ఇక రేషన్‌ సులభం

ABN , First Publish Date - 2022-07-18T03:53:42+05:30 IST

రేషన్‌ దుకాణాల్లో సరుకులు తీసుకునే వినియోగదారులకు తిప్పలు తప్పనున్నాయి. రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం 4జీ సేవలు ఉండే పీవోఎస్‌ మిషన్లు అందించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి.

ఇక రేషన్‌ సులభం

-సర్వర్‌ పరేషాన్లు దూరం..

-రేషన్‌ డీలర్లకు 4జీ పీవోఎస్‌ మిషన్లు

-లబ్ధిదారులకు వేగంగా అందనున్న సేవలు 

-ఈపోస్‌ ద్వారా సిగ్నల్‌ సమస్యలకు చెక్‌..

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 17: రేషన్‌ దుకాణాల్లో సరుకులు తీసుకునే వినియోగదారులకు తిప్పలు తప్పనున్నాయి. రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం 4జీ సేవలు ఉండే పీవోఎస్‌ మిషన్లు అందించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. 4జీ సేవలు అనుసంధానమైన ఈపాస్‌ పరికరాలు అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు సమయం వృధా కాకుండా వెంటనే సరుకులు అందే వీలు కలిగింది. ఇక నుంచి ఈవిధానం ద్వారా అటు డీలర్లకు, ఇటు ప్రజలకు పడిగాపులు, ప్రయాస ఉండవంటున్నారు. 

తప్పిన పడిగాపులు..

ఇంతకు ముందు రేషన్‌ దుకాణాల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. రేషన్‌ దుకాణాల్లో ఐరిష్‌, వేలిముద్ర ద్వారా సరుకులు ఇచ్చేవారు. అయితే సాంకేతికంగా అనేక సమస్యలు వచ్చేవి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం నూతనంగా ఈపాస్‌ యంత్రాలు ఆయా దుకాణాలకు పంపిణీ చేయడంతో ఇబ్బందులు తప్పుతున్నాయి. గంటల తరబడి దుకాణం వద్ద పడిగాపులు పడే అవకాశాలు తప్పినట్లు వినియోగదారులు చెబుతున్నారు.

మండలాలు.. 15

పంచాయతీలు.. 335

రేషన్‌ దుకాణాలు..278

ఆహార భద్రత మొత్తం కార్డులు.. 1.40లక్షలు 

లబ్ధిదారులు మొత్తం : 4.64లక్షలు 

అంత్యోదయ కార్డులు: 13,024

సాంకేతికతతో వేగవంతంగా సేవలు..

ఇంటర్‌నెట్‌లో అంతరాయంతో పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈ పాస్‌ యంత్రాలపై డీలర్లకు శిక్షణ ఇచ్చారు. దీంతో జూలై నుంచి ఇచ్చే సరుకులను వేగవంతంగా అందించేందుకు డీలర్లకు అవకాశం కలిగింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో డీలర్లకు ఆసిఫాబాద్‌లో అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో ప్రతీ డీలర్‌ ఈపాస్‌ యంత్రంపై అవగాహన పెంపొందించుకున్నారు.  ప్రస్తుతం ఆయా దుకాణాల్లో ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు.

అందుబాటులోకి కొత్త యంత్రాలు

ఈ పాస్‌ మిషన్ల ద్వారా సరుకుల పంపిణీ సులభతరంగా మారిందని డీలర్లు పేర్కొంటున్నారు. డీలర్‌ రేషన్‌ కార్డు సంఖ్య నమోదు చేయగానే పూర్తి స్థాయి వివరాలు మిషన్లో కనిపిస్తాయి. వివరాలను సరి చూసుకున్న తర్వాత డీలర్‌ కుటుంబ యజమాని వేలిమద్రను మిషన్‌పై తీసుకుంటాడు. అనంతరం ప్రక్రియ పూర్తై రశీదు వస్తుంది. గతంలో ఇచ్చిన యంత్రాల కాలపరిమితి ముగియడంతో ప్రస్తుతం 4జీ, 5జీ సేవలకు వాడే పరికరాలు ఇచ్చారు. దీంతో లబ్ధిదారులకు వేగంగా సేవలు అందుతున్నాయి.  

సిగ్నల్స్‌ రాని చోట కూడా సేవలు అందుతాయి

-స్వామి కుమార్‌, డీఎస్‌వో, ఆసిఫాబాద్‌ 

సాంకేతిక సమస్యలతో లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేం దుకే ఈ విధానం అమలు చేస్తున్నాం. సిగ్నల్స్‌ అందని దూరప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్‌ సేవలు అందుతాయి. గతంలో 2జీ, 3జీ ఉపయోగంలో ఉండేది. ప్రస్తుతం విజన్‌టెక్‌ సంస్థ ద్వారా చేతిలో సులభంగా అమరిపోయే మిషన్స్‌ పంపిణీ చేశాం. దీంతో నెట్‌వర్క్‌ సేవల వేగం ఎక్కువగా ఉండడంతో పాటు సేవల్లో జాప్యం కలుగదు. ఒక్కోటి రూ.9వేల విలువ గల మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ సారి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవుతుండడం వలన చక్కగా పని చేస్తుంది. లబ్ధిదారుడికి రశీదు కూడా ఇస్తారు. మిషన్‌కయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

Updated Date - 2022-07-18T03:53:42+05:30 IST