Abn logo
Oct 18 2020 @ 14:42PM

పోలీసు అధికారుల స్వామిభక్తి

Kaakateeya

- కేసుల నమోదులో మీనమేషాలు

- బాధితుల గోడు పట్టించుకోని వైనం

- సామాన్య ప్రజలకే కాదు.. పోలీసులకూ చేదు అనుభవం..

- సివిల్‌ పంచాయితీలకే ప్రాధాన్యత

- అధికార పార్టీ సిఫార్సులకే పెద్దపీట

- కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లో

- ముగ్గురు అధికారులపై తీవ్ర ఆరోపణలు


అనంతపురం(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నాయకుల అండతో పోస్టింగ్‌ తెచ్చుకో వటం, వారికి అనుకూలంగా పని చేయటంపై పోలీస్‌ శాఖలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కోసం వచ్చే బాధితులను పట్టించుకోకుండా సివిల్‌ పంచాయితీల్లో మునిగి తేలుతున్నారని కొంతమంది పోలీస్‌ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న ఓ ముగ్గురు అధికారుల తీరు ఇందుకు అద్దం పడుతోంది. న్యాయం చేయటంలో చొరవ చూపాల్సిన ఆ అధికారులు కేసులు నమోదు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం పోలీసు సబ్‌ డివిజన్‌లో మహిళా ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పనిచేసే అధికారులే ఈ ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. వారిలో ఆ సబ్‌ డివిజన్‌లో పనిచేసే ఓ ఉన్న తాధికారితోపాటు ఆయన తరువాతి స్థాయి అధికారులున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సెబ్‌లో పనిచేసే ఓ ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు మద్యం వ్యవహారంలో తలదూర్చి, కటకటాలపాలైన విషయం తెలిసిందే. అయినా ఆ ప్రాంతంలో పనిచేసే ఆ ముగ్గురు అధికారుల్లో ఏ మాత్రం మార్పు కనిపించటం లేదన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది. ఆ అధికారులు మాత్రం ప్రొటోకాల్‌ పేరుతో స్టేషన్లకు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లటంతోనే సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


కేసుల నమోదులో మీనమేషాలు

కళ్యాణదుర్గం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేయటంలో కొందరు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులు నమోదు చేస్తే రికవరీ చూపాల్సి వస్తుందన్న కారణంతోనే ఇలా చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పెండింగ్‌ కేసులు అధికమైతే ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలోనే కేసుల నమోదుకు ఆ ప్రాంత అధికారుల్లో కొందరు వెనకాడుతున్నట్టు సమాచారం. ఆ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు సమయం లేనంత బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్‌ పంచాయితీలపై ప్రధానంగా దృష్టి సారించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి సిఫార్సులతో అయితే పోస్టింగ్‌ తెచ్చుకున్నారో.. వారి సేవలోనే మునిగి తేలుతున్నారన్న ప్రచారం ఆ ప్రాంతంలో జోరుగా సాగు తోంది.


అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ..

అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ డబ్బు సంపాదనే ధ్యేయంగా సివిల్‌ పంచాయితీలకే అధిక ప్రాధాన్యమిస్తుండటంతో ఆ అధికారులపై బాధితుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం గంట కూడా బాధితుల కోసం సమయాన్ని వెచ్చించట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు అధికారులు ఒకరిద్దరు కానిస్టేబుళ్లను నమ్మిన బంట్లుగా నియమించుకుని, వారి ద్వారా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని లేఔట్‌ల నిర్వహణలో తలెత్తిన భూవివాదాలు, అధికార పార్టీ నాయకులు తీసుకొస్తున్న వివాదాస్పద అంశాలకు ప్రాధాన్యమిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిద్ది, ఇందిరమ్మ కాలనీ, రామస్వామి కాలనీ లేఅవుట్ల వ్యవహారంలో పరిణామాలు వారి తీరుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల ఓ జాతీయ పార్టీకి చెందిన కార్యకర్త బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేయకుండా వేలాది రూపాయల ముడుపులు పుచ్చుకుని, వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. స్టేషన్‌లో ఉన్నప్పటికీ లేరని చెప్పండంటూ సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారంటే ఆ అధికారుల శైలి ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రతిపక్షాలకు చెందినవారిపై ఫిర్యాదు చేస్తే ఆ అధికారి వెనకాముందు చూడకుండా కేసుల నమోదుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


కొన్ని ఘటనలు పరిశీలిస్తే..

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో పదుల సంఖ్యలో ద్విచక్రవాహన, నగదు చోరీలు, ఇళ్లలో దొంగతనాలకు దుండగులు పాల్పడ్డారు. బాధితులు ఆయా ప్రాంతాల్లోని పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసు నమోదుకు పోలీసులు పెద్దగా చొరవ చూపట్లేదన్న ఆవేదన బాధిత వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి.


కళ్యాణదుర్గంలోని ముదిగల్లు రోడ్డులో ఓ ఎలక్ర్టీషియన్‌ కారును అపహరించారు. హిందూపురం రోడ్డులో నివాసముంటున్న ఓ ఉపాధ్యాయుడి ద్విచక్ర వాహనం, బళ్లారి మిట్టపై ఓ సెలూన్‌ షాపు నిర్వాహకుడు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ వస్త్ర వ్యాపారి, జయనగర్‌కు చెందిన మరో వ్యాపారి, వడ్డే కాలనీలో నివాసముంటున్న కొందరు భవన నిర్మాణ కార్మికుల ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ వాటిపై కేసులే నమోదు చేయలేదు.


గాంధీ చౌక్‌లో ఫొటో స్టూడియో నిర్వాహకుడు, ఓ ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌ బంధువు ఒకరు, రాజీవ్‌ బస్‌షెల్టర్‌ సమీపంలో నివాసముంటున్న ఓ వ్యాపారి బులెట్‌ వాహనాలు చోరీ అయ్యాయి. రెవెన్యూకాలనీలో నివాసముంటున్న ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ద్విచక్రవాహనాలను తస్కరించారు. ఈ ఘటనల్లోనూ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఎస్సీ కాలనీ, విద్యానగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. చోరీ అయిన ద్విచక్రవాహనాల రికార్డులను పోలీసులకు చూపించినా కేసు నమోదు చేసేందుకు ససేమిరా అంటున్నారంటే బాధిత వర్గాల ఆవేదన ఏపాటిదో అర్థమవుతోంది. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ద్విచక్రవాహనం చోరీ అయినప్పటికీ స్థానికంగా కేసు నమోదు కాలేదు. ఓ దొంగ అనంతపురంలో పట్టుబడిన సందర్భంలో ఆ కానిస్టేబుల్‌ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు కాకపోవటంతో ద్విచక్ర వాహనం అప్పగించేందుకు సంబంధిత పోలీసులు ససేమిరా అంటుండటంతో బాధిత కానిస్టేబుల్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానిస్టేబుల్‌ పరిస్థితే అలా ఉంటే.. సామాన్యుల అవస్థలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఏటీఎంలో ప్రజలను బురిడీ కొట్టించి, నగదుతో పరారైన దుండగులపై కేసు నమోదు చేయాలని బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడేలేడు. దీంతో బాధితులకు వేదనే మిగిలింది.


Advertisement
Advertisement
Advertisement