పోటీ సామర్థ్యం లోపించిన ఆర్థికం

ABN , First Publish Date - 2021-06-29T06:22:28+05:30 IST

పోటీపడడంలో మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ఏమిటి? ప్రపంచ ప్రధాన ఆర్థికవ్యవస్థలలోని పోటీపడే సామర్థ్య స్థాయి విషయమై స్విట్జర్లాండ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవెలప్...

పోటీ సామర్థ్యం లోపించిన ఆర్థికం

పోటీపడడంలో మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ఏమిటి? ప్రపంచ ప్రధాన ఆర్థికవ్యవస్థలలోని పోటీపడే సామర్థ్య స్థాయి విషయమై స్విట్జర్లాండ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవెలప్ ‌మెంట్ (ఐఎమ్‌డి) నిర్వహించిన ఒక అధ్యయనంలో భారత ఆర్థికవ్యవస్థకు గౌరవప్రదమైన స్థానం లభించలేదు. అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్న 64 దేశాలలో మనదేశం 43వ స్థానంలో ఉంది. మరింత సిగ్గుచేటైన విషయమేమిటంటే ఆరోగ్యం, పర్యావరణం అంశాలలో మన ఆర్థిక వ్యవస్థ అట్టడుగున, 64వ స్థానంలో ఉండగా విద్యలో 59వ స్థానంలో ఉంది. 


భారతీయ యువజనులు జీవనోపాధిని సాధించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను మన విద్యావిధానం సమకూర్చడం లేదన్నది స్పష్టం. విద్యా రంగంలో స్థితిగతుల మెరుగుదలకు ప్రభుత్వం గణనీయమైన స్థాయిలో వ్యయాలు చేస్తున్నప్పటికీ ఇటువంటి పరిస్థితి నెలకొనిఉండడం శోచనీయం. 2019-20 ఆర్థికసంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీడీపీ 3.3 శాతాన్ని విద్యకు ఖర్చు చేశాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది మన జీడీపీ రూ.197.4 లక్షల కోట్లు. అంటే విద్యకు వెచ్చించిన వ్యయం రూ.6.5 లక్షల కోట్లు. విద్యార్థుల జనాభా 45.9 కోట్లు. ఒక్కో విద్యార్థి, విద్యార్థినిపై ప్రభుత్వం సగటున రూ.14,000 ఖర్చు చేసింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావలసిన సమయం ఆసన్నమయింది. విద్యపై వెచ్చిస్తున్న మొత్తాన్ని విద్యార్థులకు నేరుగా ‘విద్యా వోచర్లు’ రూపేణా పంపిణీ చేయాలి.  తాము ఎంపిక చేసుకున్న పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో ఫీజుల చెల్లింపునకు వారు ఆ సొమ్మును ఉపయోగించుకుంటారు. నా అంచనా ఏమిటంటే మూడింట ఒక వంతు మంది విద్యార్థులు ఈ వోచర్లను ఉపయోగించుకోరు. ఉపయోగించుకునే రెండు వంతుల మందికి సంవత్సరానికి రూ.24,000 చొప్పున పంపిణీ చేయవచ్చు. గ్రామీణప్రాంతాలు, చిన్న పట్టణాలలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుకోవడానికి అవసరమైన ఫీజుల చెల్లింపునకు ఆ మొత్తం తప్పక సరిపోతుంది. ఈ పాఠశాలలు నెలకు రూ.1000 చొప్పున ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నాయి. 


ఆరవ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను నిర్బంధం చేయాలి. ఈ విద్యా నైపుణ్యాలు ఉన్నప్పుడే విద్యార్థులు భావిసవాళ్లు, అవకాశాలకు మెరుగ్గా సిద్ధమవుతారు. ఈ నేపథ్యంలో నూతన విద్యావిధానాన్ని పరిశీలిస్తే అది పూర్తిగా ఒక వైఫల్యమని చెప్పక తప్పదు. ఉపాధ్యాయులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు తగిన రీతిలో బహుమానం- శిక్ష విధానాన్ని సృష్టించడంలో నూతన విద్యావిధానం విఫలమయింది. ప్రాథమిక విద్యాస్థాయిలో ఆంగ్లభాషను, మాధ్యమిక స్థాయిలో సాంకేతిక విద్యను ప్రవేశపెట్టడంలో ఈ కొత్తవిధానం విఫలమయింది. కాలుష్య నియంత్రణ, ఆరోగ్యభద్రతా రంగాలలో కూడా మనదేశం పనితీరు ప్రశంసనీయంగా లేదు. ఈ రెండు అంశాలలోనూ మనదేశం అట్టడుగు స్థానంలో ఉన్నట్టు ఐఎమ్‌డి అధ్యయనం నిర్ధారించింది. కాలుష్య నియంత్రణలో వైఫల్యాలకు ప్రాథమిక బాధ్యత పూర్తిగా కేంద్రప్రభుత్వానిదే. ఆర్థికాభివృద్ధిని ఇతో ధికంగా సాధించే క్రమంలో అది పర్యావరణానికి జరుగుతున్న హానిని ఉపేక్షిస్తోంది. ఇటీవలి కాలంలో థర్మల్‌విద్యుత్ కేంద్రాలు వాయు కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన నిబంధనలను సడలించడమే ఇందుకు ఒక ఉదాహరణ. నదులను జలరవాణా మార్గాలుగా మార్చివేయడం ముమ్మరమయింది. తద్వారా మన నదులు కాలుష్యకాసారాలుగా మారడానికి ప్రభుత్వమే దోహదం చేస్తోంది. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌కు పలు సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. ఈ సవరణలు ఆమోదం పొందితే పలు కార్యకలాపాలు పర్యావరణ అనుమతి పరిధిలోకి రాకుండా పోతాయి. ఈ చర్యలేవీ పర్యావరణ సమతుల్యతకు దోహదం చేసేవి కావు. అయినా వాటిని అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 


సత్వర ఆర్థికాభివృద్ధి సాధనే లక్ష్యంగా పర్యావరణ భద్రతను ప్రభుత్వం ఉపేక్షిస్తుందన్నది స్పష్టం. మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? పూర్తిగా విరుద్ధ ఫలితాలు మాత్రమే సిద్ధిస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోవడంతో ఆర్థికా భివృద్ధి కూడా కుంటుపడిపోతోంది. దీనివల్ల అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాలతో పోటీపడే సామర్థ్యం మన ఆర్థికవ్యవస్థకు అంతకంతకూ తగ్గిపోతోంది. ఐఎమ్‌డి అధ్యయనం ఈ సత్యాన్నే నిర్ధారించింది. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్య సహిత ఆర్థికాభివృద్ధి విధానంపై పునరాలోచన చేయాలి. కాలుష్యాన్ని నియంత్రించే ఆర్థికాభివృద్ధి సాధన విధానాన్ని అనుసరించి తీరాలి. కాలుష్యం అవధులు మీరుతున్న కారణంగానే మన దేశం లోని పలువురు సంపన్నులు ఇతర దేశాలకు వలసపోవడం జరుగుతోంది. ఫలితంగా దేశ ఆర్థిక సౌష్ఠవం క్షీణించిపోతోంది. దారిద్ర్యం పెరిగిపోతోంది. 


ఆరోగ్యభద్రతా రంగంలోని పరిస్థితులు కూడా విద్యారంగ స్థితిగతులకు భిన్నంగా లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై ఏడాదికి సగటున రూ.1900 వ్యయం చేస్తున్నాయి. ఈ వ్యయం లోని రెండు అంశాలు: ప్రజారోగ్య రక్షణ, వ్యాధి నిర్మూలన వైద్యం. వ్యాక్సినేషన్ , ఆరోగ్య విద్య, అంటు వ్యాధుల నియంత్రణ మొదలైన కార్యకలాపాలన్నీ ప్రజారోగ్య రక్షణ కిందకు వస్తాయి. ఇవి ప్రభుత్వం మాత్రమే చేపట్టగలిగేవి. వ్యాధి నిర్మూలన వైద్యం వ్యక్తులకు ఆరోగ్యభద్రతా సేవలు సమకూర్చడం కిందకు వస్తుంది. ఈ సేవలను ప్రైవేట్‌రంగం కూడా అందిస్తోంది. వ్యాధి నిర్మూలనకు సంబంధించిన వ్యయాలలో అత్యధిక భాగం ప్రభుత్వ సిబ్బందికి ఉచిత ఆరోగ్య సేవలు కల్పించడానికే అవుతోంది. ఈ వ్యయాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పి తీరాలి. ప్రతి పౌరునికి ‘హెల్త్ వోచర్లు’ సమకూర్చాలి. తాము ఎంపిక చేసుకున్న ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అవి ఉపయోగపడతాయి. ఆరోగ్యభద్రత కోసం ప్రస్తుతం చేస్తున్న మొత్తం వ్యయం నుంచి ప్రతి పౌరునికి హెల్త్ వోచర్ రూపేణా ఏటా రూ.1500 సమకూర్చవచ్చు. అవే వోచర్లను ప్రభుత్వ సిబ్బందికి కూడా సమకూర్చాలి. 


పోటీ పడే సామర్థ్యం క్షీణముఖం పట్టడం మన ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి తోడ్పడదు. ప్రపంచ విపణిలో దీటుగా పోటీ పడే సామర్థ్యాన్ని మనం సత్వరమే పెంపొందించుకోవాలి. ఈ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న మన విద్యా, పర్యావరణ, ఆరోగ్య భద్రతా విధానాలలో మౌలిక మార్పులు తక్షణావసరం.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-06-29T06:22:28+05:30 IST