అనారోగ్యశ్రీ

ABN , First Publish Date - 2021-10-25T05:18:51+05:30 IST

ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలకు సరైన వైద్యం అందని దుస్థితి నెలకొంది. దీంతోపేదలు పడరానిపాట్లు పడుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 63 ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌ కార్డులకు కూడా వైద్యం అందిస్తున్నారు. ఆయా వైద్యశాలకు ఏడాదికి రూ.110 నుంచి రూ. 120 కోట్ల మేర ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఆ ప్రకారం నెలకు సరాసరిన రూ. 10నుంచి రూ.12 కోట్ల వెచ్చిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు అనేక నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ఆనాసక్తి చూపుతున్నారు.

అనారోగ్యశ్రీ

 




నామమాత్రంగా ఆరోగ్యశ్రీ సేవలు

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు

భారీగా బిల్లులు పెండింగ్‌

ప్రభుత్వం నిర్ణయించి రేట్లపైనా

నిర్వాహకుల్లో అసంతృప్తి

అత్యధిక మంది చేతులెత్తేస్తున్న వైనం 

కొన్నిచోట్ల పరిమిత వ్యాధులకే వైద్యం

డెంగ్యూ చికిత్సకు ససేమిరా

పట్టించుకోని ప్రభుత్వం 

పేదలకు ప్రాణసంకటం

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 24 : 

పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం చెప్తోంది. ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులను చేర్చినట్లు బాకా ఊదుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలిస్తే అవన్నీ కల్లబొల్లి మాటలేనని అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వెళ్తున్న పేదలు బిక్కమొఖంతో వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక బకాయిలు పేరుకుపోవడంతో అనేక వైద్యశాలల నిర్వాహకులు సేవలు అందించేందుకు ససేమిరా అంటున్నారు. వైద్య సేవలకు నిర్ణయించిన ధరలపై అసంతృప్తితో మరికొందరు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయకుండా తిరస్కరిస్తున్నారు. కొందరు కొన్ని రకాల సేవలకే పరిమితమవుతున్నారు. దీంతో పేదలతోపాటు, ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్‌కార్డులు అక్కరకు రాకపోవంతో ఆవేదన చెందుతున్నారు. అనేక మంది అప్పులు తెచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఆ పరిస్థితి లేని వారు ప్రాణాలు కోల్పోతున్నారు. 


ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలకు సరైన వైద్యం అందని దుస్థితి నెలకొంది. దీంతోపేదలు పడరానిపాట్లు పడుతున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 63 ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌ కార్డులకు కూడా వైద్యం అందిస్తున్నారు. ఆయా వైద్యశాలకు ఏడాదికి రూ.110 నుంచి రూ. 120 కోట్ల మేర ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ఆ ప్రకారం నెలకు సరాసరిన రూ. 10నుంచి రూ.12 కోట్ల వెచ్చిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు అందించేందుకు అనేక నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ఆనాసక్తి చూపుతున్నారు. 

బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి

ఆరోగ్యశ్రీకి అందలం వేశామని చెప్తున్న ప్రభుత్వం నిధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.  ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డుల ద్వారా వైద్య సేవలు అందించిన నెట్‌ వైద్యశాలలకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. వాస్తవానికి వైద్యసేవలు అందించిన తర్వాత ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు బిల్లులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ద్వారా సీఎఫ్‌ఎంఎస్‌కు పంపుతారు. గతంలో కొద్ది రోజుల్లోనే బిల్లులు విడుదల చేసే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. బిల్లుల చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయన్నది కూడా తెలియడం లేదు. దీంతో పేద ప్రజలకు ఆరోగ్యశ్రీపై వైద్య సేవలు అందించేందుకు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మేర వైద్య సేవలు అందించారు, ఎంత బిల్లులు చెల్లించారు, ఎంత పెండింగ్‌ ఉంది అన్నది తెలిసేది. కానీ ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌ విఽధానం అమల్లోకి తెచ్చిన తర్వాత ఆ వివరాలు ఏమీ బహిర్గతం కావడం లేదు. 

డెంగ్యూ చికిత్సకు నో

జిల్లాలో ఇటీవల డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే పలువురు మృత్యువాతపడ్డారు. అనేక మంది వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం డెంగ్యూకు రెండు ప్యాకేజీలను ప్రకటించింది. అందులో మొదటిది రూ 10వేలు, రెండో ప్యాకేజీ రూ. 35వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం డెంగ్యూ బాధితుల్లో ఎక్కువ మందికి ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. అలాంటి వారు కనీసం ఐదారు రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో వెంటిలేటర్‌ అవసరం కూడా ఏర్పడుతోంది. ఆ పరిస్థితి ఎదురైతే రోజుకు రూ.10 నుంచి రూ.15వేల వరకూ ఖర్ఛవుతుంది. ఆ ప్రకారం ఐదు రోజులకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ సరిపోకపోవడంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ చికిత్సకు ససేమిరా అంటున్నారు. వీటితోపాటు మరికొన్ని సేవలకు కూడా స్వస్తి పలుకుతున్నారు. 

అల్లాడుతున్న పేదలు

ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో పేదలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన వైద్యం అవసరమైన వారు అప్పులు తెచ్చి చేయించుకుంటున్నారు. ఆ పరిస్థితి లేని కొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ దడపుట్టిస్తుండగా చికిత్స కూడా ఖర్చుతో కూడుకుంటోంది. కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా ఈ మహమ్మారిబారిన పడుతున్నారు. అలాంటి కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ వైద్యశాలలు సేవలు అందించేందుకు విముఖత చూపుతుండటంతో రూ.2 నుంచి రూ.3లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఇది భారంగా మారింది.

ప్రభుత్వ ఉద్యోగులదీ అదే పరిస్థితి

ప్రభుత్వ ఉద్యోగుల నెల వేతనంలో వైద్య సేవల కోసం మినహాయించుకుంటారు. వారి వేతనాన్ని బట్టి నెలకు రూ.120 నుంచి రూ.500 వరకూ కోత విధిస్తున్నారు. అయితే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వారికి కూడా వైద్యం అందని దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. 

నిబంధనల ప్రకారం వైద్యం అందించాల్సిందే

డాక్టర్‌ వి.శ్రావణ్‌కుమార్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో తప్పని సరిగా రోగికి వైద్య సేవలు అందించాల్సిందే. వైద్యశాలల్లోనే ఆరోగ్యమిత్రలతోపాటు, హెల్ప్‌ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఆరోగ్యశ్రీ కార్డుతో వైద్యశాలకు వెళ్లిన వారికి చికిత్స చేసేందుకు నిరాకరిస్తే అక్కడే ఫిర్యాదు చేయవచ్చు. ఆ వెంటనే వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ఆసుపత్రులకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. 


Updated Date - 2021-10-25T05:18:51+05:30 IST