌లో ఈ సంస్థ పురుడు పోసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యులున్నారు. యుద్ధాల సమయంలోనూ ఈ సంస్థ సభ్యులు సాహసోపేతంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి, బాధితుల సమస్యలను ప్రపంచానికి తెలిపారు. ఈ సంస్థకు 1977లో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. కొన్ని దేశాల్లో హింసను పట్టించుకోకపోవడం, విరాళాలను దారి మళ్లించడం, కొందరు పెద్దలు భారీ జీతాలు తీసుకోవడం వంటి విమర్శలను కూడా ఈ సంస్థ ఎదుర్కొంటోంది.

Updated Date - 2020-09-30T10:48:11+05:30 IST