లారీనా... రాకెట్టా..?

ABN , First Publish Date - 2021-08-15T06:14:07+05:30 IST

సినిమా రేంజ్‌ వ్యవహారమిది...

లారీనా... రాకెట్టా..?
మారూరు టోల్‌గేట్ వద్ద సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయిన లారీ

అక్రమంగా పేదల బియ్యం తరలిస్తూ అడ్డంగా దొరికారు..

తప్పించుకునేందుకు డ్రామాలు

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అక్రమార్కులకు వంతపాడుతున్న అధికారులు

సినిమా సీన తలపిస్తున్న వైనం


అనంతపురం(ఆంధ్రజ్యోతి): సినిమా రేంజ్‌ వ్యవహారమిది. చిలమత్తూరు పోలీసులు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తనిఖీల్లో భాగంగా.. బియ్యం లోడుతో కర్ణాటకకు వెళ్తున్న లారీని పట్టుకున్నారు. పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో గద్దించడంతో డ్రైవర్‌ అసలు విషయం కక్కేశాడు. పేదల బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఆ లారీని స్టేషనకు తరలించారు. ఆ నోటా.. ఈ నోటా సమాచారం మీడియాకు పొక్కడంతో పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టుబడినట్లు వార్తలొచ్చాయి. సంబంధిత పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతవరకూ బాగుంది.. అక్కడి నుంచి వాస్తవాలు ఆరాతీస్తే... అసలు విషయం బయటపడింది.


పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయినా ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దార్లు వెతికారు. అధికార పార్టీ నేతలూ రంగంలోకి దిగారు. వారి ఒత్తిళ్ల నేపథ్యంలో.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులను పావులుగా వాడుకున్నారు. ఆ అధికారులు అక్రమార్కులకు వంతపాడేలా వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యారు. పేదల నోటికాడి ముద్దను లాగేసుకుని, అక్రమార్జనకు తెరతీస్తున్న అక్రమార్కుల అడ్డదారుల బాగోతానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమనడంలో సందేహం లేదు. పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందినట్లు సమాచారం.


ఒకే లారీ... ఒకే సమయం... మూడు ప్రాంతాలు...

జిల్లా పౌరసరఫరాల సంస్థ స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌ ద్వారా అనంతపురం నగర శివారులోని జంగాలపల్లి గోడౌన్ నుంచి జిల్లాలోని వివిధ స్టాక్‌ పాయింట్లకు పీడీఎస్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగానే.. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏపీ02టిబి0036 నెంబరు లారీ 22 టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ జంగాలపల్లి గోడౌనలో లోడు చేసుకోవడంతోపాటు తాడిపత్రి స్టాక్‌ పాయింట్‌కు వెళ్లేందుకు స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌, గుమస్తా నుంచి ట్రక్‌ షీట్‌ రాయించుకున్నారు. ఆ లారీ తాడిపత్రి స్టాక్‌ పాయింట్‌కు వెళ్లకుండా నేరుగా ఎనహెచ-44 రహదారి బట్టింది. మరూరు టోల్‌గేల్‌ మీదుగా బెంగళూరుకు బయలుదేరింది. రాత్రి 8 గంటల సమయంలో చిలమత్తూరు పోలీసులు లారీని పట్టుకున్నారు.


ఎఫ్‌సీఐ జంగాలపల్లి అధికారులు రాసిన ట్రక్‌ షీట్‌ (నెం: 51013)ను పరిశీలిస్తే... సాయంత్రం 6.07 గంటలకు జంగాలపల్లి గోదాము నుంచి లారీ బయలుదేరినట్లు స్పష్టంగా రికార్డులు చెబుతున్నాయి. అదే లారీ తాడిపత్రి స్టాక్‌ పాయింట్‌కు వెళ్లకుండా మరూరు టోల్‌గేట్‌ మీదుగా సాయంత్రం 6.32 గంటలకు వెళ్లినట్లు అక్కడి సీసీ ఫుటేజీల్లో రికార్డు అయింది. జంగాలపల్లి గోదాము అధికారులు మాత్రం మరో వాదన వినిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంబంధిత గోదాము అధికారులు ఏపీ02టీబీ0036 లారీ సాయంత్రం 7 గంటల సమయంలో తాడిపత్రి స్టాక్‌ పాయింట్‌లో బియ్యం అనలోడ్‌ చేసినట్లు చెబుతున్నారు. వీరి వాదనలిలా ఉండగా... కర్నూలు నుంచి అదేరోజు సాయంత్రం అదే నెంబరు లారీ బియ్యం లోడుతో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా బంగారుపేటకు బయలుదేరినట్లు అందుకు సంబంధించిన వే బిల్లులు అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఓ ట్రేడర్స్‌లో తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి.


ఒకే నెంబరు లారీ ఒకే సమయం... మూడు ప్రాంతాలను చుట్టేసిందంటే... అది లారీనా... లేక రాకెట్టా అని ఎవరికైనా సందేహం కలగకమానదు. పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికినా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే జిల్లాలో పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. చిలమత్తూరు పోలీసులు పట్టుకున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా..? కట్టుకథతోనే ముగింపు పలుకుతారా...? అనేది వేచి చూడాల్సిందే.


అధికార పార్టీ నేతల అండతోనే..

పేదల బియ్యం అక్రమ రవాణా వెనుక కొందరు అధికార పార్టీ నేతల అండదండలున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. అయినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. అధి కారంలో ఉన్నామనీ, ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారనీ, ఇక అడ్డెవరనే ధోరణిలో అక్రమార్కులున్నారనడంలో సందేహం లేదు. చిలమత్తూరు పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటనలోనూ సంబంధిత కాంట్రాక్టర్‌కు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ నేపథ్యంలోనే... ఆ కాంట్రాక్టర్‌కు అధికారులు సైతం వంతపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


సంబంధిత పర్యవేక్షణ అధికారులపైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాసుల్లో వాటాల నేపథ్యంలోనే... అక్రమార్కులకు వంత పాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారుతోందనడంలో సందేహం లేదు. జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతోందోనని ఉన్నతాధికారులు ఆలోచన చేయకపోవడంతో పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమార్కులు జేబులు నింపుకునేందుకు కారణమవుతోందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




Updated Date - 2021-08-15T06:14:07+05:30 IST