అన్నదాతకు అండగా రైతుబంధు

ABN , First Publish Date - 2022-06-30T04:35:47+05:30 IST

ఆలస్యంగానైనా రైతులకు రైతుబంధు సహాయం అందుతోంది. రెండు రోజులుగా రైతుల ఖాతాల్లో వానాకాలం సాగుకు రైతుబంధు పథకం నిధులను జమ చేస్తున్నారు.

అన్నదాతకు అండగా రైతుబంధు

 - 1,41,265 మంది రైతుల ఖాతాల్లో రూ. 86.54 కోట్ల జమ

- వానాకాలంలో 1,93,330 మందికి రూ. 181.89 కోట్ల సాయం

- ఎనిమదో విడతలో కొత్తగా 7,278 మంది రైతుల గుర్తింపు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)


ఆలస్యంగానైనా రైతులకు రైతుబంధు సహాయం అందుతోంది. రెండు రోజులుగా రైతుల ఖాతాల్లో వానాకాలం సాగుకు రైతుబంధు పథకం నిధులను జమ చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 1,41,265 మంది రైతుల ఖాతాల్లో 86 కోట్ల 54 లక్షల 27,263 రూపాయలు జమ చేయాలని ట్రెజరీకి నిధులు పంపించారు. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో, రెండో రోజు రెండెకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. వానాకాలంలో జూన్‌ మొదటివారం వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతుబంధు సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గత యాసంగితో పోలిస్తే 7,278 మంది రైతులకు అదనంగా రైతుబంధు సాయం అందనున్నది. యాసంగిలో 1,86,052 మంది రైతులను ప్రభుత్వం గుర్తించగా ఇప్పుడు ఆ సంఖ్య 1,93,330కి చేరింది. వీరందరికి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందించేందుకు 181 కోట్ల 89 లక్షల 1,394 రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. 


 వివరాలు సమర్పించని రైతులు 14,421 మంది


ఇప్పటి వరకు రైతులు సమర్పించిన పట్టాదారు వివరాలు, ఖాతా వివరాల మేరకు వ్యవసాయ విస్తరణ అధికారులు 1,78,909 మంది రైతుల ఖాతాలను అప్‌డేట్‌ చేయగా, మండల వ్యవసాయాధికారులు 1,78,300 మంది వివరాలను పరిశీలించి ధృవీకరించారు. వీరిలో గత రెండు రోజులుగా 1,41,265 మందికి రైతుబంధు సహాయం అందించేందుకు ట్రెజరీకి పంపించారు. ఇంకా 14,421 మంది రైతులకు సంబంధించిన వివరాలను వ్యవసాయాధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. వీరిలో 7,278 మంది కొత్తవారు కాగా మిగతావారు ఏడు విడతల్లో కూడా వివరాలు సమర్పించనివారే ఉన్నారు. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న భూముల్లో లే అవుట్లు చేయడం, చాలామంది గుంట లేక రెండు, మూడు గుంటల స్థలాలు ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేయడంతో అందుకు సంబంధించిన భూమి నాలా కన్వర్షన్‌ కాలేదు. దీంతో ఆ భూమి మొత్తం వ్యవసాయ భూమిగానే రికార్డులో ఉండి రైతుబంధు నిధులు విడుదలవుతున్నాయి. అలాంటివారు కూడా కొందరు రైతుబంధు సాయం పొందుతుండగా మరికొందరు వివరాలు సమర్పించక నిధులు పొందలేకపోతున్నారు. 


 ఏడు విడతలుగా అందిన సాయం...


జిల్లాలో రైతుబంధు సాయం అందించడం 2018లో ప్రారంభమయింది. 2018 వానాకాలంలో జిల్లాలోని 1,45,245 మంది రైతులకు 124 కోట్ల 58 లక్షల 85,100 రూపాయలు, యాసంగిలో 1,34,152 మంది రైతులకు 123 కోట్ల 58 లక్షల 87,290 రూపాయలు అందించారు. 2019 వానాకాలంలో 1,48,893 మంది రైతులకు 152 కోట్ల 20 లక్షల 7,656 రూపాయలు, యాసంగిలో 1,40,399 మంది రైతులకు 128 కోట్ల 37 లక్షల 54,670 రూపాయలు అందించారు. 2020 వానాకాలంలో 1,65,425 మంది రైతులకు 173 కోట్ల 99 లక్షల 37,452 రూపాయలు, యాసంగిలో 1,68,790 మంది రైతులకు 175 కోట్ల 64 లక్షల 45,464 రూపాయలు, 2021 వానాకాలంలో 1,73,728 మంది రైతులకు 176 కోట్ల 37 లక్షల 53,891 రూపాయలు, 2021 యాసంగిలో 1,77,451 మంది రైతులకు 176 కోట్ల 72 లక్షల 31 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించారు. ప్రస్తుతం వానాకాలంలో 1,93,330 మంది రైతులకు 181 కోట్ల 89 లక్షల 01,394 రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. 


 ఊపిరి పీల్చుకున్న రైతులు


రైతుబంధు సాయం ఖాతాల్లో జమ అవుతుండడంతో పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున అందుతున్న ఈ సాయంతో ఎరువులు, విత్తనాల కోసం అప్పులు చేయాల్సిన అవసరం తప్పిందంటున్నారు. వానాకాలం సాగు సాఫీగా సాగాలంటే పంట రుణాల మంజూరును కూడా వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు కురుస్తూ సాగుకు పెట్టుబడులు పెట్టే సమయం ఆసన్నమైనా బ్యాంకు అధికారులు మాత్రం పంట రుణాలను జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో అమ్మిన వరిధాన్యం డబ్బులు కూడా పూర్తిస్థాయిలో ఇంకా రైతులకు అందలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయాలని వారు కోరుతున్నారు. 


 పోస్టాఫీసుల్లో రైతుబంధు సాయం పొందవచ్చు...

  జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌


జిల్లాలోని రైతుబంధు లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రైతుబంధు నిధులను సమీపంలోని పోస్టాఫీసుల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా విత్‌డ్రా చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. జిల్లాలోని 215 పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం ఉందని, వినియోగదారుడి ఆధార్‌ నంబర్‌, వేలిముద్ర ద్వారా తక్షణమే డబ్బు తీసుకోవచ్చని, రైతులందరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని శ్రీధర్‌ సూచించారు. 


Updated Date - 2022-06-30T04:35:47+05:30 IST