పార్టీలను ఆపాదించడం అన్యాయం

ABN , First Publish Date - 2020-10-24T10:24:48+05:30 IST

అమరావతికి భూములు ఇచ్చి రోడ్డున పడి ఆవేదనతో ఆందోళనచేస్తోన్న వారికి పార్టీలను ఆపాదించడం అన్యాయ మని రాజధాని గ్రామాల రైతులు తెలిపారు.

పార్టీలను ఆపాదించడం అన్యాయం

 ఎమ్మెల్యే అయ్యుండి పచ్చి అబద్ధాలు

శ్రీదేవిపై రాజధాని మహిళల మండిపాటు 

 311వ రోజుకు చేరుకున్న రాజధాని ఆందోళనలు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, అక్టోబరు 23: అమరావతికి భూములు ఇచ్చి రోడ్డున పడి ఆవేదనతో ఆందోళనచేస్తోన్న వారికి పార్టీలను ఆపాదించడం అన్యాయ మని రాజధాని గ్రామాల రైతులు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు శుక్రవారంతో 311వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఏ రాజకీయ పార్టీ మద్దతు తెలిపినా అక్కున చేర్చుకుంటామన్నారు. ఉద్దండ్రాయునిపాలెం లోని బాపట్ల ఎంపీ సురేష్‌ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి శుక్రవారం విలేకరుల సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు.


స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి కూడా రాజధాని రైతుల సమస్యలపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. కిరాయి వారి చేత ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే శ్రీదేవి మూడు రాజధానులు అంటూ హల్‌చల్‌ చేయిస్తున్నారన్నారు. రాజధానిలో పేదల కోసం కట్టిన ఇళ్ళ ను ఇప్పించి అప్పుడు మాట్లాడాలని మహిళలు ఎమ్మెల్యేకు హితవు పలికారు. ప్రజాసమస్యలు పట్టని ఆమె వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ప్రెస్‌మీట్‌ అనంతరం శ్రీదేవి తుళ్లూరు వైపు వస్తుందన్న సమాచారంతో శిబిరాల్లో నుంచి మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

 

మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతు రిలే దీక్షలు శుక్రవారంతో 311వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయా గ్రామాల రైతు సంఘ నాయకులు పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు. 


 తాడేపల్లి మండలం పెనుమాక బొడ్డురాయి సెంటర్‌లో జరుగుతున్న దీక్షలు 311వరోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ మూడు ముక్కల రాజధాని ఆలోచనను ప్రభుత్వం విరమించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలలో ఐకాస నేతలు రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధాని రైతులు 311 రోజుల నుంచి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఉద్యమా లు చేస్తుంటే, పెయిడ్‌ ఆర్టిస్టులతో నిరసనలు చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతి ఉద్యమాన్ని శాంతి యుతంగా చేస్తుంటే కొంతమంది ఉద్రిక్త పరిస్థితులను తీసుకువచ్చి అణిచివేయాలని చూస్తున్నారన్నారు.  

Updated Date - 2020-10-24T10:24:48+05:30 IST