Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఆర్‌డీఏ ఊపిరి తీశారు!

  • ప్రణాళికా విభాగ సిబ్బంది కుదింపు
  • 359 శాంక్షన్డ్‌ పోస్టులు 94కు తగ్గింపు 
  • మిగిలిన పోస్టులు పట్టణాభివృద్ధి సంస్థలకు బదలాయింపు
  • అమరావతి నిర్మాణ ఆశలు గల్లంతు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ఊపిరిని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క జీవోతో తీసేసింది. సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగాన్ని కకావికలం చేసింది. అమరావతి రాజధాని నిర్మాణ ఆశలను గల్లంతు చేసింది. మూడు రాజధానుల బిల్లును రద్దు చేశాక సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ చర్య తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ప్లానింగ్‌ విభాగాన్ని భారీగా కుదించేలా ఇచ్చిన జీవో నంబర్‌ 678 ద్వారా సీఆర్‌డీఏ కూడా ఇక సాధారణ పట్టణాభివృద్ధి సంస్థల సరసన చేర్చినట్టు అయింది. ప్రభుత్వ తాజా చర్య వల్ల అమరావతి రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, అంతకు మించి అనిశ్చితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్దేశం కూడా ప్రస్ఫుటమౌతోంది. ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 14 పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇన్నాళ్లూ ప్రణాళికా విభాగాలను పరిపుష్టం చేయకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియచేస్తోంది. అభివృద్ధి చెందాల్సిన పట్టణాభివృద్ధి సంస్థలను ఏ విఽధంగా నిర్వీర్యం చే సిందో అర్థమౌతోంది. 14 పట్టణాభివృద్ధి సంస్థలకు గత కొద్ది సంవత్సరాలుగా తగిన సంఖ్యలో ప్లానింగ్‌ సిబ్బంది లే రు. పట్టణాలను అభివృద్ధి చేయాలంటే ప్రణాళికా విభాగాలు సమర్థంగా పనిచేయాలి. అలా పనిచేయడానికి తగినంతమంది సిబ్బందిని నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకుండా ఆర్థిక భారమన్న ఒకే ఒక్క కారణంతో సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగాన్ని బలహీనం చేసింది.


నాడు బలోపేతం-నేడు బలహీనం

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో, మెగా రాజధాని నిర్మాణం చేపట్టడం కోసం వీజీటీఎం-ఉడాను మరింత బలోపేతం చేయటానికి గత తెలుగుదేశం ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకువచ్చింది. సీఆర్‌డీఏ చట్టంలో ల్యాండ్‌ పూలింగ్‌ అంశం తప్ప దాదాపుగా అన్ని విభాగాలను గత ప్రభుత్వం యథాతథంగానే ఉంచింది. పరిపాలనకు సంబంధించి కొన్ని కొత్త విభాగాలు వచ్చినప్పటికీ.. ప్రధానమైన ప్లానింగ్‌, జీఐఎస్‌, డెవల్‌పమెంట్‌ వంటి విభాగాలను అలాగే ఉంచి వాటిని బలోపేతం చేయటం కోసం పోస్టుల సంఖ్యను పెంచింది. వీజీటీఎం-ఉడా నుంచి సీఆర్‌డీఏలోకి వచ్చిన ప్లానింగ్‌ సిబ్బందితో పాటు అదనపు శాంక్షన్‌ కూడా ఇచ్చింది. ఇలా సీఆర్‌డీఏలో ప్లానింగ్‌ విభాగానికి సంబంధించి దాదాపు 359 పోస్టులకు అనుమతిచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసి.. ఏపీ మెట్రోపాలిటన్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ చట్టాన్ని అమల్లోకి  తీసుకువచ్చింది. సీఆర్‌డీఏ కాస్తా ఏఎంఆర్‌డీఏగా మార్చిన క్రమంలో ప్రస్తుతం 64 మందితోనే ప్లానింగ్‌ విభాగం నడుస్తోంది. గత ప్రభుత్వం సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగాన్ని పరిపుష్టం చేయటం కోసం అప్పటి వీజీటీఎం-ఉడా జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్లను కొనసాగిస్తూనే సీఆర్‌డీఏలోకి కొత్తగా మరికొన్నింటిని చేర్చింది.


ఇలా సీఆర్‌డీఏ ప్రణాళికా విభాగం పరిధిలో మొత్తం 27 జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ ఏరియాలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, అమరావతిల పరిధిలో పెదవడ్లపూడి, పేరేచర్ల, శేకూరు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వేజెండ్ల, విజయవాడ, అమరావతి, అంకిరెడ్డిపాలెం, చేబ్రోలు, దుగ్గిరాల, గన్నవరం, గొల్లపూడి, గుంటూరు, కంకిపాడు, కానూరు, కఠేవరం, కాజ, కేతనకొండ, కొండపల్లి, మందడం, నంబూరు, నిడమానూరు, నున్న జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్లను నిర్దేశించింది. ఈ జోనల్‌ డె వ లప్‌మెంట్‌ ప్లాన్ల ప్రకారం ఆయా ప్రాంతాల్లో పట్టణాభివృద్ధి ప్రణాళికలు ఉంటాయి. ఏపీకి మెగా రాజధాని నిర్మాణం దిశగా ప్లానింగ్‌ విభాగాన్ని గత టీడీపీ ప్రభుత్వం దూరాలోచన చేసి ప్రణాళికా విభాగాన్ని బలోపేతం చేస్తే.. వైసీపీ సర్కారు రాజధానిని నిర్వీర్యం చేయటం కోసం సీఆర్‌డీఏ ఊపిరి తీయటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం సీఆర్‌డీఏలో 359 శాంక్షన్డ్‌ పోస్టులను 94కు కుదించటానికి రంగం సిద్ధమైంది. మిగిలిన శాంక్షన్డ్‌ పోస్టులన్నింటినీ రాష్ట్రంలోని ఇతర పట్టణాభివృద్ధి సంస్థలకు బదలాయింపు చేయనుంది. సీఆర్‌డీఏకు శాంక్షన్డ్‌ పోస్టులను కుదించటమంటే అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధి మీద ప్రభుత్వానికి ఆసక్తి లేదన్న విషయం అర్థమవుతోంది.

 

రెండేన్నరేళ్లలో కనిపించని పురోగతి

ఇప్పటికే రాజధానిలో సీఆర్‌డీఏ తలపెట్టిన నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. పాతిక శాతం పైబడి పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని పైకి సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి చెబుతున్నా.. మౌఖిక ఆదేశాల మేరకే సీఆర్‌డీఏ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. పాతిక శాతం పురోగతి దాటిన ఒక్క పనిని కూడా సీఆర్‌డీఏ ఈ రెండున్నరేళ్లలో అంగుళం కూడా చేపట్టలేకపోయింది. ఆఖరికి ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళుతున్న ఎన్‌హెచ్‌-16 మార్గంలో వీధిలైట్ల నిర్వహణను కూడా చేపట్టలేని స్థితికి సీఆర్‌డీఏ వచ్చింది. రోడ్ల అభివృద్ధితో పాటు ఉద్యానవనాల నిర్వహణ కూడా చేపట్టలేకపోతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్లానింగ్‌ విభాగాన్ని కూడా కకావికలం చేయటం సీఆర్‌డీఏ ఊపిరి తీయటమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement