రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2021-08-17T17:37:23+05:30 IST

దళిత కుటుంబానికి..

రాష్ట్రంలో అరాచక పాలన

నారా లోకేశ్‌ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఆందోళన


భీమునిపట్నం: దళిత కుటుంబానికి జరిగిన అన్యాయంపై పరామర్శించడానికి గుంటూరు వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు అన్నారు. లోకేశ్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం భీమిలిలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గంటస్తంభం కూడలిలో రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రతిపక్షమైన టీడీపీని అణచివేయడంపై వైసీపీ చూపెడుతున్న శ్రద్ధ శాంతిభద్రతలను కాపాడడంలో చూపించి ఉంటే రాష్ట్రంలో దారుణాలు చోటుచేసుకునేవి కావని దుయ్యబట్టారు.


సీఎం క్యాంప్‌ కార్యాలయానికి, డీఐజీ ఆఫీసుకు సమీపంలోనే ప్రేమోన్మాది చేతిలో దళిత విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అర్థమవుతోందన్నారు. దళిత విద్యార్థిని దారుణ హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ హోమ్‌ మినిస్టర్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలవుతుందా లేక రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందో అనుమానం కలుగుతుందని విమర్శించారు. తొలుత బీచ్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌, మెయిన్‌రోడ్‌ మీదుగా గంటస్తంభం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 


ఈ సందర్భంగా లోకేశ్‌ను  విడుదల చేయాలి, సీఎం డౌన్‌ డౌన్‌, హోమ్‌ మినిస్టర్‌ రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్నికుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, పీవీ నరసింహారావు, పార్టీ నాయకులు డీఏఎన్‌ రాజు, తమ్మిన సూరిబాబు, గరికిన కింగ్‌, పాసి త్రినాథకుమార్‌, శీరపు రమణ, పెంటపల్లి యోగేశ్వరరావు, మారోజు సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-17T17:37:23+05:30 IST