2021 నవ ఆవిష్కరణల సంవత్సరం

ABN , First Publish Date - 2021-01-05T06:42:40+05:30 IST

కొవిడ్‌-19 సంక్షోభం నుంచి మహీంద్రా గ్రూప్‌ మరింత బలోపేతమైందని, ఈ నూతన సంవత్సరం నవ ఆవిష్కరణలు, పునరుత్తేజ సంవత్సరమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా

2021  నవ ఆవిష్కరణల సంవత్సరం

ఆనంద్‌ మహీంద్రా 


న్యూఢిల్లీ: కొవిడ్‌-19 సంక్షోభం నుంచి మహీంద్రా గ్రూప్‌ మరింత బలోపేతమైందని, ఈ నూతన సంవత్సరం నవ ఆవిష్కరణలు, పునరుత్తేజ సంవత్సరమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. తమ గ్రూప్‌నకు చెందిన 2.56 లక్షల ఉద్యోగులనుద్దేశించి నూతన సంవత్సర సందేశం ఇస్తూ అసాధారణమైన  ఒక చెడు స్థితి నుంచి అనూహ్యమైన నవ ఆవిష్కరణలు ఉద్భవించడం ఆనందించదగిన అంశమని కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి, అనుమతుల విషయంపై ఆయన వ్యాఖ్యానించారు. సాధారణ పరిస్థితుల్లో 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టే వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రక్రియను పరిశోధకులు, నియంత్రణ సంస్థలు ఊహించని వేగంతో 10 నెలల్లోనే సుసాధ్యమయ్యేలా చేశారన్నారు. ఈ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకుని ఒక లక్ష్యానికి గురి పెట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం, పునరుత్తేజితం కావడం వంటి లక్షణాలు అలవరచుకోవాలని మహీంద్రా గ్రూప్‌ ఉద్యోగులకు సూచించారు.


వ్యాక్సిన్ల అభివృద్ధి లక్ష్య ఆధారిత వ్యాపారాలకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన అన్నారు. కొత్తగా ఎదురైన కొవిడ్‌-19ని దీటుగా ఎదుర్కోవాలన్న సంకల్పంతో వైద్యశాస్త్ర విభాగం సాంప్రదాయిక పద్ధతులన్నింటికీ స్వస్తి చెప్పి ప్రాసెస్‌ విధానాల పునర్నిర్మాణం, అత్యాధునిక టెక్నాలజీల వినియోగం, పరిశోధనలకు అనవసర ఆటంకాలను దాటుకుంటూ సాగడం ద్వారా ఈ విజయం సాధించిందని, మూడు సమర్థవంతమైన వ్యాక్సిన్లను మనకు అందుబాటులోకి తెచ్చిందని మహీంద్రా తెలిపారు. మహీంద్రా గ్రూప్‌ సైతం అదే తరహా విధానాలు అనుసరించి బలోపేతం అయిందని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-01-05T06:42:40+05:30 IST