పరాయి గూటికి గోదావరి డెయిరీ

ABN , First Publish Date - 2020-12-03T06:24:50+05:30 IST

ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన రాజమహేంద్రవరం గోదావరి డెయిరీ పరాయి గూటికి చేరనుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వరంగ సహకార సంస్థ అయిన ఇది నిర్వీర్యం కాబోతోంది.

పరాయి గూటికి గోదావరి డెయిరీ

  అమూల్‌ సంస్థ చేతికి పగ్గాలు 

  దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వరంగ సంస్థ నిర్వీర్యం 

 ప్రైవేట్‌ యాజమాన్యానికి ధారాదత్తం  

  నీరుగారిన మిల్క్‌మిషన్‌, పశుక్రాంతి, ఆర్‌కేవీవై పథకాలు 

  కనుమరుగైన బల్క్‌మిల్క్‌ సెంటర్లు 

  కొత్తగా పాలసేకరణ కేంద్రాలకు సన్నాహాలు 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగిన రాజమహేంద్రవరం గోదావరి డెయిరీ పరాయి గూటికి చేరనుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వరంగ సహకార సంస్థ అయిన ఇది నిర్వీర్యం కాబోతోంది. గుజరాత్‌ కేంద్రం గా పాలు, పాల పదార్థాల ఉత్పత్తి సంస్థ అమూల్‌ యాజమాన్యం దీని పగ్గాలు చేపట్టనుంది. తదనుగుణంగా జిల్లాకు తలమానికంగా పేరుగాంచిన ఈ ప్రభుత్వ డెయిరీని ప్రైవేట్‌పరం చేసి, సదరు సంస్థ యాజమాన్యానికి ప్రభుత్వం ధారాదత్తం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అమూల్‌ సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది సెప్టెంబరు 14న జిల్లా అధికారులతో కలిసి డెయిరీలో ఎక్విప్‌మెంట్‌ పరిశీలించారు. త్వరలో ముహూర్తం ఖరారు చేసి డెయిరీ నిర్వహణ బాధ్యతలను స్వాధీనం చేసుకోడానికి సమాయత్తమవుతున్నారు. వాస్తవానికి ఈ డెయిరీకి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ప్రవేశపెట్టిన మిల్క్‌మిషన్‌, పశుక్రాంతి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలైన రాష్ర్టీయ కృషి విజ్ఞాన్‌ యోజన (ఆర్‌కేవీవై) పథకాలు నీరుగారిపోయాయి. ఈ పథకాలను బలోపేతం చేస్తామని, ఔత్సా హిక యువ రైతులతో గతంలో గ్రామాల్లో వెయ్యికి పైగా ఏర్పాటు చేసిన బల్క్‌మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ)లు ఇప్పుడు జిల్లాలో కనుమరుగయ్యాయి. అక్కడక్కడా వెతికితే వంద లోపు ఉంటాయని తెలుస్తోంది. ఈ పథకాలను  వైసీపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేసి, గోదావరి డెయిరీకి పూర్వవైభవం తీసుకువస్తుందని పాడి రైతులు ఎదురు చూశారు. కానీ అసలుకే ఎసరు పెట్టే విధంగా నిర్ణయాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఆధ ్వర్యంలో 1978 నుంచి 1990 వరకు గోదావరి డెయిరీ ఒక వెలుగు వెలిగింది. 400 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 200 మంది తాత్కాలిక ఉద్యోగులు దీనిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకునేవారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతుల ద్వారా ప్రతీ రోజూ లక్షల లీటర్లలో పాలు ఈ డెయిరీకి సరఫరా చేసేవారు. దీంతో ‘విజయ బ్రాండ్‌’ పేరుతో పాలు, పాల ఉత్పత్తులు జిల్లావాసులకు, ఇతర జిల్లాలకు సరఫరా అయ్యేవి. నిత్యం సంస్థ కార్యకలాపాలతో కళకళలాడే ఈ డెయిరీకి 1991 నుంచి గ్రహణం పట్టింది. దీన్ని పర్యవేక్షిస్తున్న శాఖాధికారులు ఉదాశీనంగా వ్యవహరించడం వల్ల క్షీణ దశకు చేరింది. 2015 వరకు ఈ డెయిరీకి ఉన్న పాలకవర్గం ఎక్స్‌అఫీషియో హోదాలో కొనసాగింది. 2017 పాలకవర్గానికి గడువు ముగిసింది. డెయిరీలో కార్యకలాపాలు నిలిచిపోవడంతో కొత్త పాలకవర్గానికి ఎన్నికలు నిలిపివేశారు. డెయిరీ ఉనికి కాపాడుకోడానికి గత పాలకవర్గ సభ్యులు తీవ్ర ప్రయత్నం చేసి ప్రభుత్వం సహకరించకపోవడంతో చేతులెత్తేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఓ డెయిరీ ఉందని నమ్మించడానికి రైతుల నుంచి సేకరిస్తున్న పాలను బయట పాల కేంద్రాలకు విక్రయిస్తూ, ప్యాకెట్‌లపై విజయ డెయిరీ పాలు అనే ముద్ర వేసి కొంతకాలం మనుగడ సాగిస్తూ వచ్చారు. అదేవిధంగా పాల ఉత్పత్తి పెంచడంతోపాటు పేద, నిరుద్యోగ మహిళలకు జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో 2012లో ప్రభుత్వం ‘మిల్క్‌ మిషన్‌’ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇది అమలు చేయలేక చతికిలపడింది.

భ్రాంతిగా మిగిలిన పశుక్రాంతి

రాష్ట్ర ప్రభుత్వం 2004లో పశుక్రాంతి పేరిట ప్రారంభించిన పథకం కూడా ఇదేవిధంగా చతికిలపడింది. డ్వాక్రా మహిళతో మినీ డెయిరీలను ఏర్పాటు చేసి, ఈ డెయిరీలు సేకరించిన పాలను గోదావరి డెయిరీకి పంపి, డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయినా గోదావరి డెయిరీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇదే సమయంలో ప్రైవేట్‌ డెయిరీలు అధిక సంఖ్యలో బలోపేతమయ్యాయి. ఉభయగోదావరి జిల్లాల పాడి రైతుల కల్పతరువుగా ఉన్న గోదావరి డెయిరీ బలోపేతం చేయడానికి అప్పటి మంత్రులు కనీస చర్యలు చేపట్టలేకపోయారనే అపవాదు ప్రచారంలో ఉంది. 2013 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ర్టీయ కృషి విజ్ఞాన యోజన (ఆర్‌ కేవీవై) స్కీమ్‌ పేరుతో పాడి పరిశ్రమ బలోపేతం చేసి, డ్వాక్రా సభ్యులకు, ఎస్సీ,ఎస్టీ, బీసీ యువతతో మినీ డెయిరీలను స్థాపించాలని జీవో జారీ చేశారు. ఒక యూనిట్‌లో రెండు పాడి గేదెలు, మూడు ఆవులు.. ఇలా ఒక్కో మండలానికి ఒక్కో యూనిట్‌ ఇవ్వాలని గైడ్‌లైన్స్‌ సిద్ధం చేశారు. యూనిట్‌ ఖరీదు రూ.3 లక్షలైతే, బ్యాంకు ఇచ్చిన మొత్తం రూ.3 లక్షల రుణంలో రూ.1 లక్ష పశు సంవర్థక శాఖ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీగా ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. అయితే జిల్లావ్యాప్తంగా 5 యూనిట్లు తప్ప, మిగిలిన యూనిట్లకు బ్యాంకర్లు రుణం మంజూరు చేయకపోవడంతో ఈ పథకం కూడా మూలనపడింది.

వైఎస్సార్‌ చేయూత 

గోదావరి డెయిరీకి పూర్వస్థితి తీసుకువస్తున్నామని రైతులను నమ్మించడానికి వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రభుత్వం తెర ముందుకు తెచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పాడి పశువులను అందించనుంది. ఇందుకు ఒక్కో యూనిట్‌ రూ.75 వేల వ్యయంతో పశువులను కొనుగోలు చేయాలి. పశుసంవర్థకశాఖ, డీఆర్‌డీఏ శాఖలు సంయుక్తంగా పథకాన్ని పర్యవేక్షించనున్నాయి. లబ్ధిదారులు యూనిట్‌ ఖరీదులో 20 శాతం పెట్టుబడి పెడితే, మిగిలిన మొత్తాన్ని బ్యాంకర్లు రుణాలివ్వాల్సి ఉంటుంది. లబ్ధిదారులు స్వయంగా పశువులను ఎంపిక చేసుకునేలా అవకాశం కల్పిస్తారు. పశువులు కొనుగోలు చేసిన రైతులందరూ అమూల్‌ సంస్థ ఏర్పాటు చేసే పాల సేకరణ కేంద్రాలకు పాలు పోయాల్సి ఉంటుంది. ఇందుకు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) పాల సేకరణ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు, మూడు మండలాలకు ఒక బీఎంసీయూ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 987 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. కేంద్రాల నుంచి బీఎంసీయూలకు వచ్చిన పాలను అమూల్‌ నిర్వహిస్తున్న గోదావరి డెయిరీకి పాలను తరలిస్తారని సమాచారం.

Updated Date - 2020-12-03T06:24:50+05:30 IST