న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే కుతంత్రం

ABN , First Publish Date - 2020-10-16T08:46:37+05:30 IST

న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలతో ఫిర్యాదు చేసి... ఆ పత్రాలను బహిర్గతం చేసిన ముఖ్యమంత్రి జగన్‌పై న్యాయవాద సంఘాలు మండిపడ్డాయి.

న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే కుతంత్రం

జడ్జిలను బెదిరించేందుకే జగన్‌ లేఖ 

న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనే దాడి

సీఎంపై అనేక క్రిమినల్‌ కేసులు

న్యాయపాలన సాఫీగా సాగకుండా

అడ్డుకోవాలనే రహస్య అజెండా

ఈ విచ్ఛిన్నకర శక్తులను ఓడించేందుకు

పౌరులు, లాయర్లు ముందుకు రావాలి

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు

కోర్టు ధిక్కారమే: ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌

న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరం

సుప్రీం మహిళా న్యాయవాదుల తీర్మానం

లేఖ దురుద్దేశపూరితం: ‘తమిళ’ సంఘం

ఫుల్‌ కోర్టులో చర్చించండి

జగన్‌పై తీవ్రమైన చర్య తీసుకోవాలి

సీజేకు న్యాయవాది అశ్వినీ కుమార్‌ లేఖ


న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలతో ఫిర్యాదు చేసి... ఆ పత్రాలను బహిర్గతం చేసిన ముఖ్యమంత్రి జగన్‌పై న్యాయవాద సంఘాలు మండిపడ్డాయి. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తమిళనాడు న్యాయవాదుల సంఘం వరకు... పలు సంఘాలు సీఎం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖను తీవ్రంగా పరిగణించి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.  న్యాయమూర్తులను బెదిరించేందుకే ఆయన ఈ లేఖ రాశారని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీనిని న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనే దాడిగా అభివర్ణించింది. ‘కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను లక్ష్యంగా చేసుకుని  జగన్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇది దిగ్ర్భాంతికరం. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే గాక.. ఆ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులపై ఆయన దాడి చేశారు. ఇదంతా తన స్వప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తూ, న్యాయమూర్తులను బెదిరించే చర్యగా మేం భావిస్తున్నాం’ అని పేర్కొంది.


ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కొందరు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసి న్యాయ పరిపాలనా వ్యవస్థనే దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే ఈ దాడులు జరగడం ఆందోళనకరం.   ఇది న్యాయమూర్తులను బెదిరించే చర్య!

- మనీశ్‌ కుమార్‌ మిశ్రా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌


జగన్‌ ఆరోపణలు దురుద్దేశపూరితం: ఢిల్లీ బార్‌

జగన్‌ చర్య కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆసియాలోనే అతి పెద్ద న్యాయవాదుల సంఘమైన ఢిల్లీ బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తులపై ఆ సీఎం చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, దురుద్దేశపూరితమైనవని తెలిపింది. ఇది న్యాయవ్యవస్థ పనితీరు, పరిపాలనలో జోక్యం చేసుకునేదిగా ఉందని తప్పుబట్టింది. జస్టిస్‌ రమణ నిజాయితీ, నైతికత , విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని, సిటింగ్‌ న్యాయమూర్తులపై తప్పుడు ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదని తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ దేశంలో ఉన్నత న్యాయప్రమాణాలను పరిరక్షిస్తున్న వారిలో ఒకరని తీర్మానించింది. దురుద్దేశంతోనే జగన్‌ తన లేఖను ప్రచారం చేశారని విమర్శించింది. జస్టిస్‌ రమణపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.


ప్రజల విశ్వాసాన్ని సడలింపజేసే కుతంత్రం.. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

‘న్యాయమూర్తులపై బురదజల్లి, వారి ప్రతిష్ఠను దిగజార్చే స్పష్టమైన ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌ తన లేఖను మీడియాకు విడుదల చేసే దుశ్చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇది న్యాయవ్యవస్థ, న్యాయపరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని సడలింపజేసే కుతంత్రం తప్ప మరేమీ కాదు. జస్టిస్‌ రమణ ప్రధాన న్యాయమూర్తి అవుతున్నారనే వాస్తవంతోనే ఈ వ్యక్తుల ఉద్దేశం మరింత బయల్పడుతోంది.  ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా లెక్కలేనన్ని క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలియనిది కాదు. రాజకీయాల్లో నేరచరితులను ఏరివేయాలనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ రమణ విచారిస్తున్న విషయం మనందరం గమనించాలి. తన లేఖను మీడియాకు విడుదల చేయడం ద్వారా జడ్జిపై ఒత్తిడి తేవాలనుకుంటున్నట్లు కనపడుతోంది. న్యాయపరమైన క్రమశిక్షణ ప్రకారం ఇలాంటి శక్తులతో బహిరంగంగా పోరాటానికి దిగి, వారి దుష్ట యత్నాలను ఎదుర్కోవడం బార్‌ కౌన్సిల్‌కు సాధ్యం కాదు.


అందువల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత బార్‌ భుజస్కంధాలపైన, బాధ్యతాయుతమైన పౌరుడిపైన ఉంది. న్యాయస్థానాలు, న్యాయపరిపాలన సాఫీగా సాగడాన్ని అడ్డుకోవాలనే రహస్య ఎజెండాతో దుష్టబుద్దితో వ్యవహరిస్తున్న ఈ విచ్ఛిన్నకర శక్తులను విధ్వంసం చేసి చిత్తుగా ఓడించేందుకు దేశంలోని వివేకవంతులైన పౌరులు, ప్రధానంగా న్యాయవాదులు ముందుకు రావలసిన సమయం ఆసన్నమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ పనితీరులో జోక్యం చేసుకునే ఉద్దేశం బార్‌ కౌన్సిల్‌కు లేదు. సర్వోన్నత న్యాయస్థానం గౌరవప్రతిష్ఠలను కాపాడేందుకు కౌన్సిల్‌ ఎప్పుడూ ముందుంటుంది.  న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నం ఎప్పుడు జరిగినా.. న్యాయమూర్తుల వెనుక ఈ దేశంలోని న్యాయవాదులు అండగా నిలబడ్డారు. న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠ పాల్జేసే ఎలాంటి కుతంత్రాన్నీ న్యాయసమాజం సహించదు..’


 బాధ్యతారాహిత్యం: సుప్రీం మహిళా న్యాయవాదుల సంఘం

జగన్మోహన్‌రెడ్డి లేఖను తీవ్రంగా ఖండిస్తూ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తీర్మానించింది.  జస్టిస్‌ ఎన్‌వీ రమణపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాయడమే గాక దానిని మీడియాకు విడుదల చేయడం అత్యంత బాధ్యతారహితమైనదని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ లేఖ న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరమే కాక వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రేరణా కుమారి  తెలిపారు.


తమిళనాడు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ ఖండన

ఏపీ సీఎం జగన్‌ రాసిన లేఖ భారత న్యాయవ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోందని తమిళనాడు అడ్వకేట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా  జగన్‌ న్యాయవ్యవస్థ అధికారాన్నే దిగజార్చారని అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.ప్రభాకరన్‌ మండిపడ్డారు. ఆయన లేఖ నిరాధారం, దురుద్దేశపూరితమని పేర్కొంటూ  జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు గురువారం లేఖ రాశారు. 


జగన్‌ అనేక నేరాలకు పాల్పడ్డారు

‘నేర’నేతలపై నా పిటిషన్‌ ఆధారంగానే జస్టిస్‌ రమణ బెంచ్‌ చర్యలు

తుది ఉత్తర్వుల జారీ సమయంలో.. ఒత్తిడి తేవడానికే జగన్‌ లేఖ రాశారు

 తీవ్ర చర్య తీసుకోవలసిందే

సుప్రీం చీఫ్‌ జస్టి్‌సకు అశ్వినీకుమార్‌ లేఖ


 జగన్‌ లేఖపై సుప్రీంకోర్టు ఫుల్‌ కోర్టును సమావేశపరిచి చర్చించి తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుతూ భారత ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ గురువారం లేఖ రాశారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు, నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. జగన్‌, ఆయన అనుచరులు అనేక నేరాలకు పాల్పడ్డారని, శిక్ష పడితే ఆయనకు కనీసం పదేళ్లు జైలు పడుతుందని తెలిపారు. ‘ఇలాంటి నేర చరితులను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించి ఏడాదిలోపు వారిపై కేసులను తేల్చేయాలని నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగానే జస్టిస్‌ రమణ బెంచ్‌ తగిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.


దానిపై తుది ఉత్తర్వులు జారీ చేయనున్న సమయంలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి చేసే దుష్ట బుద్ధితోనే జగన్‌ ఈ లేఖ రాశారు. ఈ కేసును నీరుగార్చి న్యాయ విచారణను దెబ్బతీయడం కోసమే లేఖను బహిరంగంగా విడుదల చేసినట్లు కనపడుతోంది. న్యాయవ్యవస్థను, కార్యనిర్వాహక శాఖను వేరు చేసే లక్ష్మణ రేఖను ఆయన ఉల్లంఘించారు.   బెంచ్‌ను మార్చాలని భావిస్తున్నారు. ఇదొక నీచమైన, మోసపూరిత చర్య మాత్రమే కాక న్యాయవ్యవస్థను భయపెట్టే ఉద్దేశంగా కనపడుతోంది. న్యాయవ్యవస్థపై ఇలాంటి మోసపూరిత, కుత్సిత చర్యలకు పాల్పడ్డాలన్న ఆలోచనే రాకుండా చేయాలి. అందుకు పూర్తి కోర్టును సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తగిన చర్యలు తీసుకుని బలమైన సందేశాన్ని పంపాలి’ అని ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు.

Updated Date - 2020-10-16T08:46:37+05:30 IST