Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీమ్స్‌, జిఫ్ఫీల రూపంలో... అలనాటి కళాఖండాలు

లాక్‌డౌన్‌తో గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కూడా ఎక్కువ కాలం ఇళ్లకే పరిమితమైపోయాం. ఈ సమయాన్ని ఉదాసీనంగా గడిపే బదులు దేశ వ్యాప్త మ్యూజియంలు, వాటిలోని కళాఖండాలను వీక్షిస్తూ ఉల్లాసంగా కాలక్షేపం చేసే వీలు కల్పించింది 34 ఏళ్ల మేధావి గాంధీ. హెరిటేజ్‌ ల్యాబ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా పురాతన పెయింటింగ్స్‌కు ఆధునిక సాంకేతికతను జోడించి జిఫ్ఫీలు, మీమ్స్‌లను సృష్టిస్తూ కళాత్మకతను కొత్త రూపాల్లో ఆవిష్కరిస్తోంది! 


ముగ్గురు మహిళలు తల, మెడ, చేతులకు బంగారు ఆభరణాలు ధరించి, సూటిగా వీక్షకుల కళ్లలోకి చూస్తూ నిలబడి ఉంటారు. థామస్‌ హిక్కీ చిత్రించిన ‘త్రీ ప్రిన్సెస్‌ ఫ్రం మైసూర్‌’ పెయింటింగ్‌ ఇది. ఆటలమ్మ వ్యాధితో భర్తను పోగొట్టుకున్న రాణి లక్ష్మీ అమ్మణి, ఆ వ్యాధికి అడ్డుకట్ట వేసే వ్యాక్సినేషన్‌ ప్రచారం కోసం అలా ఆ ముగ్గురు వడియార్‌ రాణులను ఒప్పించి గీయించిన నిలువెత్తు పెయింటింగ్‌ అది. పెయింటింగ్‌లో కుడివైపు చివరన కనిపించే యువరాణి, తన ఎడమ చేయి కనిపించేలా నిలబడి ఉంటుంది. ఆ చేతికే 1806లో ఆమె ఆటలమ్మ వ్యాక్సిన్‌ వేయించుకుంది. భారతీయ రాచరిక చరిత్రలో ఎంతో తక్కువ మంది ఎరిగిన ఎంతో ముఖ్యమైన ఘట్టం అది. తన వెబ్‌సైట్‌లో గాంధీ సేకరించి, ప్రదర్శిస్తున్న అరుదైన చిత్తరువుల్లో ఇదొకటి. గత ఏడాది కొవిడ్‌ పాండమిక్‌ సమయంలో, వ్యాక్సినేషన్‌ ప్రాముఖ్యతను తెలిపే ఈ పెయింటింగ్‌ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం విశేషం. 


ది హెరిటేజ్‌ ల్యాబ్‌!

గాంధీ, 22 ఏళ్ల వయసులో కాలేజీ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన తర్వాత, యునెస్కోకు భారతీయ సంప్రదాయ కళాకారుల దుర్భర జీవితాల గురించిన డాక్యుమెంటరీ తయారీకి పూనుకుంది. ఆ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోతున్న జానపద, సంప్రదాయ కళలకు కొత్త ఊపిరి పోసి, ఆ కళాఖండాలకు గుర్తింపు తీసుకురావాలని కూడా సంకల్పించింది. అలా 2009లో ఢిల్లీకి చెందిన హ్యాపీ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ సుమారు 12 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళాకారుల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్త వీక్షకులందరికీ చేరువ చేస్తోంది. ఆరేళ్ల తర్వాత గాంధీ ‘ది హెరిటేజ్‌ ల్యాబ్‌’ను నెలకొల్పింది. ఇందుకు కారణం గురించి చెబుతూ... ‘‘మ్యూజియంలు, గ్యాలరీలు ఆన్‌లైన్‌లో కనిపించవు. వీటిలోని కళాఖండాలను చూడాలంటే దేశాలు తిరగవలసిందే! అదే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాగలిగితే వాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం, గుర్తింపు తీసుకురావచ్చు. అలాగే వాటిని ఆరాధించే కళాప్రేమికులకు కనువిందును కూడా అందించవచ్చు. ది హెరిటేజ్‌ ల్యాబ్‌ రూపకల్పన వెనకున్న ఆలోచన ఇదే!’’ అంటూ చెప్పుకొచ్చింది గాంఽధీ! ప్రస్తుతం ఈమె యూరోపీనా, కామన్‌వెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూజియమ్స్‌ అడ్వయిజరీ బోర్డు మెంబర్‌గా పని చేస్తోంది. 2020కి మందు వరకూ ఏవో కొన్ని సంస్థలు మినహా వర్చువల్‌ గ్యాలరీ ఆవశ్యకత గురించిన ఆలోచన చేయలేదు. ఆ అవసరాన్ని గ్రహించిన అతి తక్కువ మంది భారతీయుల్లో గాంధీ ఒకరు.


మీమ్స్‌, జిఫ్ఫీలుగా... 

కొవిడ్‌ పాండమిక్‌తో మొదలైన లాక్‌డౌన్‌ సమయం తన వెబ్‌సైట్‌కు మరింత ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది అంటున్న గాంధీ ఆన్‌లైన్‌ మ్యూజియం లక్ష్యం గురించి చెబుతూ... ‘‘మ్యూజియంలలో కళాఖండాలను బ్రష్‌తో శుభ్రం చేసి ప్రదర్శించడం మినహా వాటికి అదనపు ఆకర్షణలు జోడించే వీలుండదు. కానీ నేను ప్రదర్శనకు ఉంచే కళాఖండాలు నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, కళాభిమానుల్లో దాగిన సృజనాత్మకతలను కూడా వెలికి తీస్తాయి. ఆసక్తి కలిగిన వీక్షకులు తమలో దాగిన కళాభిరుచిని కూడా ప్రదర్శించుకోవచ్చు. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించి, కళాఖండాలతో మీమ్స్‌, జిఫ్ఫీలను తయారుచేసి ప్రదర్శిస్తున్నాను. ఇందుకోసం వెబ్‌సైట్‌లో మీమ్‌ మేకర్స్‌ ఉంటారు. వీళ్లు వేర్వేరు మ్యూజియంలు, గ్యాలరీలతో అనుసంధానమై పని చేస్తారు. వాటిలోని కళాఖండాలతో కూడిన జిఫ్‌ తయరీ పోటీలు, జిగ్‌సా పజిల్స్‌ను వెబ్‌సైట్‌లో వీక్షకుల కోసం అందుబాటులో ఉంచుతూ ఉంటారు. ఇది కేవలం కాలక్షేపం కోసం తయారుచేసిన వెబ్‌సైట్‌ కాదు. ఈ వెబ్‌సైట్‌ సహాయంతో విద్యార్ధులకు మన చారిత్రక ఆర్ట్‌, ఆర్టిఫ్యాక్ట్స్‌ గురించి కూడా బోధించవచ్చు’’ అని చెబుతోంది గాంధీ.


కళాభిరుచి కలిగిన మహిళామణులు!

గాంధీ కళ కోసం పాటుపడిన, మరుగున పడిపోయిన అలనాటి మహిళామణుల కథలను కూడా తన వెబ్‌సైట్‌ ద్వారా వెలుగులోకి తెస్తోంది. ఇందుకోసం వీకీపీడియా ఎడిటథాన్స్‌ను ఏర్పాటుచేసి, ఉర్దూ కవయిత్రి మా లకా బాయితో పాటు, 1980లో పేరుపొందిన కోల్‌కతాకు చెందిన మహిళా కళాకారుల కథలను కూడా సేకరించి, వెబ్‌సైట్‌లో ఉంచింది. ‘‘ఇంటిపట్టున గడిపే సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, కళాపోషణతో మనసును రంజింపజేసుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం కళను ఉపయోగించుకోవచ్చు’’ అంటూ... లాక్‌డౌన్‌ సమయాన్ని ఆన్‌లైన్‌ గ్యాలరీలు, మ్యూజియంలలోని కళాఖండాలను వీక్షించి, ఆదరించడానికి ఉపయోగించుకోవాలని చెబుతోంది మేధావి గాంధీ. 

Advertisement
Advertisement