అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-12-04T07:49:34+05:30 IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అఖిలపక్ష నేతలు డిమాండు చేశారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతిరావు

9న రైతుల మహాపాదయాత్రకు ఘన స్వాగతం పలుకుదాం 

17న తిరుపతిలో భారీ బహిరంగ సభ

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నేతలు


తిరుపతి(కల్చరల్‌), డిసెంబరు 3: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అఖిలపక్ష నేతలు డిమాండు చేశారు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మళ్లీ పూర్తి స్ఘాయిలో  బిల్లు పెడతామని మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొస్తే సహించేదిలేదని హెచ్చరించారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈనెల 9వ తేదీన జిల్లాలోకి ప్రవేశించే మహాపాదయాత్రకు ఘన స్వాగతం పలకాలని నేతలు నిర్ణయించారు. 17న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత తిరుపతిరావు  మాట్లాడుతూ.. నాడు రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారన్నారు. అమరావతి రాజధానిగా నాడు జగన్మోహన్‌రెడ్డి కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. నేడు మూడు రాజధానుల అంశాన్ని  తెరమీదికి తెచ్చారని పేర్కొన్నారు. తమ పాదయాత్ర 29 గ్రామాల భూముల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్‌ కోసమని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ. రామానాయుడు మాట్లాడుతూ.. శాసనమండలిలో బలం పెరిగింది కాబట్టి తిరిగి మూడు రాజధానుల బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా 34వేల ఎకరాలను రైతులు రాజధానికి ఇచ్చారన్నారు. మెజార్టీ ఉందికదా అని వైసీపీ నాయకుల ఆర్థిక లబ్ధి కోసం మూడు రాజధానుల అంశం తీసుకొచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత మాంగాటి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ఏదంటే నేటికీ ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో రైతులు పోరాటాలు చేస్తే చట్టాల్లోని అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని అమరావతినే ఉండాలని  రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. అమరావతిని రాజధానిని భావితరాలకు  అన్ని విధాల ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సంకల్పిస్తే.. దానిని ఎలా నిర్వీర్యం చేయాలా అని జగన్‌ ప్రయత్నిస్తున్నారని తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌  ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్‌, ఏఐటీయూసీ నాయకులు మురళి, రాధాకృష్ణ, రవి, రాజ, రైతు సంఘ కార్యదర్శి పి.నరసింహులు, కుమార్‌ రెడ్డి, శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మికసంఘం కార్యదర్శి చిన్నంపెంచలయ్య,  మహిళాసమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, నదియా, రత్నమ్మ, విజయ, ఏఐవైఎఫ్‌ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు  సప్తగిరి ప్రసాద్‌, రమణ, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T07:49:34+05:30 IST