ఒక ఆలోచన మెరిసింది..

ABN , First Publish Date - 2022-01-21T04:58:00+05:30 IST

విశాఖ నగరంలోని కొమ్మాది రిక్షా కాలనీలోని ఏపీ బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ధావన్‌ స్పేస్‌ రోవర్‌ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికయ్యింది.

ఒక ఆలోచన మెరిసింది..
విద్యార్థినులు రూపొందించిన ధావన్‌ స్పేస్‌ రోవర్‌


జాతీయ స్థాయిలో కొమ్మాది గురుకుల విద్యార్థినుల ప్రతిభ

ఉత్తమ ప్రాజెక్టుగా ధావన్‌ స్పేస్‌ రోవర్‌

దేశంలో 75 ప్రాజెక్టులు ఎంపిక.. ఏపీలో మూడు..

అందులో ఒకటి కొమ్మాది బాలయోగి గురుకుల విద్యార్థులది..

కొమ్మాది, జనవరి 20 : విశాఖ నగరంలోని కొమ్మాది రిక్షా కాలనీలోని ఏపీ బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థినులు రూపొందించిన ధావన్‌ స్పేస్‌ రోవర్‌ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికయ్యింది. ఈ వివరాలను ఈనెల 14వ తేదీన ప్రకటించారు. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, ఇస్రో, సీబీఎస్‌ఈ ప్రపంచ స్పేస్‌ వారోత్సవాన్ని పురస్కరించుకుని 2021 అక్టోబరు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏటీఎల్‌ స్పేస్‌ చాలెంజ్‌ పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో 32 రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు 2,500 ప్రాజెక్టులను సమర్పించగా.. వాటిలో 75 అత్యుత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు ప్రాజెక్టులు నిలువగా.. అందులో విశాఖ జిల్లా నుంచి కొమ్మాది రిక్షాకాలనీలోని ఏపీ బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల విద్యార్థినులు తయారుచేసిన స్పేస్‌ రోవర్‌ అత్యుత్తమ ప్రాజెక్టుగా ఎంపికయ్యింది. ఇతర గ్రహాలపై జీవరాసుల మనుగడకు అనుకూల వాతావరణం, భౌగోళిక పరిస్థితుల అన్వేషణ కోసం ధావన్‌ స్పేస్‌ రోవర్‌ ఉపయోగపడుతుంది. ఇతర గ్రహాలపై ఉన్న ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలపై ఈ రోవర్‌ ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టును 9వ తరగతి చదువుతున్న జెస్సికా, అరుంధతి, 8వ తరగతి చదువుతున్న ఊర్మిళ, సైన్స్‌ ఉపాధ్యాయుడు రాంబాబు ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ స్పేస్‌ రోవర్‌ ప్రాజెక్టు నీతిఆయోగ్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ల్లో చక్కర్లు కొట్టడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎస్‌.రూపవతి ప్రిన్సిపాల్‌ ఎస్‌వీ.రమణ, తదితరులు అభినందించారు.

ఏటీఎల్‌ మిషన్‌ కృషి అభినందనీయం

టి.రాంబాబు, ల్యాబ్‌ ఇన్‌చార్జి, గురుకుల పాఠశాల, కొమ్మాది

శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను బయటకు తీయడానికి ఎంతగానో సహకరిస్తున్న ఏటీఎల్‌ మిషన్‌ కృషి అభినందనీయం. పాఠశాల విద్యార్థుల్లోని జిజ్ఞాసను పసిగట్టిన సహచర అధ్యాపక బృందం ప్రోత్సహించడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాం.  

 

Updated Date - 2022-01-21T04:58:00+05:30 IST