Abn logo
Oct 23 2021 @ 02:52AM

బూతు పురాణం!

  • బోస్‌డీకే పదం చుట్టూ రచ్చ
  • ‘జంబలకిడి పంబ’తో పరిచయం
  • అర్థం తెలియకుండానే వినియోగం
  • బోస్‌డీకే అంటూ హిందీలో పాటలు
  • నేరుగా తెలుగులోనే వైసీపీ నేతల తిట్లు


అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇప్పుడు ఇదో పెద్ద గోల! ‘బోస్‌డీకే’ అంటే అర్థం ఏమిటని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. హిందీ తెలిసిన వాళ్లను అడుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆ పదానికి అర్థం ‘...కొడుకు’ అని పబ్లిగ్గా చెప్పారు. అందుకే... అభిమానులకు అంత కోపం వచ్చి, దాడులు చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. హిందీ మాటను తెలుగులోకి అనువదించే సంగతి పక్కనపెడితే... నేరుగా తెలుగులోనే అదే తిట్టును వైసీపీ నేతలు పలుమార్లు ప్రయోగించారు. ఏదిఏమైనా... ఇప్పుడు ఏపీలో ‘బోసడీకే’ పదం సంచలనం సృష్టిస్తోంది. సుమారు 20 ఏళ్ల కిందట తెలుగు వారిని అలరించిన ‘జంబలకిడి పంబ’ సినిమా ద్వారా ‘బోసడీకే’ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘నీ పేరు ఏంటి?’ అని మాస్టారు అడగడం... ‘బోస్‌ డీకే’ అని పిల్లాడు బదులివ్వడం!... ఇదీ ఆ దృశ్యం! డీకే బోస్‌...ను బోస్‌డీకేగా తిరగేసి చెప్పాడన్న మాట! రాజకీయాల పుణ్యమా  అని మళ్లీ ఇప్పుడే బోస్‌డీకే పదం బాగా పబ్లిక్‌లోకి వచ్చేసింది. ఆ మాట వినిపిస్తోంది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ పదాన్ని తిట్టుగా కాకుండా... యథాలాపంగా వాడే వారే ఎక్కువ! ‘జబర్దస్త్‌’ స్కిట్‌లో పాత్రధారులూ ‘పోరా బోస్‌డీకే’ అని పిలుచుకుంటున్నారు. 


ఇదొక్కటే కా దు... అసలు అర్థం తెలియకుండా, తెలుసుకోకుండా మ నోళ్లు వాడుతున్న అనేక హిందీ పదాల్లో (బూతులు) బోస్‌డీకే కూడా ఒకటి. ఉత్తరాదిలోనూ సన్నిహితంగా ఉండేవారు ఈ పదాన్ని బాగా వాడేస్తుంటారు. అర్థం తెలిసిన వాళ్లు మాత్రం వాడరు. ‘స్టార్‌ బాయ్‌ ఎల్‌ఓసీ’ ప్రైవేట్‌ సాంగ్స్‌ ఆల్బమ్‌లో... ‘బోస్‌డీకే’ అనే పాట కూడా ఉంది. ఏడాదిన్నరలో దీనికి దాదాపు 10 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ‘బోసడీవాలా’ అనే మరో పాట కూడా హిందీలో బాగా పాపులర్‌ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌లో ‘బోసడీ’ అనే ఊరు ఉంది. తమను ‘బోసడీ వాలా’ అంటున్నారని, ఊరి పేరు మార్చాలని ఓ వ్యక్తి పెట్టుకున్న విన్నపం వాట్సా్‌పలో బాగా వైరల్‌ అయ్యింది. ఎవరో తెలియదు కానీ... బోసడీకే.కామ్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ కూడా పెట్టారు. ఇది జోకులు, వ్యంగ్యోక్తులతో నిండిన వెబ్‌సైట్‌! బోస్‌డీకే పదానికి సంస్కృతంలో ‘అయ్యా... బాగున్నారా’ అనే అర్థముందని అందులో వివరించారు. ‘బో’ అంటే గౌరవప్రదమైన సంబోధన... ‘సద్‌’ అంటే బాగా, ‘ఇకె’ అంటే ఉండటం! అని అందులో వివరించారు. వారణాసిలో ఈ పదాన్ని విచ్చలవిడిగా వాడేస్తారని ఇందులో తెలిపారు. అయితే... ఇది ఎవరో సరదాగా, ఆకతాయిగా సృష్టించిన అర్థమేనని సంస్కృత పండితులు స్పష్టం చేశారు. ఇక... బోస్‌డీకే పదానికి ఏకంగా 16 రకాల అర్థాలున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఇప్పుడు ఎవరి గోల వారిది! ఎవరికి కావాల్సిన అర్థం వారు వెతుక్కోవడమే! ఇన్ని కష్టాలు లేకుండా... వైసీపీ నేతల్లాగా నేరుగా తెలుగులోనే తిట్టొచ్చు కదా అని కొందరి సూచన!


నెట్‌లో వెతుకులాట... 

పట్టాభి అన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదుకానీ... ముఖ్యమంత్రి జగన్‌ ఆ పదానికి ఇదీ అర్థం అని మైకు పట్టుకుని మరీ విడమరచి చెప్పగానే అందరికీ ఒక్కసారిగా దానిపై ఆసక్తి పెరిగింది. గురువారం  పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో జగన్‌ ఈ మాట చెప్పగానే... నెట్‌లో దీని గురించి బాగా ‘సెర్చ్‌’ చేశారు. ఉదయం 8.52 గంటలకు ఇది గరిష్ఠ స్థాయిలో ఉండి... ఆ తర్వాత అలా కొనసాగింది. ఇది కూడా ఏపీ, తెలంగాణల్లోనే ఎక్కువ కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...