సొంతకాళ్లపై నిలబడలేని స్వతంత్ర దేశం!

ABN , First Publish Date - 2022-01-19T05:45:21+05:30 IST

భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన స్వాతంత్య్రోద్యమం వివిధ చారిత్రక కర్తవ్యాలను ముందుకు తెచ్చింది. నేటి ‘స్వాతంత్య్ర అమృతోత్సవాల’ సందర్భంగా వీటిలో ఇప్పటికీ పూర్తికాని కీలక కర్తవ్యాలను...

సొంతకాళ్లపై నిలబడలేని స్వతంత్ర దేశం!

భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన స్వాతంత్య్రోద్యమం వివిధ చారిత్రక కర్తవ్యాలను ముందుకు తెచ్చింది. నేటి ‘స్వాతంత్య్ర అమృతోత్సవాల’ సందర్భంగా వీటిలో ఇప్పటికీ పూర్తికాని కీలక కర్తవ్యాలను గుర్తుచేసుకుందాం. బ్రిటిష్ పాలన పోయింది కానీ, స్వదేశీ వంటి ఆదర్శాలు చరిత్ర పుస్తకాల్లోనే మిగిలాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దోపిడీ, పెత్తనాలు పోకపోగా మరింతగా పెరిగాయి. బ్రిటిష్ మాత్రమే కాక అమెరికా తదితర సామ్రాజ్యవాద పెట్టుబడుల దోపిడీ, పెత్తనాలకు లోబడిన పరాధీన ఆర్థికవ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. గత 70 ఏళ్లలో సోషలిస్టు తరహా వ్యవస్థ, సరళీకరణ విధానాలు, స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ వగైరా చాలా అన్నారు. కానీ ఆచరణలో ఎక్కువగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు, వారి దళారీలు, పాలకవర్గానికి దగ్గరైన ఆశ్రితదళారీలే అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నారు. పేదరికం, నిరుద్యోగం, అసమానతలే ప్రజలకు దక్కుతున్నాయి. 


చిన్న, దేశీయ పరిశ్రమలు లక్షలాదిగా మూతబడడం ఏనాడో మొదలై, మోదీ హయాంలో, కొవిడ్ తర్వాత ఇంకా తీవ్రమైంది. మోదీ, బీజేపీల ‘జాతీయవాదం’, ‘ఆత్మ నిర్భర్’ వగైరాలు శుష్కనినాదాలుగా, ఆచరణలో జాతీయోన్మాదంగా, యుద్ధోన్మాదంగా మిగిలాయి. అనవసరమైన ‘చైనా బాయ్‌కాట్’ పిలుపు చైనా వ్యతిరేక జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికే కానీ స్వదేశీ, స్వావలంబనల కోసం కాదని 2021లో 125.66 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత–చైనా వాణిజ్యం ఋజువు చేస్తోంది. 2020లో ఇది 87.6 బిలియన్ డాలర్లు. గత ఏడాది చైనా నుంచి దిగుమతుల విలువ 97.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 2020 స్థాయితో పోలిస్తే 46.2 శాతం ఎక్కువ. అమెరికా అనుకూల పరాధీన విధానాలు జోరుగా సాగుతున్నాయి. విదేశీ సామ్రాజ్యవాద దోపిడీ, పెత్తనాల నుంచి సమూలంగా విముక్తి పొంది, స్వతంత్ర ఆర్థికవ్యవస్థను నిర్మించుకునే జాతీయోద్యమ చారిత్రక కర్తవ్యం ఇంకా పూర్తికావలిసే ఉన్నది.


బ్రిటిషువారికి ముందు కూడా ప్రజలపై ఫ్యూడల్ దోపిడీ, పీడనలు సాగాయి. బ్రిటిష్ వారు వీటిని తీవ్రతరం చేశారు. శిస్తు వసూళ్ల కోసం వలసపాలకులు అమలు చేసిన విధానాల ఫలితంగా సాగుభూమి దున్నేవారి చేతుల్లోంచి జమీందారులు, భూస్వాముల చేతుల్లోకి పోయి కొత్తరకం భూస్వామ్య విధానం ఏర్పడింది. జాతీయోద్యమకాలంలో అనేకచోట్ల భూమికోసం భూస్వామ్య వ్యతిరేక రైతాంగ, ఆదివాసీ విప్లవ పోరాటాలు జరిగాయి. రాజులు, బ్రిటిష్ వారి పాలన పోయినా, దున్నేవారికి భూమి నేటికీ దక్కలేదు. భూస్వామ్య విధానం వివిధ రూపాలలో కొనసాగుతూనే ఉంది. భారత రాజ్యాంగ రచనా కాలంలోనే భూస్వామ్య విధానం రద్దు కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలపై ‘స్వతంత్ర’ భారత ప్రభుత్వ సైన్యాల మారణకాండ సాగింది. గ్రామీణ పేదలపై దోపిడీ, అణచివేతలు కొనసాగుతున్నాయి. భూసంస్కరణ చట్టాలు భూమికి సంబంధించిన జాతీయోద్యమ కర్తవ్యాలను పరిపూర్తి చేయకపోగా, భూస్వామ్య వ్యవస్థను కొత్తరూపాల్లో పటిష్టం చేశాయి. నేటికీ సుమారు 40–50శాతం భూమి 10శాతం కుటుంబాల చేతుల్లోనే ఉంది. వ్యవసాయంలో విదేశీ దోపిడీ కొనసాగుతోంది. హరితవిప్లవం కొత్త రూపాల్లో సంక్షోభాలను సృష్టించిందని ఈ మధ్య జరిగిన రైతుల ఆందోళన ఋజువు చేసింది.


ఇంగ్లీషువారి పాలన పోయినా, ఇంగ్లీషుభాష పాలన పోలేదు; మరింత బలపడింది. కేంద్రంలోనే అన్ని కీలక అధికారాలూ ఉన్న రాజ్యాంగం మనది, ఆ దిశలో ఇంకా కొత్త విధానాలు తోడయ్యాయి. వివిధ జాతులకు తమ అభివృద్ధికి అవసరమైన స్వయం నిర్ణయాధికారం లేదు. రాష్ట్రాలు కేంద్రం ఆధిపత్యానికి లోబడిన, కేంద్రంపై ఆధారపడిన మున్సిపాలిటీల్లాగా దిగజార్చబడుతున్నాయి. సహకార ఫెడరలిజం అంటూనే రాష్ట్రాల అధికారాలను, హక్కులను మరింత హరిస్తూ, కేంద్ర నిరంకుశాధికారాన్ని బలపరుస్తున్నారు. స్వప్రయోజనాల కోసం పాలకవర్గాలు ప్రజల జాతీయ ఐక్యతను దెబ్బతీసే కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను పెంచిపోషిస్తున్నారు. స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి కోసం సాగుతున్న ప్రజల ఉద్యమాలను అమానుషంగా అణచివేస్తున్నారు. బీజేపీ పాలనలో ఇవి మరింత తీవ్రమైనాయి. ఉపఖండ విభజన మిగిల్చిన మత విద్వేషాన్ని మరింతగా రగల్చడమే ఆ పార్టీ నేతల ప్రత్యేకత.


డబ్బు, కులమతాలే ఇంధనంగా నడిచే ఎన్నికలు, ఓట్లే ప్రజాస్వామ్యంగా చలామణీ అవుతున్నాయి. నిత్యజీవితంలో ప్రజలకు ఏ అధికారమూ లేదన్నది 70 గ్రీష్మాల అనుభవం. పునాదిలో మార్పులేకుండా, ఉపరినిర్మాణంలో పైపై మార్పులనే ప్రజాస్వామ్యమంటూ, దానిని సమర్థించుకోడానికి నిత్యం అంబేడ్కర్–జపం. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్య పునాదిలేని ఒక రూపమేనని, ‘ఆఖరి మాట’ ఏమీ కాదని, ఇది ‘వారసత్వ వర్గాల వారసత్వ పాలన’ అని అంబేద్కర్ 1943లోనే చెప్పారు. దేశంలోని నిర్దిష్ట పరిస్థితులకు, ప్రజల అవసరాలకు తగిన, ప్రజలకే సర్వాధికారాలు ఉండే, నిజమైన గణతంత్ర పాలనావ్యవస్థను నిర్మించుకునే జాతీయోద్యమ కర్తవ్యం పూర్తికావలిసే ఉంది.


చారిత్రకంగా ఏర్పడి, వేలసంవత్సరాలుగా ఉపఖండ ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వికాసానికి ఆటంకంగా ఉన్న కుల వ్యవస్థ బ్రిటిష్ వలసపాలనలో కరడుగట్టి కొనసాగింది. సబ్ కా వికాస్, కులనిర్మూలన మాటల్లోనే; ఆచరణలో కుల, మత, జాతి వివక్ష, అణచివేత!


జాతీయోద్యమ చారిత్రక కర్తవ్యాలను పూర్తిచేయడం ద్వారానే నిజమైన స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, ఐక్యత బలపడతాయి. పేదరికం, నిరుద్యోగం వగైరా మౌలిక సమస్యలు పరిష్కారమై అన్నివిధాలుగా అభివృద్ధిని సాధించుకోగలుగుతాము. మన దేశానికి ప్రపంచంలో సముచితమైన, గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము. ఈ కర్తవ్యాలను పూర్తిచేయడానికి మరో స్వాతంత్య్ర పోరాట నిర్మాణానికి నడుంకట్టాలన్నదే  స్వాతంత్య్ర అమృతోత్సవం ఇస్తున్న సందేశం!

సిహెచ్ఎస్ఎన్ మూర్తి

ప్రధాన కార్యదర్శి, ఎఫ్ఐటియు

Updated Date - 2022-01-19T05:45:21+05:30 IST