దుర్గమ్మ తల్లీ.. అమరావతిని కాపాడమ్మా..

ABN , First Publish Date - 2020-10-25T10:03:19+05:30 IST

రాజధాని అమరావతిని కాపాడాలని మహిళలు శనివారం అమ్మవారికిపొంగళ్లు సమర్పించారు.

దుర్గమ్మ తల్లీ.. అమరావతిని కాపాడమ్మా..

రాజధాని రైతులు, మహిళల వేడుకోలు

దుర్గాదేవికి పొంగళ్లు సమర్పణ


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, అక్టోబరు 24: రాజధాని అమరావతిని కాపాడాలని మహిళలు శనివారం అమ్మవారికిపొంగళ్లు సమర్పించారు. రాజకీయాలుమాకొద్దు అంటూ పొంగళ్ల పాత్రలను నెత్తిమీద పెట్టుకొని అమ్మవారికి మహిళలు విన్నపాలు చేశారు. పాలకులు రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీలను అవమానపరిచారు. అమ్మవారు కరుణించి దుష్టశిక్షణ శిష్టరక్షణ జరగాలన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు,  రైతుకూలీలు చేస్తున్న ఉద్యమం శనివారం నాటికి 312వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు న్యాయదేవత అండగా ఉంటుందన్నారు. రాజధాని రైతుల కష్టనష్టాలను వినిపిస్తున్న, చూపిస్తున్న విలేకరులను అధికారం ఉంది కదా అని, హింసపెడితే సహించబోమన్నారు. వాస్తవాలు రాస్తే.. వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మూడు రాజధానులతో ఉపయోగం ఏమిటో ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పకపోవటం విడ్డూరమన్నారు. రాజకీయకక్షలతో రైతులను నడి రోడ్డు మీద వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.  పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరటం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైఖరులను వారు ఖండించారు.


తాడేపల్లి మండలం పెనుమాక బొడ్డురాయి సెంటర్‌లో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న రైతుల నిరసన దీక్షలు శనివారంతో 312వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రైతుల ఉసురుపోసుకున్న ప్రభుత్వాలు మనజాలవని వ్యాఖ్యానించారు. 312 రోజులుగా దీక్షలు చేస్తున్నా ఈ మొండిప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని, ప్రజలు త్వరలోనే బుద్ధిచెబుతారని నేతలు వ్యాఖ్యానించారు. ఈ దీక్షలలో ఐకాస నేతలు స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘనేతల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు రిలే నిరాహార దీక్షలు శనివారంతో 312వ రోజుకుచేరాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయా గ్రామాల రైతుసంఘ నాయకులు పాల్గొని రైతు రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. 


మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలంలోని మోతడక, పొన్నెకల్లు గ్రామ రైతులు, మహిళలుచేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడలేని మూడు రాజధానుల వ్యవస్ధను తీసుకువచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులతో ఆర్ధికంగా నష్టపోవటమే కాకుండా పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పక్కరాష్ట్రాలకు క్యూ కడుతున్నారని దీనివల  యువతకు ఉద్యోగాలు లేక వలసలు పోవాల్సివస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంఅప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-25T10:03:19+05:30 IST