అచంచల విశ్వాసి!

ABN , First Publish Date - 2021-06-25T05:30:00+05:30 IST

దైవ ప్రవక్త మహమ్మద్‌ అమరులయ్యారనే వదంతి మదీనాలో దావానలంలా వ్యాపించింది. అనేకమంది తీవ్ర

అచంచల విశ్వాసి!

దైవ ప్రవక్త మహమ్మద్‌ అమరులయ్యారనే వదంతి మదీనాలో దావానలంలా వ్యాపించింది. అనేకమంది తీవ్ర ఆందోళన చెందుతూ, కనిపించిన ప్రతి వారినీ ‘ఈ వార్త నిజమేనా?’ అని అడుగుతూ తిరుగుతున్నారు. ఇది విన్న ఒక మహిళ హడావిడిగా యుద్ధభూమికి బయలుదేరింది. 


‘ఇవేవో దుష్ట శక్తులు లేవదీసిన పుకార్లు. గిట్టనివారు వ్యాప్తి చేసిన కట్టుకథలు. కానీ... ఒకవేళ ఇది నిజమే అయితే...? వద్దు... వద్దు. దైవం ఆయనను కాపాడుగాక!’- ఇలా పరిపరివిధాల ఆమె ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. దారిలో ముళ్ళనూ, రాళ్ళనూ కూడా గమనించే స్థితిలో లేదు. 


యుద్ధంలో ఆమె తండ్రి, భర్త, సోదరుడు తదితర రక్తబంధువులు కూడా పాల్గొన్నారు. కానీ వారి గురించి ఆమె ఆలోచించడం లేదు. ఆమె హృదయంలో ముద్రవేసుకున్నది మానవజాతికి మహోపకారి అయిన మహమ్మద్‌ చిత్రం మాత్రమే. ‘ఆ మహనీయుడు క్షేమంగా ఉంటే చాలు. నాకిక ఎలాంటి దిగులూ ఉండదు...’-  ఆ ఆకాంక్షతోనే ఆమె అలుపెరగకుండా, వేగంగా నడుస్తూ, యుద్ధభూమివైపు సాగిపోతోంది. అప్పుడే రణరంగం నుంచి యోధులు జట్లు జట్లుగా తిరిగొస్తున్నారు.


కొందరు ఆమెను చూడగానే ‘‘అమ్మా! చెప్పడానికి మాకు నోరు రావడం లేదు. యుద్ధంలో మీ నాన్నగారు చనిపోయారమ్మా!’’ అన్నారు. 


అల్లారుముద్దుగా పెంచిన తండ్రి. బతుకంతా కష్టపడి తమను పోషించిన తండ్రి. ప్రేమామృతం కురిపించిన తండ్రి. అటువంటి తండ్రి మరణిస్తే ఆమె హృదయం ఎంత తల్లడిల్లిపోవాలి? కానీ ఆమె కించిత్తయినా చలించలేదు. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వనట్టు కనిపించింది. 


‘‘ముందు ఈ సంగతి చెప్పండి. మన ప్రియ ప్రవక్త క్షేమంగా ఉన్నారా?’’ అని అడిగింది.


‘‘ఆయన క్షేమమే. కాకపోతే కాస్త గాయపడ్డారు’’ అన్నారు యోధులు. కానీ వారి మాటలపై ఆమెకు పూర్తిగా నమ్మకం కుదరలేదు. ‘నా కళ్ళతో ఆ కారుణ్యమూర్తిని చూసుకుంటే కాని మనసు కుదుటపడదు’ అనుకుంది.


అంతలో మరి కొందరు యోధులు ఎదురుపడ్డారు. ‘‘నీ సోదరుడు చనిపోయాడు’’ అని చెప్పారు. దానికి కూడా ఆమె చలించలేదు. ఇంకా ముందుకు సాగిపోతోంది. 


మరికొంత దూరం వెళ్ళగానే మరో విషాద వార్త... ‘‘నీ భర్త యుద్ధంలో మరణించాడమ్మా...’’ అని.




‘అనురాగమూర్తి అయిన తన భర్త మరణించాడా? తనకు శాశ్వతంగా దూరమయ్యాడా? అది భరించలేని ఎడబాటు. తండ్రి మరణాన్నీ, సోదరుడి మరణాన్నీ తట్టుకోవచ్చు. కానీ కట్టుకున్నవాడు మరణించాక ఇక తనకు నీడనిచ్చేవారెవరు? తన వాళ్ళనుకున్న ముగ్గురు ఒకేసారి మరణిస్తే తన గతేమిటి?’


ఆ విషాదంలో ఆమె హృదయం ఎన్ని ముక్కలవ్వాలి? కానీ ఆ ధీరవనిత లేశమైనా చలించలేదు. ఆమెలో ఏదైనా ఆందోళన ఉందంటే అది దైవ ప్రవక్త క్షేమం విషయంలోనే!


ఆత్రుతగా యుద్ధరంగానికి చేరుకుంది. ఆమె కళ్ళు దైవ ప్రవక్త కోసం గాలిస్తున్నాయి. ఇదంతా గమనించిన ఒక యోధుడు ‘‘అదిగో! దైవప్రవక్త వస్తున్నారు’’ అన్నాడు.


అంతే... అతను చూపిన వైపు ఆమె సుడిగాలిలా పరుగెత్తింది. అనుచరుల మధ్య పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్న తమ ప్రియతమ నాయకుణ్ణి చూడగానే ఆమె అమిత సంతోషంతో పరవశించిపోయింది.


‘‘‘దైవ ప్రవక్తా! మీరు క్షేమంగా ఉన్నారు. అదే నాకు చాలు. ఇక నాపై విరుచుకుపడిన ఎలాంటి ఆపదనైనా తేలికగా భరించగలుగుతాను’’ అంది, కళ్ళ నుంచి ఆనందబాష్పాలు రాలుస్తూ.


ఇలాంటి అచంచలమైన విశ్వాసాన్ని గురించి దైవ ప్రవక్త ప్రస్తావిస్తూ ‘‘మీ తండ్రి, మీ కుమారులు, మీ సన్నిహితులకన్నా మీకు నేను ఎక్కువ ప్రియమైనవాణ్ణి కానంత వరకూ... మీలో ఏ ఒక్కరూ నిజమైన విశ్వాసి కాలేరు’’ అన్నారు.



 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST