Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 25 2021 @ 02:10AM

ఆసిఫాబాద్‌ అడవుల్లో ఆదిమకాలపు గుహ

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ అడవుల్లో ఆదిమకాలపు సున్నపురాతి గుహను అటవీశాఖ అధికారుల సాయంతో పబ్లిక్‌ రీసెర్చ్‌ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ ,ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ (ప్రిహా)  ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్‌ బృందం కనుగొన్నది. గుహలో ప్రవేశించి భూగర్బ శాస్త్రవేత్తల సాయంతో అధ్యయనం చేసింది. దీనిని స్థానికంగా అర్జున లొద్ది గుహగా వ్యవహరిస్తున్నారు.  ఆసిఫాబాద్‌ జిల్లా తార్యాణి మండలం మేశ్రామ్‌గూడ గ్రామపంచాయితీ పరిధిలో అటవీ ప్రాంతంలో విస్తరించిన ఈ సున్నపురాతి గుహ ప్రకృతి తొలిచిన అందమైన గుహగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా స్థానిక గోండు, పరదాన్‌ గిరిజనులు అర్జున్‌ పేణ్‌ అంటే అర్జున్‌ దేవుడుగా కొలిచే శిల ఈ గుహలో ఉంది. దీంతో ఈ ప్రాంతం అర్జునలొద్దిగా ప్రసిద్దమైంది. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ పరిధి గిన్నెధారి రేంజ్‌లో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తోడిశెట్టి ప్రణయ్‌ చొరవతో జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం ప్రోత్పాహంతో గుహ వెలుగులోకి వచ్చింది. దట్టమైన అటవీ ప్రాంతంలో కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని ఈ గుహ అక్కడక్కడా ఇరుకుగా ఉండడం వల్ల పాకుతూ లోపలకు వెళ్లవలసి ఉంది. సుమారు 30 మీటర్ల వరకు వెళ్లడానికి అనువుగా ఉంది. ఇంకా పొడవుగా ఉన్నప్పటికీ అవసరమైన వెలుతురు, గాలి లేక పోవడంతో వెళ్లలేకపోతున్నారు. సుమారు 1.25 లక్షల ఏళ్ల నుంచి 11వేల ఏళ్ల మధ్య జరిగిన మార్పుల వల్ల ఈ గుహ ఏర్పడి ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నియో ప్రొటెరోజోయిక్‌ కాలం అంటే సుమారు 54 కోట్ల ఏళ్ల క్రితం భూమిలోని సున్నపు రాయిని భూగర్బజలం తొలచడంతో గుహగా ఏర్పడడం మొదలై ఉండవచ్చని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటి డైరెక్టర్‌ చకిలం వేణుగోపాల్‌రావు అన్నారు. కర్నూల్‌ గుహలపై జరిగిన శాస్ర్తీయ పరిశోధన గీటురాయిగా అర్జున లొద్ది గుహ ఏర్పడినకాలాన్ని అంచనావేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ గుహ ప్రాంతంలో పాతరాతి యుగపు మానవ సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు, రాతి పనిముట్ల రూపంలో  లభ్యమైనట్టు ప్రిహా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్‌ తెలిపారు.

Advertisement
Advertisement