ఓ ఘట్టం ముగిసింది

ABN , First Publish Date - 2021-10-09T11:42:59+05:30 IST

బద్వేలు ఉప ఎన్నిక పర్వంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దేశంలో మూడు పార్లమెంట్‌ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణ కోసం గత నెల 28న షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఓ ఘట్టం ముగిసింది
బద్వేలు పట్టణంలో వైసీపీ అభ్యర్థి సుధా నామినేషన ర్యాలీ, ర్యాలీలో మాట్లాడుతున్న నాయకులు

బద్వేలు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వానికి తెర

మొత్తం 35 నామినేషన్లు.. చివరి రోజు 22

ఆఖరు రోజున వైసీపీ అభ్యర్థి సుధా రెండవ సెట్‌ దాఖలు

హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, అంజాద్‌బాషా

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వేలాది జనంతో రోడ్‌షో

వెల్లువెత్తుతున్న విమర్శలు

(కడప-ఆంధ్రజ్యోతి): బద్వేలు ఉప ఎన్నిక పర్వంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దేశంలో మూడు పార్లమెంట్‌ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణ కోసం గత నెల 28న షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో బద్వేలు ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గం ఒకటి. ఈ నెల ఒకటో తారీఖున రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టరు కేతనగార్గ్‌ నోటిఫికేషన జారీ చేసి.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఆరు రోజులు కేవలం మూడు నామినేషన్లే వచ్చాయి. చివరి రెండు రోజలు అభ్యర్థులు వెల్లువెత్తారు. గురువారం పది నామినేషన్లు దాఖలైతే.. ఆఖరు రోజు శుక్రవారం 22 నామినేషన్లు వచ్చాయి. అంటే.. మొత్తంగా 35 నామినేషన్లు దాఖలు కాగా.. వైసీపీ అభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టరు దాసరి సుధా, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌ ఇప్పటికే నామినేషన్ల వేసినా.. చివరి రోజు రెండవ సెట్‌ నామినేషన దాఖలు చేశారు. పలువురు స్వంతంత్రులు ఉప పోరులో మేము సైతం.. అంటూ నామినేషన్లు వేయడం కొసమెరపు. 11వ తేది నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ (వితడ్రా)కు ఆఖరు గడువని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌ పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణి సుధాకు వైసీపీ టీకెట్‌ ఇవ్వడంతో రాజకీయ సంప్రదాయానికి కట్టుబడి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించింది. జనసేన కూడా అదేదారిలో పయనించింది. దీంతో కాంగ్రెస్‌, బీజేపీలను ఒప్పించి ఏకగ్రీవం కోసం వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దీంతో పలువురు నామినేషన్ల దాఖలుకు ముందుకు రాలేదు. అయితే.. కాంగ్రెస్‌, బీజేపీలు పోటీకే మొగ్గుచూపి అభ్యర్థులను ప్రకటించడం.. నామినేషన్లు వేయడంతో చివరి రెండు రోజుల్లో 31 నామినేషన్లు దాఖలు కావడం కొసమెరుపు. వీరిలో ఎందరు వితడ్రా అవుతారో.. ఎందరు బరిలో ఉంటారో..? 13వ తేది వరకు వేచి చూడాల్సిందే.


తుంగలో ఎన్నికల నిబంధనలు

ఉప ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పొందుపరచిన నిబంధనలు, నియమావళిని ఆచరించాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులపై ఎంతైనా ఉంది. పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. ఇందుకు విరుద్ధంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే ఉప ఎన్నిక నియమావళి, నిబంధనలు తుంగలో తొక్కి వేలాది మందితో రోడ్‌షో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ప్రచారంలో ఎలా వ్యవహరిస్తారో..? అంటూ పలువురు పేర్కొనడం కొసమెరుపు. 4వ తేదీన వైసీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధా నామినేషన వేశారు. ఆ రోజు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు వీరంతా ర్యాలీగా నడచుకుంటూ వచ్చారు. నామినేషన్ల ఆఖరు రోజు శుక్రవారం ఆమె 2వ సెట్‌ నామినేషన దాఖలు చేశారు. దీనికి సిద్దవటం రోడ్డులోని మార్కెట్‌ యార్డు నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అవినాశరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతనిధులతో కలసి భారీ రోడ్‌షో నిర్వహించారు. దాదాపు రెండు కి.మీలు సాగిన ఈ రోడ్‌షోలో రెండు వేల మందికి పైగా ఉంటారని, రోడ్డు పట్టక పక్కన మరికొందరు ఉంటారని స్థానికులు అంటున్నారు. రోడ్‌షోను చిత్రీకరించిన వీడియోలు, రహదారిలో ఉంటున్న సీసీ కెమరాలను పరిశీలిస్తే ఎంత మంది ఉంటారో స్పష్టంగా తెలుస్తుంది. కాగా.. ఈ రోడ్‌షోకు అనుమతి ఇచ్చామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజంపేట సబ్‌ కలెక్టరు కేతనగార్గ్‌ పేర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉప ఎన్నికల షెడ్యూల్‌లో కొవిడ్‌-19 నిబంధనల దృష్ట్యా రోడ్‌షో, బైక్‌, సైకిల్‌ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు విజయరామరాజు గత నెల 30న నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ కేకేఎన అన్బురాజన, జేసీ (రెవెన్యూ) గౌతమి తదితరులు పొల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌సైతం ఎన్నికల నోటిఫికేషన విడుదల చేసిన రోజున అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని వివరించారు. దానికి ముందు ఆయన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిని తప్పకుండా అనుసరించాలని కోరారు. రోడ్‌షో, బైక్‌, సైకిల్‌ ర్యాలీలు నిషిద్ధం అని వివరించారు. ఇందుకు విరుద్ధంగా వేలాది మందితో రోడ్‌షో చేయడం విమర్శలకు తావిస్తోంది. వివరణ కోసం బద్వేలు ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌ను ఆంధ్రజ్యోతి ఫోనలో సంప్రదించగా అనుమతి ఉందంటూ ఫోన కట్‌ చేయడం కొసమెరుపు. ఆ తరువాత మళ్లీ ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.


కొవిడ్‌-19 నేపథ్యంలో ఎన్నికల ఆంక్షలు ఇవీ 

- ఇండోర్‌ సమావేశాలకు 30 శాతం కెపాసిటీ లేదా 200 మంది.. ఏది తక్కువ అయితే దానికే అనుమతి ఇస్తారు

- అవుట్‌ డోర్‌ సమావేశాలకు 50 శాతం కెపాసిటీ, 500 మంది.. ఏది తక్కువ అయితే దానికి అనుమతి ఉంటుంది

- ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్లుగా జాతీయ, రాష్ట్ర గుర్తింపు పార్టీలకు 20 మంది, గుర్తింపు లేని పార్టీలకు 10 మందికి అనుమతి

- రోడ్‌ షో, బైక్‌, సైకిల్‌ ర్యాలీలకు అనుమతి లేదు

- వీధుల్లో నిర్వహించే ప్రచార సభకు 50 మందికి మించరాదు

- ఇంటింటి ప్రచారానికి అభ్యర్థి లేదా ఆభ్యర్థి నియమించిన ప్రతినిఽధితో కలిపి ఐదుగురికే అనుమతి

- ప్రచార వీడియో వాహనాల వద్ద 50 మందికి మించి ఉండకూడదు

- 50 శాతం సీట్లతో ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 20 వాహనాలకు అనుమతి ఉంటుంది 

- పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాలు ఆపేయాలి

- పోలింగ్‌ రోజున అభ్యర్థికి రెండు వాహనాలు, ఒక్కో వాహనంలో ముగ్గురికే అనుమతి ఇస్తారు

- పోలింగ్‌ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు తప్పక రెండు డోసులు వ్యాక్సిన వేయించుకోవాలి.

Updated Date - 2021-10-09T11:42:59+05:30 IST