ఇంతా చేసి... నెత్తుటి మరకలా ముగిసిపోతున్నాం!

ABN , First Publish Date - 2020-09-28T06:18:47+05:30 IST

అందమైన ఆకుపచ్చని మైదానాలు ఇచ్చావు అందులో ఉల్లాసంగా గంతులేసే పసితనాన్ని మేం పోగొట్టుకున్నాం పూలతోటలతో...

ఇంతా చేసి... నెత్తుటి మరకలా ముగిసిపోతున్నాం!

అందమైన ఆకుపచ్చని మైదానాలు ఇచ్చావు

అందులో ఉల్లాసంగా గంతులేసే పసితనాన్ని మేం పోగొట్టుకున్నాం


పూలతోటలతో కళకళలాడుతూ పరిమళాలు వీచే లోయలెన్నో ఇచ్చావు

ఆ లోయలలో తూనీగల్లా ఎగిరేందుకు రెక్కలున్నాయన్న సంగతే మరిచిపోయాం


ఆకాశాన్ని బంగారం చేసే ధగధగల ఉదయాన్నిచ్చావు

మేం గనులను తొలుస్తూ దేహాన్ని రెండు దీపాలుగా వెలిగించే కనులను కోల్పోయాం


జలజల పారే సెలయేళ్ళనీ పరవశంతో జారిపడే జలపాతాలనీ ఇచ్చావు

ఆ పరవశంలో ఒళ్ళంతా తుళ్ళిపడేలా తడిసిపోగల నగ్నత్వానికి దూరమయ్యాం


ఎడారి ఏకాంత వర్ణం మీద గాలి పాడే సోయగాల గీతాన్నిచ్చావు

మేం ఎండమావుల తగరపు తీగల మీద కర్ణభేరుల్ని పారేసుకున్నాం


రంగు రంగుల పక్షుల్నీ పక్షుల మీద మబ్బుల్నీ మబ్బుల నుంచి వానల్నీ ఇచ్చావు

మేం చుట్టూ గోడలు కట్టుకుని పైన కప్పు కూడా వేసుకున్నాం


మిలమిలమెరిసే నక్షత్రాల అంతరిక్షాన్ని కౌగిలిగా ఇచ్చావు

మేం ఆవలి తీరాలకు చేర్చే ప్రేమని మరచి ఒంటరిగా మిగిలాం


నిక్కమైన చీకట్లో కోసుల దూరం పరిచిన స్వప్నాలను ఇచ్చావు

మేం నిదురకు దూరమై దారి తప్పాం


ఆకాశదేహాల వంటి 

పూలతోటల వంటి 

సెలయేళ్ళ వంటి

ఎడారులూ, పక్షులూ, మబ్బులూ, వానల వంటి

చెక్కిన దీపం వంటి

చిక్కని చీకటి వంటి

స్త్రీని ఇచ్చావు

మేం 

దేహాన్ని 

వెలిగించలేక 

వెలిగించుకోలేక

తగలబెడుతున్నాం

తగలబడిపోతున్నాం


పుట్టుకకూ చావుకూ మధ్య వంతెనలా నిలిచిన ఇంద్రధనుస్సు

చూపుడు వేలు అందిస్తే

చేతులు ఖాళీలేక పట్టుకోలేక

ప్రతిక్షణం శ్మశానం వైపు అడుగులు వేస్తున్నాం.

ఇంతా చేసి...

ఒక నెత్తుటి మరకలా ముగిసిపోతున్నాం.

పసునూరు శ్రీధర్‌బాబు


Updated Date - 2020-09-28T06:18:47+05:30 IST