అమరీందర్‌, సుఖ్‌దేవ్‌తో మాట్లాడుతున్నాం

ABN , First Publish Date - 2021-12-05T08:09:50+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ముంగిట పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ..

అమరీందర్‌, సుఖ్‌దేవ్‌తో మాట్లాడుతున్నాం

  పంజాబ్‌లో కూటమి కోసం ప్రయత్నిస్తున్నాం

  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ, డిసెంబరు 4 : అసెంబ్లీ ఎన్నికల ముంగిట పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, అకాలీ దళ్‌ మాజీ నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ థిండ్సాతో కూటమి ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఢిల్లీలో శనివారం హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2021లో కీలకోపన్యాసం చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల ప్రభావం పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపై ఉండదని చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ మంచి మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. దశాబ్దాలుగా ఆర్టికల్‌ 370 ఉనికిలో ఉన్నా జమ్మూ, కశ్మీర్‌లో అశాంతి నెలకొందని షా అన్నారు. ఆ నిబంధన రద్దు శాంతి భద్రతలకు నాంది పలికిందని, కశ్మీర్‌కు మంచి పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 

Updated Date - 2021-12-05T08:09:50+05:30 IST