కరోనా కాలపు ‘రోమియో-జూలియట్’.. హ్యాపీ ఎండింగ్

ABN , First Publish Date - 2020-09-26T00:09:53+05:30 IST

మే చివరి వారంలో ఎట్టకేలకు ఓ పార్కులో ఇద్దరూ కలుసుకున్నారు. వాళ్ల మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి వారికి అడ్డుగా ఉన్న ముసులుగులను తొలగించుకున్నారు. కలుసుకున్న మరుక్షణం అధరాలను చుంబనంతో పెనవేసి మనసులోని భారాన్ని దింపుకుంటూనే భావాల్ని

కరోనా కాలపు ‘రోమియో-జూలియట్’.. హ్యాపీ ఎండింగ్

రోమ్: రోమియో-జూలియట్ గురించి ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అతి కొద్ది ప్రేమ కథల్లో అదీ ఒకటి. వందల ఏళ్ల క్రితం నాటి ఈ ప్రేమకథ ప్రతి హృదయాన్ని ఇప్పటికీ తడిగానే తాకుతుంటుంది. ఆ పరిమళాలు ప్రేమికులు నడిచే ప్రతి తోవలో విరజిమ్ముతూనే ఉంటాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కరోనా కారణంగా మళ్లీ ఇలాంటి ప్రేమ కథే ఇటలీలో చిగురించింది. రోమియో-జూలియట్‌లు ప్రేమా విహారాలు చేసిన వెరోనా నగరంలోనే తాజా ప్రేమికులు కూడా ఉండడం మరో విశేషం. అయితే రోమియో-జూలియట్‌లలా వీరిది విషాధ ముగింపు కాదు. వీరికి ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కూడా.


మిచెల్ డీ అప్లోస్ (38) అనే ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే పౌలా ఆగ్నెల్లీ (40) కూడా నివసిస్తోంది. వీరిద్దరూ ఆ అపార్ట్‌మెంట్‌లో చాలా ఏళ్లుగా ఉంటున్నప్పటికీ ఎప్పుడూ ఒకరినొకరు ఎదురు పడలేదు. కరోనా కారణంగా లాక్‌డౌన్ ఉండడంతో ఇంటికే పరిమితమయ్యారు. సరదాగా.. అలా బాల్కనీలో నడుస్తున్న మిచెల్‌కు ఆగ్నెల్లీ కనిపించింది. మొదటి చూపులోనే ఆగ్నెల్లీని ప్రేమిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చేశాడు. ‘‘ఆమెను చూసిన క్షణంలోనే ఆగిపోయాను. ఆమె నవ్వుకు పడిపోయాను. ఆమె గురించి తెలుసుకున్నాను’’ అని మిచెల్ చెప్పుకొచ్చాడు.


సాయంత్రం 6 గంటల సమయం.. ఆగ్నెల్లీ ఆరవ అంతస్థులో ఉన్న బాల్కనీలో నిలబడి ఉంది. ఆమె సోదరి ‘వీ ఆర్ ద ఛాంపియన్స్’ సంగీతాన్ని తన వయోలిన్‌పై వాయిస్తోంది. సంగీతం కొనసాగుతుండగా.. ఎదురుగా టెర్రస్‌పైనున్న మిచెల్ చూపులను ఆగ్నెల్లీ పసిగట్టింది. ఆమెకు కూడా మిచెల్‌పై ఇష్టం పెరిగింది. ‘‘ఆ సమయంలో ఏదో మాయ జరిగింది. మిచెల్‌ను చూడగానే ఇంత అందమైన కుర్రవాడా అనుకున్నా’’ అని ఆగ్నెల్లీ సిగ్గుపడింది.


మిచెల్ సోదరికి ఆగ్నెల్లీ తెలుసు. లాక్‌డౌన్ ప్రారంభం కాకముందు ఇద్దరూ ఒకే జిమ్‌కు వెళ్లేవారట. ఆమెనే ఆగ్నెల్లీని మిచెల్‌కి పరిచయం చేసింది. ‘‘ఆగ్నెల్లీ కోసం అన్ని సోషల్ మీడియాలు తనిఖీ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రొఫైల్ కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఖాతా లేదు. ఐదు నిమిషాల్లోనే కొత్త ఖాతా తీసుకుని ఆమెను ఫాలో కొట్టాను’’ మిచెల్ చెబుతుంటే మధ్యలో మాట కలిపిన ఆగ్నెల్లీ ‘‘మేము అర్థరాత్రుళ్లు చాటింగ్ చేసుకునే వారిమి. రాను రాను ఆ సమయం ఉదయం 3 వరకు పెరిగింది’’ అని వివరించింది.


ఇలా రోజులు, వారాలు గడిచాయి. వారు నిరంతరం ఫోన్ మాట్లాడుతూనో, కాల్ మాట్లాడుతూనో గడిపుతున్నారు, లాక్‌డౌన్ ఎత్తేసే రోజు కోసం ఎదురు చూస్తూ. ఒక్కోసారి బాల్కనీ నుంచే సరదాగా సరసం ఆడుతూ ఉండేవారు. మెల్లగా వారి బంధం బలపడింది. దూరం నుంచే వారి ఆలోచనలను పంచుకున్నారు, ఒకరినొకరు తెలుసుకున్నారు. ఆగ్నెల్లి లాయర్, మిచెల్ కంప్యూటర్ పనిచేస్తారు.


ఆగ్నెల్లీకి మిచెల్ ఫ్లవర్ బొకేలు పంపడం ప్రారంభించాడు. అయితే తన ప్రేమను వెల్లడించడానికి అది సరిపోదని, తన అపార్ట్‌మెంట్ బయట ‘‘పావోలా’’ అనే అర్థం వచ్చేలా పాత బెడ్‌షీట్‌ను వేలాడదీశాడు. ఇది సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్‌గా మారింది. ఆ సమయంలోనే ఈ జంట "రోమియో-జూలియట్"గా ప్రసిద్ది చెందింది. "మిచెల్ మంచి హృదయాన్ని కలిగి ఉంది" అని ఆమె అన్నారు.


మే చివరి వారంలో ఎట్టకేలకు ఓ పార్కులో ఇద్దరూ కలుసుకున్నారు. వాళ్ల మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి వారికి అడ్డుగా ఉన్న ముసులుగులను తొలగించుకున్నారు. కలుసుకున్న మరుక్షణం అధరాలను చుంబనంతో పెనవేసి మనసులోని భారాన్ని దింపుకుంటూనే భావాల్ని పంచుకున్నారు. మిచెల్ వేలాడదీసిన బ్యానెర్ చూసిన తర్వాత అతడిని కలుసుకోవాలని తహతహలాడినట్లు ఆగ్నెల్లీ చెప్పుకొచ్చింది.


వెంటనే కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పి.. ఇద్దరినీ కలిపి ఒకసారి మాట్లాడించారు. ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో వెంటనే ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసి అది కూడా పూర్తి చేశారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు.


వారి ప్రారంభపు రోజుల్ని గుర్తు చేస్తున్నట్లుగా ఇప్పటికీ వారు బాల్కనీలో నిలబడి ఒకరినొకరు చూస్తూ ఫోన్ మాట్లాడుతుంటారు. ఆంగ్నేల్లీని తాను మొదటగా టెర్రస్‌పై నుంచి చూశానని తమ పెళ్లి కూడా అక్కడే జరుపుకోవాలని అనుకుంటున్నట్లు మిచెల్ తన మనసులోని మాటను వెల్లడించాడు.


"మా మధ్య ఎప్పుడూ ఇబ్బందికర సంఘటనలు జరగలేదు. నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు సరికొత్త అనుభూతిలో ఉన్నాము. ఇంతకు ముందెన్నడూ చూడనిది ఇది. అంతే కాదు, గతంలో కంటే మా ప్రేమ ఇప్పుడు ఎక్కువైంది, బలీయమైంది" అని మిచెల్ అన్నాడు. "మా తాతగారి పేరు కూడా మిచెల్‌నే. ఆయనే ఈ మిచెల్‌ను పంపాడని నేను అనుకుంటున్నాను. మా తాతకు ఉన్నంత ప్రేమ, సానుభూతి, మంచి హృదయం మిచెల్‌లో కూడా ఉన్నాయి" అని ఆగ్నెల్లి సంబరపడిపోయింది.


కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తమకు మేలే చేసిందని ఈ ప్రేమ జంట చెప్పుకొచ్చింది. మార్చిలో మొదలైన వీరి ప్రేమకథ కొద్ది నెలల తర్వాత పెళ్లిగా వారిని మరింత చేరువ చేయబోతోంది. ఆకస్మికంగా ముగిసిన షేక్‌స్పియర్ ‘రోమియో-జూలియట్’ ప్రేమకథకు వీరి ప్రేమ కథకు ఎంతో సారూప్యత ఉన్నప్పటికీ ముగింపు చాలా విరుద్ధం.

Updated Date - 2020-09-26T00:09:53+05:30 IST