అంతా గాలిమాటలే.. అమూల్‌ అట్టర్‌ ఫ్లాప్

ABN , First Publish Date - 2021-09-08T07:00:49+05:30 IST

జగనన్న పాల వెల్లువ..

అంతా గాలిమాటలే.. అమూల్‌ అట్టర్‌ ఫ్లాప్
దర్శిలో మూతబడిన అమూల్‌ పాలసేకరణ కేంద్రం

జగనన్న పథకానికి పాడి రైతుల విముఖత 

జిల్లాలో పడకేసిన అమూల్‌ ప్రాజెక్టు

23వేల నుంచి 7వేలకు దిగజారిన రోజువారీ పాలసేకరణ

45శాతం కేంద్రాల్లో పూర్తిగా నిలిపివేత

పలు గ్రామాల్లో నగదు చెల్లింపులపై వివాదాలు 

నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వలేదని ఉత్పత్తిదారుల గగ్గోలు 

ఒంగోలు డెయిరీ నుంచి కొండమంజులూరుకు మారిన కార్యకలాపాలు 


(ఒంగోలు, ఆంధ్రజ్యోతి): జగనన్న పాల వెల్లువ పథకం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఎంత ఆర్భాటం చేసినా జిల్లాలోని పాడిరైతులు నుంచి స్పందన కరువైంది. అమూల్‌ను ఆదరించడం లేదు. మెరుగైన ధర ఇస్తున్నామని యంత్రాంగం ఊదరగొడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పక్షం రోజులుకొకసారి కలెక్టర్‌ నుంచి క్షేత్రస్థాయి వరకూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాడిరైతులు చుట్టూ పాలు పోయండంటూ తిరుగుతున్నా ససేమిరా అంటున్నారు. అమూల్‌ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం జిల్లాలో అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. బెదిరింపులు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. అధికారికంగా జిల్లాలో ఈ పథకం ద్వారా పాలసేకరణ ప్రారంభించి తొమ్మిది నెలలు అయినప్పటికి రోజువారీ డెయిరీలకు పోసే పాలలో కనీసం రెండు శాతం కూడా సేకరించ లేకపోతున్నారు. మొదట్లో పాలు పోసిన వేలాదిమంది రైతులు ప్రస్తుతం ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రారంభించిన వాటిలో ఇంచుమించు సగం కేంద్రాలు మూతపడటం అందుకు నిదర్శనం.


దర్శి మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో రోజుకు 2వేల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ గతేడాది అమూల్‌ పాల సేకరణ కేంద్రం ఆరంభించారు. రైతులకు డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవటంతో వారు పాలు పోయటం మానుకున్నారు. ఏజెంట్‌కు కూడా కమీషన్‌ ఇవ్వలేదు. దీంతో ఆ గ్రామంలోని రైతులంతా మరో ప్రైవేటు కేంద్రానికి పాలు పోస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అమూల్‌ కేంద్రం మూతబడింది. ఆ కేంద్రం నుంచి రైతులకు ఇంకా రూ.50వేలు అందాల్సి ఉంది. 


ఆహా..ఓహో అద్భుతం.. పాడిరైతులకు మెరుగైన ధరలు.. అమూల్‌తో ఇక అంతా లాభాలే.. అంటూ పాలక యంత్రాంగం చేసిన ఆర్భాటం అంతా గాలిమాటలే అని తేలిపోయింది. తొమ్మిది నెలలు తిరగక ముందే పథకం పడకేసింది. జగనన్న పాల వెల్లువ పథకం కోసం ఒంగోలు డెయిరీని ప్రభుత్వమే మూసివేయించింది. అది మూతపడే నాటికి సేకరిస్తున్న పాలలో సగం పరిమాణం కూడా ప్రస్తుతం అమూల్‌ కేంద్రాలకు రాని దుస్థితి ఏర్పడింది. మరోవైపు పలు గ్రామాల్లో అమూల్‌ సంస్థకు గతంలో పోసిన పాలకు ఇప్పటికీ నగదు రాలేదంటూ పాడిరైతులు, పాలసేకరణ చేసిన ఏజెంట్లు గగ్గోలు పెడుతున్నారు. ఈక్రమంలో తొలుత 201 ఆ తర్వాత మరో 41 వెరసి 242 గ్రామాల్లో పాలసేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే ప్రస్తుతం కేవలం 131చోట్ల మాత్రమే పాలసేకరణ జరుగుతోంది. అది కూడా జనవరి ఆఖరులో రోజువారీ 23వేల లీటర్ల సేకరణ జరగ్గా ప్రస్తుతం 7వేల లీటర్లకు పడిపోయింది.


పడిపోయిన పాల సేకరణ

అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభం నాటికి ప్రస్తుతానికి పరిశీలిస్తే జిల్లాలో పాలసేకరణ మూడొంతులకు పడిపోయింది. జిల్లాలోని 21 మండలాల్లో 201 గ్రామాల్లో 141 ఆర్‌బీకేల ద్వారా పాలసేకరణ లక్ష్యంగా పెట్టుకొని 27వేల మంది మహిళలకు అవగాహన కల్పించి 6,201 మందిని సభ్యులుగా చేర్పించారు. అయితే 109 గ్రామాల నుంచి పాలసేకరణ చేస్తున్నట్లు, 4,263మంది పాలు పోస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌ 2న ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంకు వివరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా సుమారు 21న ఈ ప్రాజెక్టును అమూల్‌ చేపట్టగా నెలాఖరు వరకు పది రోజుల్లో గతంకన్నా లీటరుకు రూ.20 వరకు అధికంగా రైతులకు అందుతోందని, ప్రైవేటు డెయిరీలు కూడా ధరలు పెంచాయని చెప్పారు. అలా ప్రారంభమైన ప్రాజెక్టు జనవరి ఆఖరు నాటికి రోజుకు 23వేల లీటర్ల సేకరణ స్థాయికి చేరింది. ఆ సమయంలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయి. అధికారుల, పాలసేకరణ ఏజెంట్ల అవగాహన లోపం, అధికంగా పాలు సేకరించాలన్న తాపత్రయంలో అధికశాతం వేయడం వంటి తప్పిదాలు జరిగాయి. అమూల్‌ అధికారుల కొర్రీలతో అనేకమంది పాడిరైతులకు నగదు చెల్లింపులు కోతపడ్డాయి. 


చెల్లింపుల్లో కోతలతో వివాదాలు

ప్రధానంగా గ్రామస్థాయి సంఘం నుంచి అమూల్‌ కేంద్రానికి వస్తున్న పాల పరిమాణానికి చెల్లింపు చేయాల్సిన మొత్తానికి వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అలా 57 సంఘాల విషయంలో వివాదం రాగా ఫిబ్రవరిలో రైతులకు 30శాతం కోతపెట్టి నగదును అమూల్‌ చెల్లించింది. ఈ వ్యవహారంలో పలు గ్రామాలకు చెందిన రైతులకు రూ.51లక్షల వరకు నేటికి చెల్లించలేదని అధికారులు నివేదిస్తుండగా, కొన్ని గ్రామాల్లో రైతులకు ఇవ్వాల్సిన దాని కన్నా అదనంగా రూ.30లక్షలు ఇచ్చామని వాటిని  రికవరీ చేయాలని అమూల్‌ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఆరు మాసాలుగా ఈ పంచాయతీ తేలకపోగా గతనెల 12న ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌బాబు నిర్వహించిన సమీక్షలో ఇదే విషయమై వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. 


ఏజెంట్లకూ మొండిచెయ్యి

మరోవైపు అనేక గ్రామాల్లో పాలసేకరణ చేసిన ఏజెంట్లకు కూడా వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనిపైనా స్పష్టమైన విధానం కనిపించడం లేదు. ఆయా సంఘాలకు హ్యాండ్లింగ్‌ చార్జీలు, ఇతర రూపాల్లో ఇచ్చే మొత్తం నుంచే సదరు ఖర్చులు చేసుకోవాలని అమూల్‌ పేర్కొంటుండగా కనీసం రోజుకు 200 లీటర్ల సేకరణ జరిగితేనే ఆమేర సంఘం భరించే అవకాశం ఉంటుంది. అలాంటిది  పట్టుమని పదిశాతం కూడా లేకపోగా అసలు నిబంధనల ప్రకారం సహకారశాఖ పరిధిలో పూర్తిస్థాయిలో సంఘాల రిజస్ట్రేషన్‌లే ఇంతవరకు జరగలేదు. ఇదిలా ఉండగా తొలుత 201 గ్రామాల్లో సేకరణ ప్రారంభించగా మూడునెలల క్రితం మరో 41 గ్రామాల్లో చేపట్టారు. ప్రస్తుతం 57చోట్ల నగదు చెల్లింపుల వివాదాలతో అగిపోయాయి. అనుకున్నవాటిలో 27చోట్ల అసలు ప్రారంభమే కాలేదు.   


ఒంగోలు నుంచి కొండమంజులూరుకు..

తొమ్మిదినెలలపాటు ఒంగోలులోని డెయిరీ ప్రాంగణంలో కార్యకలాపాలు కొనసాగించిన అమూల్‌ ఇక్కడ ఖర్చులు అధికమంటూ పదిరోజుల క్రితం పంగులూరు మండలం కొండమంజులూరులోని శీతలీకరణ కేంద్రానికి కార్యకలాపాలు మార్చింది. దీంతో ఇక్కడి డెయిరీ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. కాగా జిల్లాలో జగనన్న పాలవెల్లువ, ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై నోడల్‌ అధికారి డాక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ కొత్త పథకం కావడంతో విస్తరణకు మరికొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం 118 సంఘాలు రోజువారీ ఖర్చులు భరించే స్థాయికి పాల సేకరణ చేస్తున్నాయన్నారు. జిల్లాలో ఆగస్టు 31 నాటికి అమూల్‌ ప్రాజెక్టు ద్వారా 31లక్షల లీటర్ల పాలసేకరణ జరగ్గా రూ.16కోట్ల మేర రైతులకు వచ్చాయని సగటున లీటరుకు రూ.49.50 ధర లభించిందన్నారు. కొన్ని గ్రామాల్లో నగదు బకాయిలు విషయం ఉన్నతాధికారులకు పరిశీలనలో ఉందని త్వరలో వస్తాయన్నారు. 


చెల్లింపుల్లో కోతలతో వివాదాలు

ప్రధానంగా గ్రామస్థాయి సంఘం నుంచి అమూల్‌ కేంద్రానికి వస్తున్న పాల పరిమాణానికి చెల్లింపు చేయాల్సిన మొత్తానికి వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అలా 57 సంఘాల విషయంలో వివాదం రాగా ఫిబ్రవరిలో రైతులకు 30శాతం కోతపెట్టి నగదును అమూల్‌ చెల్లించింది. ఈ వ్యవహారంలో పలు గ్రామాలకు చెందిన రైతులకు రూ.51లక్షల వరకు నేటికి చెల్లించలేదని అధికారులు నివేదిస్తుండగా, కొన్ని గ్రామాల్లో రైతులకు ఇవ్వాల్సిన దాని కన్నా అదనంగా రూ.30లక్షలు ఇచ్చామని వాటిని  రికవరీ చేయాలని అమూల్‌ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఆరు మాసాలుగా ఈ పంచాయతీ తేలకపోగా గతనెల 12న ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌బాబు నిర్వహించిన సమీక్షలో ఇదే విషయమై వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. 





రూ.3వేల బకాయి  రావాల్సి ఉంది

అమూల్‌ డెయిరీకి పాలు పోస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి పాలుపోయించుకున్నారు. తీరా పోసిన పాలకే ఇంకా రూ.3వేల బకాయి ఉంది. మా గ్రామంలో రూ.60వేల బకాయిలు ఉన్నాయి. డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటంతో అమూల్‌కు పాలు పోయటం మానుకున్నాం. ఇప్పుడు కేంద్రం మూతపడింది. అమూల్‌ కంటే ప్రైవేట్‌ డైయిరీలే మేలు. కచ్ఛి తంగా 10 రోజులకొకసారి డబ్బులు ఇస్తున్నారు.

- జాగర్లమూడి ఆదిశేషమ్మ, జాగర్లమూడి వారిపాలెం, జె.పంగులూరు మండలం

కమీషన్‌ కూడా సక్రమంగా ఇవ్వలేదు

అమూల్‌ కేంద్రంలో నెలల తరబడి పాలసేకరణ చేసినప్పటికీ నాకు రావాల్సిన కమీషన్‌ సక్రమంగా ఇవ్వలేదు. పాలరైతులకు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. కమీషన్‌ సొమ్ము రూ.50వేలు అందాల్సి ఉంది. ఇక్కడ డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవటంతో పాలకేంద్రం మూతబడింది. ప్రస్తుతం గ్రామస్థులు ప్రైవేట్‌ కేంద్రాలకు పాలు పోస్తున్నారు.

- నాగార్జునరెడ్డి, ఏజెంట్‌, కొత్తరెడ్డిపాలెం 


Updated Date - 2021-09-08T07:00:49+05:30 IST