Abn logo
Sep 21 2020 @ 04:10AM

‘‘జీవిత అనుభవాల్ని తాత్వికతతో ప్రకటించే ప్రయత్నం’’

Kaakateeya

వారాల ఆనంద్‌ : పలకరింపు


‘ముక్తకాలు’ పేర వచ్చిన మీ కవిత్వ సంపుటి గురించి చెప్పండి? ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇంగ్లీషు అనువాదాలతో వేయాలని ఎందుకు అనిపించింది?

రవీంద్రనాథ్‌ ఠాగోర్‌, ఖలీల్‌ జిబ్రాన్‌, ఘాలిబ్‌, గుల్జార్‌, జావేద్‌ అఖ్తర్‌, సచ్చిదానందన్‌, రూమి ఇట్లా అనేకమంది మహాకవుల్ని చదువుతూ చదువుతూ నా ఈ ఆరు దశాబ్దాల జీవిత కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, గెలుపు ఓటములు, అవమానాలు, అభినందనలు, ఆలోచనలు అన్నింటినీ ఒక తాత్విక దృక్పథంతో పంచుకోవాలను కున్నాను. రెండేసి పంక్తుల్లో రాయడం ఆరంభించాను. ఆప్పటికి ప్రక్రియాపరంగా ఎలాంటి ఆలోచనా లేదు. నిజానికి నాకు వ్యాకరణం కానీ ప్రాచీన సాహిత్య పరిచయం కానీ తక్కువే, కానీ ఈ రచనల్ని చూసి ఆత్మీయ మిత్రుడు సంస్కృత పండితుడు దివంగత నమిలకొండ హరిప్రాద్‌ ‘ముక్తకాల్ని’ కొనసాగించమ న్నాడు. అప్పుడు వీటికి ముక్తకాలు అన్న పేరును అనుకున్నాను. ముక్తకాల గురించి కొంత అధ్యయనం చేసాను. ముక్తకమంటే విడువబడినది, అంటే ఒక రాశిగా, మాలగా కూర్చనిది అని అర్థం. ముక్తకాలను ఒకచోట చేరిస్తే ‘ముక్తకమాల’ అవుతుంది. ఆ ముత్యాలను ఏరుకునే ఓపిక ఉండాలే కాని సాహిత్యంలో విరివిగా లభిస్తాయి. వాటికి విలువ కట్టలేము. వెలలేని ఆ సంపద ఆయా కాలాల్లో సాహిత్యంలో అనూచానంగా వచ్చి చేరు తూనే వుంది. ముక్తకమంటే అందులోని భావం పాఠకు డికి వదిలివేయబడింది అని కూడా అర్థం వుంది. అయితే ఇవేవీ ఆలోచించకుండానే నేను ముక్తకాలు రాయడం ఆరంభించాను. 


గాథా సప్తశతి, శతకాలు కూడా ముక్తకాల వంటివే. వాటిలో సన్నివేశమో సందర్భమో భక్తి నీతి వంటి వేవో అంశాలుంటాయి. మరి మీరు వస్తువు లేకుండా కవిత్వం రాశారు ఎలా?

సంస్కృతమే కాకుండా ప్రాకృతంలో కూడా ముక్తకాలు రత్నాలుగా భాశించాయి. పాఠకుల మనస్సులో నిలిచిపో యాయి. గాథాసప్తశతి చాలా ప్రసిద్ధమయింది. అందులో దేనికదే అందమయిన కుసుమం. దేని అందం దానిదే. మనసు పెట్టి చదివితే ఎన్నో జీవన సత్యాలు తెలుస్తాయి. మహారాజు జీవితం నుండి సామాన్య మనిషి జీవితం వరకు అందులో ప్రతిఫలిస్తుంది. అయితే నేను నా జీవిత అనుభవాల్ని తాత్వికతతో ప్రకటించే ప్రయత్నం చేసాను. 

‘గాలి కదలికకో ఆకుసవ్వడికో ఏకాగ్రత చెడితే 

నేరం మనసుదే గాలినో ఆకునో నిందించకు’ 

‘గాయాలూ జ్ఞాపకాలూ తడి తడిగానే వుంటాయి 

ఎప్పటికయినా గాయాలు మానిపోతాయి 

జ్ఞాపకాలు మిగిలిపోతాయి’

‘కాలం నేను ఎదురెదురు నిలబడ్డాము  

కాలానికి అలసట తెలీదు నాకేమో గమ్యం తెలీదు’

ఇట్లా నా అనుభవాల్లోంచి, ఆలోచనల్లోంచి వెలువడిన ఓ తాత్విక కవితా పంక్తులు ఇవి. దేనికదేగా వుంటాయి కాని అంతర్లీనంగా మానవ దృక్పథం, మనిషితనం కొన సాగుతూ వుంటుంది’ 


రెండేసి పంక్తుల్లో భావాల్ని వ్యక్తీకరించడం కష్టమని అనిపించలేదా?

కవనేవాడు ఎలాంటి నిబంధనలకూ నిర్బంధాలకూ లోను కాకుండా తననుతాను ఆవిష్కరించుకుంటూ వ్యక్తీకరించి నప్పుడే మంచి కవిత్వం రాయగలుగుతాడని నేను భావి స్తాను. అప్పుడే సూటిగా స్పష్టంగా పాఠకుడ్ని చేరతాడని నేను విశ్వసిస్తాను. అందుకే రెండు పంక్తుల్లో ముక్తకాలు రాసినా అంతకుముందు ‘మనిషి లోపల’, ‘అక్షరాల చెలిమె’ కవితా సంపుటాలు రాసినా పంక్తుల నియమమే కాదు ఏ నియమం పెట్టుకోలేదు. 


అయితే ఇవ్వాళ్టి ట్విట్టర్‌ జెన రేషన్‌కు దీర్ఘ కవితలు చదివే సమయమూ, ఓపికా లేవు. వారిని చేరడానికి ముక్తకాలు బాగా ఉప యోగపడ్డాయి. వాటిని పోస్ట్‌ చేసి నప్పుడు ఫేస్బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌ ఆప్‌, ఇంస్టాగ్రామ్‌లలో మంచి స్పందన వచ్చింది. ముక్తకాల్ని మిస్‌ అవుతున్నామని ఇప్పటికీ మెసేజెస్‌ వస్తుంటాయి. ఇంకా రాయాల్సివుంది.


ఇక తెలుగు-ఇంగ్లీష్‌లలో పుస్తకంవేయడం విషయానికి వస్తే మనసెరిగిన ఆత్మీయ మిత్రురాలు అనురాధ బొడ్ల గతంలో నా ‘మనిషి లోపల’ సంకలనాన్ని ‘Signature’ పేర ఇంగ్లీష్‌లోకి చేసారు. ఇప్పుడు ‘ముక్త కాలు’ అనువదించడానికి ముందుకు వచ్చారు ఫలితంగా కొత్త తరాన్ని చేరడానికి మంచి అవకాశం వచ్చింది. 

వారాల ఆనంద్‌

94405 01281

Advertisement
Advertisement
Advertisement