Jun 14 2021 @ 02:11AM

అందమా... అందునా!?

అందం అంటే ఏమిటి? రంగు... రూపమేనా...!? కథానాయికలు అంటే... కుందనపు బొమ్మలేనా!? ప్రయోగాలకు కథానాయికలు అందుబాటులో లేరా!?  కానే కాదు! ఆ మాట  అనుకోవడం కరెక్ట్‌ కూడా కాదు. ఎందుకంటే....అందం కంటే అభినయమే ముఖ్యమంటున్నారు నాయికలు.  ఈ క్రమంలో గ్లామర్‌ను కూడా  పక్కనపెట్టడానికి సిద్ధపడుతున్నారు. కథ, పాత్ర నచ్చితే... మిగతా విషయాలు పట్టించుకోవడం లేదు. డీగ్లామరైజ్డ్‌ పాత్రలు పోషించడానికి కూడా సై అంటున్నారు. అదే పాత్రకు అందం తీసుకొస్తుందని నమ్ముతున్నారు


‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో చూశారా!? నిజ జీవితంలో, సినిమాల్లో కనిపించే సమంతకు... ఆ  సిరీస్‌లో సమంత(రాజీ)కు ఎంతో వ్యత్యాసం ఉంది.  సగటు వాణిజ్య హంగులున్న చిత్రాల్లో మేని ఛాయతో మెరిసిపోయే సమంత... ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో మాత్రం నల్లగా కనిపించారు. శరీర రంగును తగ్గించారు. కమర్షియల్‌ కథానాయికగా, నటిగా తెలుగులో ఉన్నత స్థానంలో ఉంటూ... అటువంటి పాత్రలో నటించడం ప్రశంసనీయమని సమంతను పొగిడినోళ్లు ఉన్నారు. కంగనా రనౌత్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి కథానాయికలు రాజీగా సమంత నటనతో ప్రేమలో పడ్డామని ఆకాశానికి ఎత్తేశారు. అదే సమయంలో సమంతను తెగిడినోళ్లూ ఉన్నారు. సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైనప్పట్నుంచీ... విమర్శలు వస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే... సిరీస్‌లో సమంత రంగుపై కూడా రావడం! తమిళులను కించపరిచేలా, కావాలని సమంతను నల్లగా చూపించారని కొందరు కామెంట్లు చేశారు. షో క్రియేటర్లు రాజ్‌, డీకే వరకూ అవి వెళ్లాయి. ‘అందాన్ని కాకుండా పాత్రను మాత్రమే చూపించాలని అనుకున్నాం’ అని వారు వివరణ ఇచ్చారు. అయితే... సమంత రంగుపై చెలరేగిన విమర్శల నేపథ్యంలో అందం అంటే ఏమిటనే కొత్త చర్చ మొదలైంది.


కథానాయికలు గతంలోలా  కుందనపు బొమ్మల్లా  కనిపించాలని కోరుకోవడం లేదు. తమలో నటనను వెలికి తీసే పాత్రలు లభిస్తే... అవకాశాలు వస్తే... డీ-గ్లామర్‌గానూ కనిపించడానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ‘బాహుబలి’లో యువరాణి దేవసేనగా అనుష్క అందంగా కనిపించారు. మరి, బందీగా పుల్లలు ఏరుకునే సన్నివేశాల్లో? అందానికి కాకుండా... పాత్రకు ప్రాముఖ్యం ఇచ్చి, అందుకు తగ్గట్టు కనిపించారు. ‘బాహుబలి’లో మరో కథానాయిక తమన్నా సైతం గుహల్లో తలదాచుకునే సన్నివేశాల్లో డీ-గ్లామర్‌గా కనిపించారు. ‘అభినేత్రి’లోనూ తమన్నా రెండు షేడ్స్‌ ఉన్న రోల్‌ చేశారు. గ్లామరస్‌గా, మేకప్‌ లేకుండా... రెండు కోణాలు చూపించారు. ‘రక్త చరిత్ర’లో రాధికా ఆప్టే మేకప్‌ లేకుండా సహజంగా నటించారు. వివాదాస్పద చిత్రాల్లో ఒకటైన ‘దండుపాళ్యం-2’లో సంజనా గల్రానీది డీ-గ్లామర్‌ లుక్కే. తమిళ అనువాదం ‘యుగానికి ఒక్కడు’లో కథానాయిక రీమా సేన్‌, ఆండ్రియా పాశ్చాత్య దుస్తుల్లో కనిపించినప్పటికీ... రూపురేఖలు చూస్తే గ్లామర్‌గా ఉండవు. తమిళ తెరకు ‘ఇరుది సుట్రు’, తెలుగు తెరకు ‘గురు’(ఇరుది సుట్రు రీమేక్‌. మాతృకలో తన పాత్రను మళ్లీ పోషించారు)తో పరిచయమైన రితికా సింగ్‌... తొలి చిత్రంలో సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్ర చేశారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌, ‘అనగనగా ఓ అతిథి’లో అందుకు పూర్తి భిన్నంగా కనిపించారు.


ప్రస్తుతం డీ-గ్లామర్‌ పాత్రలు చేస్తున్న కథానాయికల విషయానికి వస్తే... ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో హెబ్బా పటేల్‌ను చెప్పుకోవాలి. ‘కుమారి 21 ఎఫ్‌’ నుంచి ‘రెడ్‌’ లో  ప్రత్యేక గీతం వరకూ... గ్లామర్‌కు నిర్వచనం ఇచ్చే  పాత్రల్లోనే ఆమె నటించారు. కానీ,  ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ లో తొలిసారి ప్రయోగం చేస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ పాత్ర డీ-గ్లామర్‌గా ఉంటుందని వినికిడి. అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో రష్మికా మందన్న పాత్ర కూడా డీ-గ్లామరేనట. ఇప్పటికే విడుదలైన టీజర్లలో పసుపురంగు చీరలో కొత్తగా కనిపించారు.


ఇప్పుడు అందానికి కథానాయికలు ఇచ్చే నిర్వచనం మారిందని చెప్పుకోవాలి. బాహ్య సౌందర్యం కంటే పాత్రలో సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎంతసేపూ బాపు బొమ్మలా కనిపించడం కంటే బాగా నటించే పాత్రలు వస్తే చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. హిందీ కథానాయికల ఆలోచనా విధానమూ ఇదే విధంగా ఉంది. ‘బ్లాక్‌’లో రాణీ ముఖర్జీ, ‘బర్ఫీ’లో ప్రియాంకా చోప్రా, ‘ఎన్‌హెచ్‌ 10’లో అనుష్కా శర్మ, ‘హైవే’లో ఆలియా భట్‌ డీ-గ్లామర్‌ రోల్స్‌ చేశారు. ఇప్పుడు కొత్త కథలతో కథానాయికల దగ్గరకు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని వీళ్లను చూస్తే అర్థమవుతుంది కదూ! ‘అందమా... ప్రయోగాత్మక పాత్రలకు అందునా?’ అంటే... ‘అందును’ అనే సమాధానం వస్తుంది. ‘ఇటువంటి పాత్రలందునా అందం చూస్తారా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.