అమరావతి @ 100 రోజులు

ABN , First Publish Date - 2020-03-26T08:55:02+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని...

అమరావతి @ 100 రోజులు

అడుగడుగునా నిర్బంధాల నడుమే..

రాజధాని కోసం అన్నదాతల ఆందోళన

ప్రభుత్వ నిరంకుశత్వం.. పోలీసు కేసులు

వెంటాడినా పట్టువీడని రైతులు, మహిళలు

న్యాయస్థానాల అండతో సాగిన ఉద్యమం

కరోనా నేపథ్యంలోనూ సాగుతున్న నిరసనలు

వంతుల వారీగా శిబిరాలకు.. మాస్కులతో జాగ్రత్తలు


మంగళగిరి, మార్చి 25: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు నేటి(గురువారం)తో వందో రోజుకు చేరుకున్నాయి. అమరావతి రాజధాని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా ఏర్పడుతుందని భావించిన ఇక్కడి రైతులు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు వేలాది ఎకరాల పంట భూములను ప్రభుత్వానికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత సీఎం జగన్‌ రాష్ట్రంలో మూడు రాజధానులను తెరమీదికి తేవడంతో ఇక్కడి రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు.


పచ్చని పంట భూములను రాజధానికి ఇచ్చి మా జీవితాలను ఫణంగా పెడితే.. ఇప్పుడు మూడు రాజధానులు అంటారా? అంటూ ప్రభుత్వంపై కదనానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతి వ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు, నిరసనలు, నిరవధిక దీక్షలు, రిలే దీక్షలకు దిగారు. అయితే, ప్రభుత్వం నుంచి ఈ నిరసనలపై అనేక సందర్భాల్లో ఉక్కుపాదమే ఎదురైంది. పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. మహిళలు, యువత, రైతులపై వందల సంఖ్యలో కేసులు పెట్టారు. లాఠీ చార్జీ చేశారు. అయినా, మొక్కవోని దీక్షతో ఇక్కడి రైతులు రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ ఆందోళన ఆగబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉండడంతో శిబిరాలకు దూరంగా ఇళ్లకే పరిమితమై.. రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అమరావతి ఉద్యమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గడం లేదు. న్యాయస్థానం అండగా నిలవడంతో వారు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ, చేసిన వ్యాఖ్యానాలు కానీ చూస్తే ఉద్యమకారులకు కొండంత అండ లభించినట్టయింది. 


వినూత్న నిరసనలతో.. 

ఈ వంద రోజుల ఉద్యమంలో.. రైతులు, మహిళలు వినూత్న నిరసనలతో తమ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేశారు. వంటావార్పు, 72 గంటల దీక్షలు, 168 గంటల దీక్షలు, జలదీక్షలు, సర్వమత ప్రార్ధనలు, మోకాళ్లపై నిలబడి వేడుకోలు ఇలా అనేక రూపాల్లో రైతులు తమ నిరసనలు కొనసాగించారు.


మహిళా స్ఫూర్తి కీలక పాత్ర!

అమరావతి ఉద్యమంలో రైతులతో సమానంగా మహిళా రైతులు, కూలీలు కూడా కీలక పాత్ర పోషించారు. ఏ దీక్షా శిబిరాన్ని సందర్శించినా 70ు మహిళలే కనిపించారు. కాగా.. రాజధాని కోసం చేస్తున్న ఉద్యమాన్ని దారి మళ్లించే కుట్రలపైనా రైతులు యుద్ధం చేస్తున్నారు. తమను రెచ్చగొడుతున్నా సంయమనం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిరసనలను కొనసాగిస్తున్నారు. సమయానుకూలంగా, పరిస్థితులను బట్టి తరుచు ఉద్యమ తీరు మారాల్సివచ్చినా.. తదనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అమరావతి ఉద్యమానికి రాజకీయపక్షాల పరంగా చూస్తే.. అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలూ రైతులకు అండగా నిలిచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని ఉద్యమాల కోసం జోలెపట్టడం కీలక ఘట్టంగా ఇక్కడి ప్రజలు చెప్పుకొంటారు.

Updated Date - 2020-03-26T08:55:02+05:30 IST